Begin typing your search above and press return to search.

మోడీ సెంటిమెంట్ కు బెంగాలీలు పడతారా?

By:  Tupaki Desk   |   28 March 2016 4:33 AM GMT
మోడీ సెంటిమెంట్ కు బెంగాలీలు పడతారా?
X
ఐదు రాష్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల మీద ప్రధాని మోడీ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. పార్టీ విజయవకాశాలు ఎక్కువగా ఉన్న అసోం మీద ఫుల్ ఫోకస్ చేసిన ఆయన.. బెంగాల్ లో తమ బలాన్ని వీలైనంత పెంచుకోవాలన్న ఆశతో ఉన్నారు. సుడి బాగుండి ఏమాత్రం కలిసి వచ్చినా బెంగాల్ రాజకీయాల్లో సరికొత్త శక్తిగా ఆవిర్భవిస్తామన్న ఆశతో ఆయన ఉన్నారు. సహజంగానే మాటకారి ఆయిన ఆయన బెంగాలీలను ఉద్దేశించి చేస్తున్న ప్రసంగాలు హార్ట్ టచ్చింగ్ గా ఉన్నాయి. బెంగాలీలు ఎంత మొనాగళ్లంటే అంటూ పొగిడేస్తున్న ఆయన.. వారిలో సెంటిమెంట్ ను రాజేసే ప్రయత్నంలో ఉన్నారు.

బెంగాల్ లో కొట్టుకునే కమ్యూనిస్ట్ లు.. కాంగ్రెస్ పార్టీలు కేరళ ఎన్నికల్లో మాత్రం అందుకు భిన్నంగా చెట్టాపట్టాలు వేసుకోవటం ఏమిటంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. బెంగాలీలను మోసం చేస్తున్న ఆ పార్టీలకు బుద్ధి చెప్పరా? అంటూ ఏం మాట్లాడితే బెంగాలీలు రియాక్ట్ అవుతారో అదే తరహాలో మాట్లాడటం గమనార్హం.

తన రాజకీయ ప్రత్యర్థులైన తృణమూల్..కాంగ్రెస్.. వామపక్షాలపై హోల్ సేల్ గా విరుచుకుపడుతున్న ఆయన.. దేశంలో సరస్వతీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది పశ్చిమ బెంగాలేనంటూ పొగిడేస్తున్నారు. వివేకం.. తార్కికత ఎక్కువగా ఉండే బెంగాలీల్లో ఉన్న వాటిని సవాల్ చేయాలని ప్రయత్నిస్తే అది పశ్చిమబెంగాల్ కే అవమానమని వ్యాఖ్యానిస్తున్నారు.

అలాంటి వైఖరుల్ని బెంగాలీలు అస్సలు ఒప్పుకోరని.. వామపక్షాలు.. కాంగ్రెస్ లు కలిసి తెర వెనుక ఆడుతున్న నాటకం బెంగాలీ ప్రజలకు అవమానకరంగా ఉందని ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. బెంగాల్ అధికారపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ కారణంగా రాష్ట్రం దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా అధికారంలో ఉన్న మమతా సర్కారు పుణ్యమా అని పశ్చిమబెంగాల్ పూర్తిగా ధ్వంసమైందని మోడీ మండిపడ్డారు. కమ్యూనిస్ట్ లు 34 ఏళ్లలో బెంగాల్ ను నాశనం చేస్తే.. ఐదేళ్ల వ్యవధిలో మమత మొత్తం సర్వనాశనం చేశారని మోడీ విరుచుకుపడ్డారు. మరి.. మోడీ మాటలకు బెంగాలీలు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఎన్నికల ఫలితాలు డిసైడ్ చేస్తాయని చెప్పొచ్చు.