Begin typing your search above and press return to search.

ఒబామా లెగసీలో మోడీ పార్ట్ ఏంటి?

By:  Tupaki Desk   |   28 July 2016 3:46 PM IST
ఒబామా లెగసీలో మోడీ పార్ట్ ఏంటి?
X
అమెరికా అధ్యక్షుడిగా రెండు టెర్ముల పాలనను త్వరలో ముగించుకోబోతున్న బరాక్ ఒబామా గొప్పదనం - ఆయన సాధించిన ఘనతలపై ఒక షార్టు ఫిల్మును చిత్రీకరించారు. డెమొక్రటిక్ కన్వెన్షన్ కోసం రూపొందించిన ఈ చిత్రంలో భారత ప్రధాని మోడీకి కూడా స్థానమివ్వడం విశేషం. ఈ ఫిల్ములో భారత ప్రధాని నరేంద్ర మోడీ - ఒబామా కలిసి ఉన్న ఒక ఫొటోను వాడుకున్నారు. ఐదు నిమిషాల నిడివి గల ఈ షార్ట్ ఫిల్మ్ లో మోడీ కనిపించగానే అక్కడ డెమొక్రటిక్ నేతలు కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారని తెలుస్తోంది.

అమెరికాకు - డెమొక్రటిక్ పార్టీకి సంబంధించిన ఈ చిత్రంలో మోడీ కనిపించడం అరుదైన గౌరవంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ చిత్రంలో కనిపించిన ఏకైక విదేశీ నేత మోడీయే. రెండు టెర్ముల ఒబామా పాలన సమయంలో మోడీ ఇండియాలో అధికారంలో ఉన్నది రెండేళ్లు మాత్రమే. అయినా... మోడీకి అంతగా ప్రాధాన్యమిచ్చి అందులో చోటివ్వడం గొప్ప విషయమే. పైగా సుమారు పదేళ్ల కాలానికి సంబంధించి కేవలం అయిదు నిమిషాల అతి తక్కువ నిడివితో తీసిన చిత్రంలో మోడీని కూడా చూపించారంటే ఎంతగా ప్రాధాన్యం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు.

అమెరికాకు సంబంధించిన బయటి వ్యక్తుల్లో మోడీ కాకుండా మరో వ్యక్తి మాత్రమే ఇందులో కనిపిస్తారు. ఆయన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్. అయితే.. ఐక్యరాజ్యసమితిలో అమెరికా కీలక పాత్ర నేపథ్యంలో ఆయన్ను చూపించారని అనుకున్నా ఏమాత్రం సంబంధం లేని భారత ప్రధానికి అందులో చోటివ్వడం విశేషమే. కాగా ఒబామా పాలనలో సాధించిన విజయాలను ఈ చిత్రంలో ప్రముఖంగా వివరించనున్నారు. ఒబామా పాలనలో అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం నుంచి అల్ ఖైదా చీఫ్ లాడెన్ ను హతమార్చడం వరకు ఉన్న ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి.