Begin typing your search above and press return to search.

మోడీకి ఆ ఎన్నిక‌లు ముస‌ళ్ల పండ‌గే..!

By:  Tupaki Desk   |   3 Aug 2016 7:46 AM GMT
మోడీకి ఆ ఎన్నిక‌లు ముస‌ళ్ల పండ‌గే..!
X
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌పైనే ప్ర‌ధాన పార్టీలు దృష్టిసారించాయి. ముఖ్యంగా ఈ ఎన్నిక‌ల‌ను బీజేపీ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంది.ఇప్ప‌టివ‌ర‌కూ జరిగిన ఎన్నిక‌ల్లో కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ అనుకూల ప‌వ‌నాలు వీచినా.. మ‌రికొన్ని చోట్ల ప్ర‌తికూల ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. దీంతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌ను ప్ర‌ధాని మోడీ - అమిత్ షా సీరియ‌స్‌ గా తీసుకున్నారు. అయితే ఇప్పుడు వీరికి గుజ‌రాత్ సీఎం ఆనంది బెన్ రాజీనామా గుదిబండ‌లా మారింది. ఈ ఆక‌స్మిక నిర్ణ‌యంతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ను ప‌క్క‌న‌పెట్టి.. గుజ‌రాత్ ఎన్నిక‌ల‌ గురించి ఆలోచించాల్సిన ప‌రిస్థితి. 2017లో ఈ రాష్ట్రంలో జ‌రిగే ఎన్నిక‌లు ఆషామాషీ కాద‌ని.. బీజేపీకి ముసళ్ల పండ‌గే అని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

భాజ‌పాకు కంచుకోట అయిన గుజ‌రాత్‌తో ఇప్పుడు ఆపార్టీ ఎదురీదుతోంది. రాజ‌కీయంగా బ‌ల‌మైన ప‌టేళ్లు రిజ‌ర్వేష‌న్ కోసం ఉద్య‌మించ‌డంతో బీజేపీకి ప్ర‌తికూల ప‌రిస్థితులు మొద‌ల‌య్యాయి. అలాగే ఊనాలోని కొందరు ద‌ళితుల‌పై మ‌త‌తత్వ శ‌క్తుల దాడులు బీజేపీ ప్ర‌తిష్ఠ‌ని మ‌రింత‌గా దిగజార్చాయి. దీంతో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కే అనుకున్న చోటే ఇప్పుడు అది ముస‌ళ్ల పండ‌గగా మారింది. ఇక పులిమీద‌పుట్ర‌లా ముఖ్య‌మంత్రి ఆనందీ బెన్ రాజీనామా.. ఇప్పుడు ఆ పార్టీని మ‌రింత‌గా ఇబ్బందిపెడుతోంది.

ఈ నేప‌థ్యంలో గుజ‌రాత్ ప‌రిస్థితుల‌పై.. ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న ఢిల్లీలో పార్లమెంట‌రీ పార్టీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. కొత్త సీఎం ఎంపిక‌ - రానున్న ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహాలపై చ‌ర్చించ‌నున్నారు. రాష్ట్రంలో ప‌రిస్థితుల‌ను సాధార‌ణ స్థితికి చేర్చి.. మ‌ళ్లీ బీజేపీకి పూర్వ వైభ‌వం తెచ్చే నేత ఎంపికే అజెండాగా సమావేశం జ‌ర‌గ‌నుంది. ఇదే విష‌యాన్ని బీజేపీ సైద్ధాంతిక కర్త హోదాలో ఆర్ ఎస్ ఎస్ కొన్ని సూచ‌న‌లు కూడా చేసింది.