Begin typing your search above and press return to search.

కిమ్ జాంగ్ సరసన మోడీ.. పత్రిక స్వేచ్ఛను హరిస్తున్నారట.?

By:  Tupaki Desk   |   7 July 2021 5:34 AM GMT
కిమ్ జాంగ్ సరసన మోడీ.. పత్రిక స్వేచ్ఛను హరిస్తున్నారట.?
X
‘ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. పత్రికా స్వేచ్ఛకు విలువ లేదురా’ అని ఇప్పుడు పాటలు పాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అమెరికా, బ్రిటన్, భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో కూడా మీడియా గొంతు నొక్కేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుగా ఉన్న భారత్ లోనూ.. అదీ మోడీ సర్కార్ హయాంలో పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటికి బలం చేకూరేలా తాజాగా ఓ సర్వే వెల్లడించింది.

అమెరికాలో పత్రికా స్వేచ్ఛపై గత అధ్యక్షుడు ట్రంప్ నోరుపారేసుకున్నాడు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ట్రంప్.. ఆ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చాడు. 2016లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. అప్పటినుంచి తనకు వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియా సంస్థలపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఆయన కొన్ని మీడియా సంస్థలను అమెరికా ప్రజలకు శత్రువులుగా అభివర్ణించారు. అంతేకాకుండా ఓ పత్రికా సమావేశంలో తనను ఇబ్బందికర ప్రశ్న అడిగిన సీఎన్ఎన్ చానెల్ రిపోర్టర్ ను ఇకపై తన సమావేశాలకు హాజరుకాకుండా నిషేధం విధించారు. ఇలా ఎన్నోసార్లు మీడియాపై కత్తిగట్టిన ట్రంప్ అన్ని మీడియా సంస్థలు ఏకమై మీడియా స్వేచ్ఛ లేకపోతే ఆ దేశానికి అక్కడి ప్రజలకు స్వేచ్ఛ లేనట్లేనని ట్రంప్ చర్యలను తూలనాడాయి. ఇలా మీడియా సంస్థలన్నీ సంపాదకీయాలు, కథనాలతో ట్రంప్ ను ఉతికి ఆరేయడం అమెరికాలో నాడు హాట్ టాపిక్ గా మారింది.

ఇక భారత్ లోనూ పత్రికా స్వేచ్ఛకు తిలోదకాలిచ్చారని ‘రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్’ అనే అంతర్జాతీయ సర్వే సంస్థ వెల్లడించింది. భారత ప్రధాని నరేంద్రమోడీ పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని.. పత్రికా స్వేచ్ఛ పాలిట కాలయములైన 37 మంది దేశాధినేతల్లో మోడీ ఒకరని ఆ అంతర్జాతీయ సర్వే సంస్థ వెల్లడించింది.

ఈ లిస్టులో భారత ప్రధాని మోడీతోపాటు ఉత్తరకొరియా అధ్యక్షుడు నియంత అయిన కిమ్ జోంగ్ ఉన్, ఇమ్రాన్ ఖాన్, సౌదీ అరేబియా రాజు, మయన్మార్ సైనికాధిపతి ఉండడం విశేషం. ప్రజాస్వామ్య భారత దేశంతో ఇక నియంత దేశాలను పోల్చడం నిజంగానే అవమానంగా భావించాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నరేంద్రమోడీ 2024లో ప్రధాని అయ్యాక మీడియాలో తన ప్రసంగాలను పదే పదే వచ్చేట్లు మేనేజ్ చేశారని ఆ సంస్థ తెలిపింది.