Begin typing your search above and press return to search.

మోడీ కొత్త టీం ఎంపిక ఫార్ములా ఇదేనట

By:  Tupaki Desk   |   7 July 2021 4:07 AM GMT
మోడీ కొత్త టీం ఎంపిక ఫార్ములా ఇదేనట
X
అధికారం చేతిలో ఉన్నప్పుడు పార్టీ నేతలకు పదవులు లభించవు. ఆ సందర్భంగా వారికి ఉత్త హామీలు ఇవ్వటం మినహా చేయగలిగింది ఏమీ లేదు. కానీ.. అదేం సిత్రమో కానీ.. చేతికి పవర్ వచ్చిన తర్వాత కూడా దాన్ని ఉపయోగించి పదవులు ఇచ్చేందుకు అధినేతలకు మనసు వప్పదు. ఎక్కడి దాకానో ఎందుకు ప్రధాని మోడీనే తీసుకుందాం. కేంద్ర కాబినెట్ లో 81 మంది ఉండే వెసులుబాటు చట్టబద్ధంగా ఉంది. కానీ.. ఇప్పుడున్న మంత్రివర్గంలో ఉన్న సభ్యులు ఎంతమంది? ఖాళీగా ఉన్న పోస్టులు ఎన్ని అన్నది చూస్తే.. ఇంతకాలం పాటు.. ఇన్నేసి మంత్రి పదవుల్ని భర్తీ చేయకుండా ఉండిపోవటమా? అనుకోకుండా ఉండలేం.

పూర్తిస్థాయి మంత్రివర్గం ఉంటే.. పాలనా రథం పరుగులు తీసే వీలుంది. అందుకు భిన్నంగా బొటాబొటిగా సభ్యుల ఎంపిక ఉంటే.. అందుకు తగ్గట్లే కుంటుతూ గెంతుతూ ఉంటుందే తప్పించి.. ప్రయాణం సాఫీగా సాగే వీలు ఉండదు. భారీ కసరత్తులతో పాటు.. మరికొంతకాలం పాటు విస్తరణను ఆగే పరిస్థితి లేకపోవటం.. మరికొద్ది నెల్లలో కీలక రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల నేపథ్యంలో మంత్రివర్గాన్ని విస్తరించాల్సిన అనివార్యత చోటు చేసుకుంది. ఈ రోజు (బుధవారం) సాయంత్రం ఆరు గంటల సమయంలో కొత్త మంత్రులు కొలువు తీరనున్నారు.

కొత్త మంత్రులకు సంబంధించిన పేర్లు కొన్ని బయటకు వచ్చేశాయి. ఇంతకీ.. కొత్తగా కేబినెట్ లోకి చేర్చుకున్న వారి విషయంలో మోడీ అనుసరించిన ఫార్ములా ఏమిటి? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి మంత్రివర్గంలోని లోపాల్ని తగ్గించి.. కొత్త సమీకరణాలకు తగ్గట్లు మంత్రివర్గ విస్తరణ ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. తాజా మంత్రివర్గంలో బడుగు.. బలహీన వర్గాలకు.. ఆదివాసీ.. అణగారిన వర్గాలకు పెద్ద పీట వేసేలా మోడీ కసరత్తు చేసినట్లుగా చెబుతున్నారు.
సాధారణంగా బలమైన సామాజిక వర్గాలకు చెందిన నేతలకు కొలువులు కట్టబెట్టటం చేస్తుంటారు. అందుకు భిన్నంగా పలు రాష్ట్రాల్లో తక్కువ జనాభా కలిగిన సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నించినట్లుగాతెలుస్తోంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం వెనుకబడిన వర్గాలకు చెందిన 20 మంది ఓబీసీలకు మంత్రి పదవులు దక్కే వీలుందని చెబుతున్నారు. అదే సమయంలో ఎస్సీలు.. ఎస్టీలకు సైతం ఎక్కువగానే అవకాశాలు ఉంటాయన్న మాట వినిపిస్తోంది.

మోడీ టీంలోకి కొత్తగా వస్తున్న నేతల విషయానికి వస్తే.. తక్కువ వయసున్న వారు ఎక్కువ మంది ఉంటారని చెబుతున్నారు. అంటే.. యంగ్ టీం అన్నట్లుగా ఉంటుందని.. ఈ మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. తాజా టీంలో యువనేతలకు అవకాశం లభించనుందని చెబుతున్నారు. దీంతో.. స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత పిన్న వయస్కులు ఉన్న మంత్రివర్గంగా కొత్త రికార్డును మోడీ సర్కారు సొంతం చేసుకోనుందన్న మాట బలంగా వినిపిస్తోంది.

అంతేకాదు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం.. కాంగ్రెస్ పార్టీకి తరచూకౌంటర్లు ఇచ్చే వారికి.. కాంగ్రెస్ ముఖ్యనేతలు సోనియా గాంధీ..రాహుల్ గాంధీకి పోస్టుల పంచ్ లు వేసే వారికి అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. అన్నింటికి మించిన రాహుల్ మీద ఒంటికాలి మీద లేచే వారికి ఈసారి కొలువులు ఇవ్వబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే అవకాశం కల్పించిన గవర్నర్లకు సంబంధించి ఇదే ఫార్ములాను అనుసరించిన మోడీ.. కాబినెట్ విషయంలోనూ అదే తీరును ప్రదర్శిస్తారన్న మాట వినిపిస్తోంది. మహిళలకు సైతం తగిన ప్రాధాన్యత లభిస్తుందన్న మాట వినిపిస్తోంది. ఎన్నికలు జరిగే యూపీకి.. తన పట్టును పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న బెంగాల్ రాష్ట్రాలపై ప్రత్యేక ఫోకస్ ఉంటుందన్న వాదనలో నిజమెంతో ఈ సాయంత్రానికి తేలిపోనుంది.