Begin typing your search above and press return to search.

ఇక మ‌రిన్ని వ‌డ్డింపుల‌కు సిద్ధం కావాల్సిందేనా?

By:  Tupaki Desk   |   11 March 2017 8:04 AM GMT
ఇక మ‌రిన్ని వ‌డ్డింపుల‌కు సిద్ధం కావాల్సిందేనా?
X
ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు రాజ‌కీయ పార్టీల‌కు ఎలా ఉన్నా... సామాన్య జ‌నానికి మాత్రం కాస్తంత చేదుగానే ప‌రిణ‌మించే అవకాశాలున్నాయి. గ‌డ‌చిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో అధికారం ద‌క్కించుకున్న బీజేపీ... ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆధ్వ‌ర్యంలో దేశంలో ప‌లు కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీకారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో ప‌లు క‌ఠిన నిర్ణ‌యాల‌ను కూడా మోదీ స‌ర్కారు అమ‌ల్లోకి తెచ్చేసింది. ఇందులో భాగంగా న‌ల్ల ధ‌నం వెలికితీత కోస‌మంటూ తీసుకున్న పెద్ద నోట్ల ర‌ద్దు దేశాన్ని ఓ భారీ కుదుపున‌కు గురి చేసింద‌నే చెప్పాలి. పెద్ద నోట్ల ర‌ద్దు వ‌ల్ల సంప‌న్నుల‌కు దాదాపుగా ఇబ్బందులేమీ లేకున్నా... సామాన్య జ‌నం మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంకు ఖాతాల్లో డ‌బ్బులున్నా.. జేబులో చిల్లిగ‌వ్వ కూడా లేకుండా మ‌ధ్య త‌ర‌గ‌తి జ‌నం రోజుల త‌ర‌బ‌డి అష్ట‌క‌ష్టాలు ప‌డ్డారు.

అయితే ఈ ఇబ్బందుల‌ను కాస్తంత లైట్‌గానే తీసుకున్న మోదీ... ఇబ్బందులున్నా భ‌విష్య‌త్తులో మంచి జ‌ర‌గాల‌నే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇదంతా గ‌తం... ఇప్పుడు దేశ రాజ‌కీయాల‌కే గీటురాయిగా ప‌రిగ‌ణిస్తున్న ఉత్త‌ర ప్ర‌దేశ్‌ లో బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. యూపీ పీఠం ఎవ‌రికి ద‌క్కితే... తదుప‌రి లోక్‌ స‌భ‌కు జ‌రిగే ఎన్నిక‌ల్లో వారిదే విజ‌య‌మంటూ గుడ్డి న‌మ్మ‌క‌మున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల్లోనూ కేంద్రంలో త‌మ‌దే అధికారం అన్న భావ‌న‌తో బీజేపీలో స‌రికొత్త ఉత్సాహం ఉర‌క‌లేస్తోంది. అంతేకాకుండా... మొన్న‌టి దాకా యూపీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేంద్రం ప్ర‌భుత్వం ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌ను సిద్ధం చేసినా... వాటిని బ‌య‌ట‌కు తీయ‌డానికి బ‌య‌ప‌డింద‌నే చెప్పాలి. ఇప్పుడు యూపీ ఎన్నిక‌లు ముగిశాయి. అందులోనూ ఆ రాష్ట్రంలో చాలా కాలం త‌ర్వాత బీజేపీ మ‌ళ్లీ అధికార ప‌గ్గాలు చేప‌ట్టేసింది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే సిద్ధం చేసుకుని ఉంచుకున్న ప‌లు క‌ఠిన నిర్ణ‌యాల‌ను మోదీ స‌ర్కారు ప్ర‌యోగించే అవ‌కాశాలు లేక‌పోలేద‌న్న వాద‌న వినిపిస్తోంది.

న‌ల్ల కుబేరుల న‌డ్డి విరిచేలా బ్యాంకింగ్ రంగంలో ఈ త‌ర‌హా నిర్ణ‌యాలు మ‌రింత క‌ఠినంగా ఉంటాయ‌న్నది విశ్లేష‌కుల వాద‌న. ఈ నిర్ణ‌యాల‌తో న‌ల్ల‌ల కుబేరుల‌కు ఏ మేర‌కు అడ్డుక‌ట్ట ప‌డుతుందో తెలియ‌దు గానీ... ఆ నిర్ణ‌యాల ఫ‌లితంగా సామాన్య జ‌నం మ‌రింత మేర ఇబ్బందులకు గురి కావ‌డం త‌థ్యంగానే క‌నిపిస్తోంది. ఇక చాన్నాళ్ల నుంచి వినిపిస్తున్న బ్యాంకింగ్ ట్రాన్సాక్ష‌న్ ట్యాక్స్ ను కూడా అమ‌ల్లోకి తెచ్చేందుకు మోదీ స‌ర్కారు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినా పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. ఈ ప‌న్నే అమ‌ల్లోకి వ‌స్తే... బ్యాంకుల్లో న‌గ‌దు వేయాల‌న్నా, తీయాల‌న్నా కూడా ప‌న్ను చెల్లించాల్సిందే.

ఇక రాష్ట్రాల‌కు కేంద్రం నుంచి అందుతున్న ప‌న్నుల వాటాను కూడా స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేసే దిశ‌గా కేంద్రం కీల‌క అడుగు వేయ‌నుంద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఇదే జ‌రిగితే... రాష్ట్ర విభ‌జ‌న ఫ‌లితంగా కొత్త‌గా క‌నీసం రాజ‌ధాని కూడా లేకుండా ఏర్ప‌డ్డ న‌వ్యాంధ్ర త‌ర‌హా రాష్ట్రాల ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగానే మారే ప్ర‌మాదం లేక‌పోలేద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. చూద్దాం... యూపీలో బీజేపీ విజ‌యంతో మోదీ స‌ర్కారు ఏ త‌ర‌హా వ్యూహాన్ని అమ‌లు చేస్తుందో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/