Begin typing your search above and press return to search.

జడ్జిల ఇష్యూలో మోడీ మర్క్ మొండితనం

By:  Tupaki Desk   |   15 Aug 2016 5:03 AM GMT
జడ్జిల ఇష్యూలో మోడీ మర్క్ మొండితనం
X
దూకుడుకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు ప్రధాని నరేంద్రమోడీ. నిజానికి భారత్ కు పరిచయమైన ప్రధానుల తీరు కాస్త భిన్నం. వారు వ్యవస్థలతో వాదనకు దిగటానికి పెద్దగా ప్రయత్నించిన రకం కాదు. ఏదైనా అంశం వివాదాస్పదం అవుతుందన్న భావన కలిగితే.. వీలైనంతవరకూ ఆ వివాదానికి దూరంగా ఉండాలని భావించటమే కాదు.. వ్యవస్థతో ఢీ అంటే ఢీ అనేందుకు సిద్ధమయ్యే వారు కాదు. కానీ.. ప్రధాని మోడీ తీరు ఇందుకు భిన్నం. తాను అనుకున్నది జరగాలన్న విషయంలో పట్టుదల.. తానేం చేయాలన్న అంశంపై ఆయన అనుకున్నది అనుకున్నట్లుగా పని పూర్తి కావాలన్నమొండితనం ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంటుంది. తాజాగా నెలకొన్న సుప్రీం కోర్టుతో పంచాయితీ చూస్తే..ఈ విషయం మరింత ఈజీగా అర్థమవుతుంది.

న్యాయమూర్తుల నియమకానికి సంబంధించి కేంద్రం సమర్పించిన ప్రతిపాదనలపై సుప్రీం అభ్యంతరం వ్యక్తం చేయటం.. కేంద్రం ప్రతిపాదనలపై అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ వెనక్కితగ్గని కేంద్రం.. తాజాగా మరోసారి కొన్నిప్రతిపాదనల్ని సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలపై కూడా సుప్రీం అభ్యంతరం వ్యక్తం చేసేవిగా ఉండటం గమనార్హం.

సుప్రీం కొలీజియం అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు సవరణలు చేపట్టి తిరిగి పంపారు. కానీ.. ఇలా పంపిన ప్రతిపాదనల్లో కూడా వివాదాస్పద నిర్ణయాలు ఉండటంతో వీటికి సైతం తిరస్కరణ తప్పదన్న మాట వినిపిస్తోంది. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి గతంలో కేంద్రం ప్రతిపాదన చేసిన ప్రతిపాదనలు చూస్తే.. న్యాయమూర్తిగా కొలీజియం ప్రతిపాదించిన ఏ పేరునైనా దేశ భద్రత.. ప్రజప్రయోజనాల కారణంగా తిరస్కరించే హక్కు తనకు ఉండాలని కేంద్రం భావిస్తోంది. అంతేకాదు.. న్యాయమూర్తుల నియామకానికి వచ్చే అప్లికేషన్ల తనిఖీకి రిటైర్ అయిన న్యాయమూరతులతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తానని చెబుతోంది. వడబోత తరవాత అప్లికేషన్లు కొలీజియంకు చేరతాయి. దీనిపై సుప్రీం కొలీజియం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఎందుకంటే..ఈ వడబోతతో ‘కేంద్రం కోరుకున్న’ అప్లికేషన్లు మాత్రమే వడబోతలో వస్తే అన్నదే ఇక్కడ ప్రశ్న. అందుకే.. ఈ ప్రతిపాదనలపై సుప్రీం నో చెప్పేసింది. ఇలాంటి ప్రతిపాదనలు చేయటం అంటే.. అది సుప్రీం పనిలో కేంద్రం వేలు పెట్టటంగా కొలీజియం అభివర్ణించింది. అంతేకాదు.. న్యాయమూర్తుల బదిలీలు.. నూతన న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన తన నిర్ణయాన్ని కేంద్రం అమలు చేయకపోవటంతో న్యాయం అందించే వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితి ఏర్పడుతుందని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకుర్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యలు చేయటం గమనార్హం. మూర్తీభవించిన మొండితనంతో వ్యవహరించే మోడీ.. జడ్జిల నియామకానికి సంబంధించిన ఇష్యూలోవెనక్కి తగ్గుతారా?లేక.. తన మాటలే అమలు కావాలని పట్టుబడతారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జడ్జిల విషయంలో కేంద్రం తన వైఖరికి వెనక్కి తగ్గకూడదన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే.. దేశంలోని రెండు ప్రధాన వ్యవస్థల మధ్య భారీ ప్రతిష్టంభన చోటు చేసుకుంటుందనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.