Begin typing your search above and press return to search.

అనుబంధాల‌కు ఆవ‌లి ఒడ్డున మోడీ.. సాక్ష్యాలివే!

By:  Tupaki Desk   |   2 April 2018 4:22 AM GMT
అనుబంధాల‌కు ఆవ‌లి ఒడ్డున మోడీ.. సాక్ష్యాలివే!
X
ప్ర‌ధానిగా మోడీ బాధ్య‌త‌లు స్వీక‌రించి ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర నాలుగేళ్లు కావొస్తోంది. ఏడాది క్రితం వ‌ర‌కూ తోపుల్లో తోపుగా మోడీని కీర్తించిన వారు కాస్తా.. ఆయ‌నంటేనే మండిప‌డుతున్నారు. తిట్ల దండ‌కం అందుకుంటున్నారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు మోడీ వ‌స్తే కానీ దేశం బాగుప‌డ‌ద‌న్నోళ్లు సైతం.. ఇప్పుడు ఆయ‌న్ను ఛీత్క‌రించుకునే ప‌రిస్థితి.

ఇక‌.. ఏపీకి ఇవ్వాల్సిన హోదా విష‌యంలో మోడీ ఆడుతున్న తొండాట 5 కోట్ల ఆంధ్రుల‌తో పాటు.. తెలుగు వారికి ఒళ్లు మండేలా చేస్తోంది. ఏపీ ప‌ట్ల మోడీకి ఎందుకంత నిర్ల‌క్ష్య‌మ‌న్న విష‌యం ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌త్యేక చ‌ర్చ‌గా మారింది. ఇలా.. నిత్యం మోడీ తీరు గురించి మాట్లాడుకోవ‌టం ఇప్పుడో అల‌వాటుగా మారింది.

ఈ నేప‌థ్యంలో ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ మోడీ మైండ్ సెట్ గురించి.. ఆయ‌న మాట‌ల‌కు.. చేత‌ల‌కు మ‌ధ్య‌నున్న వ్య‌త్యాసాన్ని విశ్లేష‌ణాత్మ‌కంగా వివ‌రించ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. మోడీ మీద ప్ర‌త్యేక విశ్లేష‌ణ చేసిన ఈ భారీ క‌థ‌నంలో.. త‌న వ్య‌క్తిగ‌త అనుబంధాల విష‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రిస్తారు? ఎవ‌రి మీద‌నైనా క‌త్తి క‌డితే ఎంత‌వ‌ర‌కు తెగిస్తారు? లాంటి అంశాల‌తో కూడుకున్న క‌థ‌నంపై దృష్టి సారిస్తే..

తల్లి పట్ల అమితమైన ప్రేమ కురిపిస్తారు. కానీ తల్లిని తన దగ్గరుంచుకోరు. తోబుట్టువులతోనూ అంత సన్నిహితంగా మెలగరు. జీవిత భాగస్వామిని అసలే పట్టించుకోరు. అనుబంధాల పట్ల మోదీ వైఖరి చిన్నప్పటి నుంచీ ఇంతే. ఇప్పటికీ అంతే.

నరేంద్ర మోదీ స్వగ్రామం వడ్‌ నగర్‌ లోనే 1952లో జశోదాబెన్‌ జన్మించారు. చిన్నప్పుడే ఇద్దరికీ పెళ్లి జరిగింది. ఆమె యుక్తవయస్కురాలయ్యాక మోదీ ఇంటికి వచ్చారు. ఆమె వచ్చిన మూడు నెలలకే మోదీ ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పటికి ఏడో తరగతి వరకూ మాత్రమే చదువుకొన్న జశోద.. ఆ తర్వాత తన చదువును కొనసాగించి హైస్కూలు విద్యను పూర్తి చేశారు. ఎటో వెళ్లిపోయిన మోదీ రెండేళ్ల తర్వాత మళ్లీ తన ఇంటి వద్ద ప్రత్యక్షమయ్యారు. దాంతో, జశోదను మోదీ తల్లి తమ ఇంటికి పిలిపించింది. అయినా, ఆమెను తీసుకెళ్లకుండా మోదీ తిరిగి ఇల్లు వదిలి వెళ్లిపోయారు. తర్వాత, జశోద ఎలిమెంటరీ స్కూల్లో టీచర్‌ ఉద్యోగంలో చేరారు. ఆమె ఇప్పటికీ తన అన్న దగ్గర నివసిస్తున్నారు. అయితే, మోదీ 1987లో తన అన్న సోమాభాయ్‌ తో కలిసి జశోదను కలిశారు. తనకు విడాకులిచ్చి మరొకరిని వివాహం చేసుకోవాలని ఆమెను కోరారు. అందుకామె సుతరామూ అంగీకరించలేదు. ఆ తర్వాత పేపర్లలో ఆయన ఫొటో ఎప్పుడు పడినా దానిని మురిపెంగా చూసుకొనేవారు. ఆ పేపర్లు భద్రపరచుకొనేవారు.

దూరంగా ఉంటున్నందుకు ఆయన్ను ఎప్పుడూ నిందించకుండా, తన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని చెప్పేవారు. ఇంతటి ఉత్తమురాలిని విడిచిపెట్టి ఆయనెందుకు దూరంగా ఉంటున్నారని ఆమె పరిచయస్థులందరూ ఆశ్చర్యపోయేవారు. భార్య విషయంలోనే కాదు.. ఆడ్వాణీ విషయంలో - రాజకీయాల్లో ఎదిగే క్రమంలో తనకు స్నేహితుడైన తొగాడియా విషయంలో మోదీ ప్రవర్తన చూసి దేశమంతా ఆశ్చర్యపోయింది. సన్నిహితుల విషయంలో సైతం తేడా వస్తే మోదీ ఏమాత్రం రాజీపడరు. తెగదెంపులకే సిద్ధపడతారు. ఇక తనను టార్గెట్‌ చేసిన శత్రువులైతే అసలే వదలరు. ఉదాహరణకు ప్రముఖ నృత్య కళాకారిణి మల్లికా సారాబాయి.. మోదీకి వ్యతిరేకంగా తన దగ్గరున్న ఆధారాలతో 2003లో సుప్రీం కోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేశారు.

ప్రతిగా గుజరాత్‌ ప్రభుత్వం ఆమెకు చెందిన దర్పణ సంస్థపై మనుషుల అక్రమ రవాణా కేసు పెట్టింది. కానీ, అందుకు ఆధారాల్లేవని కేసు మూసేశారు. ఆ కేసును విచారించిన కుల్‌ దీపశర్మ అనే అధికారిని మోదీ కలిసి ‘సాక్ష్యాధారాలు లేకపోతే ఏమిటి? కొంతకాలం ఆమెను జైల్లో పెట్టి కోర్టుల చుట్టూ తిరిగేటట్టు చేయలేకపోయారా?’ అని ప్రశ్నించారట. ఈ విషయాన్ని కుల్‌ దీప్‌ శర్మ వెల్లడించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి అలా అనడం తనను దిగ్ర్భాంతికి గురి చేసిందని, తాను ఏమీ చెప్పకుండా వెంటనే లేచి ఆ గది నుంచి బయటకు వచ్చానని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆయన ఎలాంటి ప్రాధాన్యం లేని పోలీస్‌ అకాడమీకి బదిలీ అయ్యారు.