Begin typing your search above and press return to search.

మోడీలో మొన‌గాడి ల‌క్ష‌ణాలు ఎన్ని?

By:  Tupaki Desk   |   1 July 2017 5:39 AM GMT
మోడీలో మొన‌గాడి ల‌క్ష‌ణాలు ఎన్ని?
X
మొన‌గాళ్లు చాలా మందే ఉన్నా.. మొన‌గాళ్ల‌కే మొన‌గాళ్లు చాలా చాలా త‌క్కువ మంది ఉంటారు. ఇలాంటి మొన‌గాళ్ల‌కు మొన‌గాడిలో ఉండే ప్ర‌ధాన ల‌క్ష‌ణం అంద‌రిని క‌లుపుకెళ్ల‌టం. భ‌జ‌న చేసే వారిని.. సాగిల‌ప‌డేవాడిని.. విధేయుల్ని క‌లుపుకెళ్ల‌టం మొన‌గాడిత‌నం అస్స‌లు అనిపించుకోదు. సానుకూల వేళ‌ల్లో చెల‌రేగిపోవటం ఎవ‌రికైనా సాధ్య‌మే. కానీ.. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ చెల‌రేగిపోవటం.. అంద‌రి మ‌న‌సుల్ని దోచుకోవ‌ట‌మే మొన‌గాడిత‌నం.

ఎంత‌కూ క‌లిసి రాని విప‌క్షాల మ‌న‌సు దోచుకోవ‌టం.. కీల‌క‌మైన అంశాల‌లో ఏకాభిప్రాయ సాధ‌న కోసం అవ‌స‌ర‌మైతే ఒక మెట్టు దిగేందుకు సైతం వెన‌కాడ‌ని త‌త్త్వం ఉన్నోడే అస‌లుసిస‌లు మొన‌గాడు. ఎందుకంటే.. చ‌రిత్ర‌లో వ్య‌క్తుల గొప్ప‌త‌నం కంటే వ్య‌వ‌స్థ గొప్ప‌త‌నానికే విలువ ఉంటుంది. అది అనుస‌రించే విధానాలే జాతి కీర్తిప్ర‌తిష్ఠ‌లకు కీల‌కంగా మార‌తాయి. పంచాయితీ స్థాయిలో ఉండే చిల్ల‌ర రాజ‌కీయాలు.. రాష్ట్ర స్థాయిలో ఉండే ఇష్టారాజ్య రాజ‌కీయాల‌కు త‌గ్గ‌ట్లే జాతీయ రాజ‌కీయాల్ని కూడా చూడాల‌నుకోవ‌టం అంత మంచిది కాదు.

అంత‌ర్జాతీయ నాయ‌కుడిగా త‌న‌ను తాను ఫోక‌స్ చేసుకునేందుకు త‌హ‌త‌హ‌లాడే మోడీ.. జాతీయ‌స్థాయిలో ఏకాభిప్రాయాన్ని సాధించే విష‌యంలో ఆయ‌న విఫ‌లం చెందుతున్నార‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. చారిత్ర‌క ప‌రిణామంగా చెప్పుకుంటున్న జీఎస్టీకి సంబంధించి పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్లో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన (సాంకేతికంగా కాద‌నుకోండి) కాంగ్రెస్ తో స‌హా ప‌లు రాజ‌కీయ పార్టీల‌ను ఈ ప్రోగ్రాంకు వ‌చ్చేలా చేయ‌టంలో విఫ‌ల‌మ‌య్యార‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

చ‌రిత్ర‌లో నిలిచిపోయే ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి శంకుస్థాప‌న క‌నుక ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏ రీతిలో అయితే.. పార్టీ కార్య‌క్ర‌మంగా మార్చేశారో.. మ‌రీ అంత స్థాయిలో కాకున్నా.. తాజాగా జీఎస్టీ ఎపిసోడ్‌ లో మోడీ తీరు ఇదే రీతిలో ఉంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఈ రోజు మోడీ తిరుగులేని నాయ‌కుడిగా క‌నిపించొచ్చు.

