Begin typing your search above and press return to search.

మోడీజీ! ఏపీలో మీకు కాంగ్రెస్‌ గతే, తథ్యం!!

By:  Tupaki Desk   |   16 Sep 2015 4:21 PM GMT
మోడీజీ! ఏపీలో మీకు కాంగ్రెస్‌ గతే, తథ్యం!!
X
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో తామే స్వతంత్రంగా అధికారంలోకి రావాలని కలలు గంటున్న పార్టీల్లో భారతీయజనతా పార్టీ కూడా ఉన్నది. ఈ కోరికను ఆ పార్టీ రాష్ట్ర నాయకులు, ఇటీవల కేంద్ర మంత్రి ఒకరు కూడా సూచన ప్రాయంగా కొన్ని సందర్భాల్లో వెల్లడించారు. అలాంటికోరిక తప్పేమీ కాదు. నిజానికి అధికారం మీది ఆశ లేకుండా.. ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించజాలదు. అయితే ఆశకు తగినట్లుగా ఆంధ్రప్రదేశ్‌ లో మోడీ పార్టీ అనగా భాజపా పనిచేస్తున్నదా? ఆ ఆశ నెరవేరేలా కేంద్రంలోని మోడీ సర్కార్‌ ఏమైనా నిర్ణయాలు తీసుకుంటున్నదా? అనే అంశాలను మనం పరిశీలించాలి. ఇప్పటికి ప్రభుత్వాలు ఏర్పడి 15నెలలు గడచిపోయాయి. ఒక ప్రభుత్వం కుదురుకుని.. పాలనలో తన ముద్ర చూపించడానికి ఇది చాలినంత సమయం. 'ఏపీ వ్యవహారాలు' అనే మాట విస్మరిస్తే.. మోడీ తన ముద్రను కేంద్రంలో చూపిస్తూ ఉన్నారు కూడా. మరి ఏపీలో పరిస్థితి ఎలా ఉన్నది?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మోడీ సర్కార్‌ ఇంత దారుణంగా ఒక అనాథ రాష్ట్రాన్ని వంచించడం అనేది ప్రజలకు అనూహ్యమైన సంగతి. ఎన్నికలకు ముందు మోడీ మాటలు, హామీలు చూసిన తెలుగు ప్రజలు.. ఆయన అధికారం దక్కగానే.. ఇంతగా కరడుగట్టిన అవకాశవాద వైఖరిని ప్రదర్శిస్తారని ఎవ్వరూ ఊహించలేదు. ఏపీలో వారు అనుకుంటున్నట్లుగా 2019లో కాకపోయినా ఎప్పటికైనా సరే.. అధికారంలోకి రాదలచుకునే పార్టీ అనుసరించాల్సిన వైఖరి ఇది కానే కాదు.

ఫరెగ్జాంపుల్‌ వైకాపా ఉందనుకుందాం. వరికి అధికారం మీద ఆశ ఉంది గనుక.. తాము రాష్ట్రం కోసం, ప్రజల కోసం పోరాడుతున్నాం.. పనిచేస్తున్నాం అనే భావనను అందరికీ కలిగించడానికి తపన పడుతున్నారు. మరి భాజపా ఏం చేస్తోంది?

నిజానికి భాజపా ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు గుర్తున్నాయి. పైగా విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడంలో నాటకాలు ఆడడం ద్వారా ఎంత ద్రోహం చేస్తున్నారో కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రారబ్ధం ఏంటంటే.. ఏపీ పరిధికి చెందిన బాధ్యతగల నాయకులు, ప్రభుత్వంలో భాగస్వాములు అయిన అందరూ కూడా మోడీని తమ అవస్థ గురించి, అవసరం గురించి చెప్పి అడగలేక.. అచేతనంగా ఉంటున్నారు. చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్‌, రాంమాధవ్‌ అందరూ ఈ కోవలోకే వస్తారు. ఒకవైపు ఇలా ద్రోహం చేస్తూనే.. భాజపా నాయకులు తాము అధికారంలోకి వస్తాం అని ఎలా అనుకోగలరో ఆశ్చ్యం కలుగుతోంది.

బహుశా వారి ఆలోచన ఇలా ఉండవచ్చు. ''ఇప్పుడు కనీసం మరో రెండేళ్లపాటూ ఏపీ సర్కారు విజ్ఞప్తులు అన్నిటినీ బుట్టదాఖలుచేస్తూ ఉంటే.. అవన్నీ చంద్రబాబు వైఫల్యాల కింద ప్రజలు భావించి.. ఆ పార్టీపై కక్ష పెంచుకుంటారు. ఆ తర్వాత.. భాజపా నాయకుల విజ్ఞప్తుల మేరకు ఇచ్చినట్లుగా ఏపీకి ఏమైనా విదిలిస్తే జనం తమ పట్ల కృతజ్ఞత పెంచుకుని రుణపడి ఉంటారు..'' అని వారు అనుకుంటూ ఉండవచ్చు. మోడీ పోల్చిచూసుకుంటున్నారో లేదో గానీ.. ఇది అచ్చంగా తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ అనుసరించిన టెక్నిక్కే. చివరి సంవత్సరంలో తెలంగాణ అనుకూల వైఖరిని హఠాత్తుగా తీసుకుని.. తద్వారా తెలంగాణను గెలిచేస్తాం.. అని భ్రమపడ్డది. దాని ఫలితంగా రెంటికీ చెడింది. అటు తెలంగాణలో విపక్ష స్థానానికి, ఇటు ఏపీలో సంపూర్ణ పతనానికి చేరుకుంది.

కాంగ్రెస్‌ వ్యూహాన్నే, వారి అడుగుజాడల్లోనే అనుసరిస్తున్న భాజపాకు భిన్నమైన ఫలితాలు ఎలా వస్తాయి? అందుకే భాజపాకు కూడా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు కాసిని సీట్లు వచ్చాయని మురిసిపోయి, చివర్లో కాస్త సాయం విదిల్చి ఏపీలో గద్దె ఎక్కాలని భాజపా కలలుకంటే.. ప్రజలు వెర్రివాళ్లు కాదు. కాంగ్రెస్‌ కంటె అత్యంత దారుణంగా మోడీకి కూడా బుద్ధి చెప్పగల తెగువ ఉన్నవాళ్లు.. ఆ విషయాన్ని కేంద్రంలోని పాలకులు, వారి సలహాదారులు, రాష్ట్రంనుంచి వారికి నిత్యం భజన చేస్తూ ఉండే ప్రముఖులూ అందరూ తెలుసుకుంటే .. వాస్తవాన్ని జీర్ణించుకుంటే.. ప్రధానంగా వారికి మంచిది.