విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్రప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకునేట్లే ఉంది. వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు తాజాగా ఉక్కుశాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ చెప్పిన సమాధానమే విచిత్రంగా ఉంది. మంత్రి ఏమన్నారంటే అవకాశముంటే ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తామని, కుదరకపోతే మూసేస్తామని స్పష్టంగా చెప్పారు. అంటే ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్రానికి ప్లాన్ బీ ఉన్నట్లు అర్ధమైపోతోంది.
కేంద్రానికి భారంగా తయారైన పరిశ్రమలను, నష్టాల్లో ఉన్న పరిశ్రమలను ప్రైవేటీకరించటమో లేదో మూసేయటమో చేయాలని కేంద్రప్రభుత్వం ఇప్పటికే డిసైడ్ చేసింది. దీనికి అనుగుణంగానే చాలా స్పీడుగా అడుగులు వేస్తోంది. అయితే మిగిలిన పరిశ్రమల విషయం ఎలాగున్నా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో మాత్రం కార్మికులు, ఉద్యోగ సంఘాలు, ప్రజాసాఘాలు, రాజకీయపార్టీలు గోల చేస్తున్నాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మిగిలిన ఫ్యాక్టరీల ఆర్ధిక పరిస్ధితి తెలీదుకానీ విశాఖ ఉక్కు మాత్రం లాభాల్లో నడుస్తోంది. మధ్యలో అప్పుడప్పుడు నష్టాలు వచ్చిన ఓవరాల్ గా మాత్రం లాభాల్లోనే ఉంది. ఫ్యాక్టరీ నష్టాల్లో ఉండటానికి కేంద్ర విధానాలే ప్రధాన కారణం. ఫ్యాక్టరీకి సొంతంగా ఇనుప గనులంటు లేకపోవటమే పెద్ద సమస్యగా మారింది. ఉక్కు ఫ్యాక్టరీకి సొంతంగా గనులుంటే మొత్తం లాభాలపంట పండిచటం పెద్ద సమస్య కానేకాదు. ఎందుకంటే దేశంలోని ఉక్కు ఫ్యాక్టరీలన్నింటిలోను మొన్నటి సంవత్సరంలో కూడా అత్యధిక ఉత్పత్తిని సాధించిన విషయం అందరికీ తెలిసిందే.
ఫ్యాక్టరీ ఇంత ఘనంగా నడుస్తున్నా ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించటంలో అర్ధంలేదు. కానీ నిర్ణయం తీసేసుకున్నది కాబట్టి ఇక వెనక్కుపోయే అవకాశంలేదు. అయితే ప్రతిపక్షాల గొడవల మధ్య ప్రైవేటీకరణ సాధ్యం కాకపోతే మూసేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే ప్రైవేటీకరణను సవాలు చేస్తు ఐపీఎస్ మాజీ అధికారి లక్ష్మీనారాయణ సుప్రింకోర్టులో వేసిన కేసు విచారణలో ఉంది.
ఈ విచారణ వల్ల ప్రైవేటీకరణ సాధ్యంకాకపోతే మూసేయనన్నా మూసేయాల్సేందే కానీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మాత్రం నడపకూడదని గట్టిగానే నరేంద్రమండి డిసైడ్ అయినట్లున్నారు. అందుకనే సహాయమంత్రితో పార్లమెంటులో ఇలాంటి ప్రకటన చేయించారు. అంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్రానికి ప్లాన్ బీ రెడీగా ఉందని తేలిపోయింది. కేసుల విచారణతోనో లేకపోతే ఉద్యమాల రూపంలోనో మరో ఏడాదిన్నర సమయాన్ని ప్రతిపక్షాలు లాగ్గలిగితే తర్వాత విషయం తర్వాత చూసుకోవచ్చు.