కానీ.. అది శాశ్వితం కాద‌న్న‌ది ఆయ‌న‌తో స‌హా అంద‌రికి తెలిసిందే. కానీ.. అధికారం చేతిలో ఉన్న‌ప్పుడు వ్య‌వ‌స్థ‌ల ల‌క్ష్మ‌ణ రేఖ‌ల్ని దాటేందుకు ప్ర‌య‌త్నించ‌కూడ‌దు. నా ఇష్టం వ‌చ్చిన‌ట్లు చేస్తాన‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తే.. ఈ రోజు మోడీ ఎలా అయితే వ్య‌వ‌హ‌రిస్తున్నారో.. రేపొద్దున మ‌రొక‌రు ఇంత‌కు మించి కూడా చేయొచ్చు. ఆ రోజున అరిచి గీ పెట్టినా ఫ‌లితం ఉండ‌దు. నొప్పించ‌కుండా ఒప్పించే తీరు చాలా అవ‌స‌రం. అది అత‌ని మెచ్యురిటీ లెవెల్స్ ను తెలియ‌జేసేలా చేస్తోంది. అందుకు భిన్నంగా నాకు న‌చ్చింది చేస్తా.. నా వెంట న‌డుస్తారా? లేదా? అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. త‌న వెంట రాని వారి మీద రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌తో దాడి చేయ‌టం మొన‌గాడిత‌నం ఎంత‌మాత్రం కాబోదు. అందుకు మోడీనే కాదు.. సందులో సుబ్బారావు కూడా ఇలాంటివే చేస్తార‌ని మ‌ర్చిపోకూడ‌దు.

మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ను తీసుకొచ్చిన మోడీ.. అదే స‌మ‌యంలో మ‌న్మోహ‌న్ సింగ్‌ను కూడా తీసుకురాగ‌లిగితే మోడీని మొన‌గాడు అనాల్సిందే. అంతేనా.. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు త‌న‌దైన రీతిలో చికిత్స చేసిన మాజీ రిజ‌ర్వ్ బ్యాంక్ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘ‌రాం రాజ‌న్ లాంటి వారిని మిన‌హాయిస్తూ ఆహ్వాన‌ప‌త్రిక‌ల్ని పంపిన వైనంలోనే మోడీ మార్క్ రాజ‌కీయం క‌నిపిస్తుంది. త‌న‌కు న‌చ్చ‌ని వారిని క‌రివేపాకు మాదిరి తీసి పారేసే మోడీ.. వ్య‌క్తిత్వ వికాస నిపుణుడిగా లెక్చ‌ర్లు దంచేస్తుంటారు. మ‌రి.. అలాంటి ఆయ‌న త‌న‌ను విభేదించిన ర‌ఘ‌రాం రాజ‌న్ ను ఎందుకు ప‌క్క‌న పెట్టేశారో ఆలోచిస్తే.. మోడీ బ‌య‌ట‌కు క‌నిపించేంత ఉన్న‌త మ‌న‌స్కుడు ఎంత మాత్రం కాద‌న్న‌ది తెలుస్తుంది.

రాజ‌కీయంగా కానీ.. మ‌రో రూపంలో కానీ జీఎస్టీని వ్య‌తిరేకిస్తున్న రాజ‌కీయ ప‌క్షాల‌తో రాజీ కోసం.. స‌యోధ్య కోసం చివ‌రి వ‌ర‌కూ చ‌ర్చ‌లైనా జ‌రిపితే బాగుండేది. తాము వ‌చ్చేది లేద‌ని కాంగ్రెస్ అండ్ కోలు తేల్చేస్తే.. మీ ఇష్టం అని వ‌దిలేసిన మోడీ తీరు.. పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్ క‌ళ త‌ప్పేలా చేసింద‌న‌టంలో సందేహం లేదు. ఇవ‌న్నీ చూశాక మోడీలోని మొన‌గాడికి ఎన్ని మార్కులు వేస్తారన్న‌ది మీరే డిసైడ్ చేసుకోండి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/