Begin typing your search above and press return to search.

లాజిక్ మిస్ అవుతున్న మోడీ మాస్టారు...?

By:  Tupaki Desk   |   9 Feb 2022 3:30 AM GMT
లాజిక్ మిస్ అవుతున్న మోడీ మాస్టారు...?
X
ప్రధాని నరేంద్ర మోడీ మాటల ప్రవాహం చెప్పతరం కాదు, ఆయన ప్రసంగం మొదలుపెడితే ఒక ఊపులో సాగుతోంది. అందులో పద బంధాలు, విపరీతమైన ఆవేశాలతో వినేవారికి బాగానే ఉంటుంది. ఇదంతా 2014 ఎన్నికలకు కొత్త, 2019 నాటికి ఈ ప్రసంగాల కంటే ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి.

ఇక మరో రెండున్నరేళ్ళలో ఎన్నికలు పెట్టుకుని మోడీ సార్ కాంగ్రెస్ మీద ఒంటి కాలు మీద లేస్తున్నారు. కాంగ్రెస్ సకల పాపాలకూ మూలకారణం అంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు తమకు తాజా బడ్జెట్ లో తీరని అన్యాయం జరిగింది అని ఆగ్రహిస్తున్న వేళ పెద్దల సభలో ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ లోకి మోడీ మాస్టార్ వెళ్లడమే చిత్రం.

విభజన నాటి సీన్లను ఆయన సభకు వివరించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఆయన చెప్పేది ఏంటి అంటే ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోవడం వెనక కాంగ్రెస్ చేసిన ఆపరేషన్ బాలేదని, సరే అలాంటి బ్యాడ్ ఆపరేషన్ కి బీజేపీ నాడు ఎందుకు మద్దతు ఇచ్చిందన్న ప్రశ్న కూడా వెంటనే వస్తుంది కదా.

నాడు ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఏపీ విభజన కాంగ్రెస్ కి ఎంత ముఖ్యమో బీజేపీ కూడా తనకు ఎంతో కొంత లాభమని భావించడం వల్లనే అలా జరిగింది కదా. సరే విభజన అయితే అడ్డగోలుగా కాంగ్రెస్ చేసి పారేసింది. మరి ఆ తరువాత నుంచి ఈ రోజు దాకా అధికారంలో ఉన్నది ఎవరు. విభజన వల్ల నష్టపోయిన ఏపీని ఆదుకునే అవకాశం ఉన్నా ప్రత్యేక హోదా సహా చాలా హామీల మీద మాట మార్చింది ఎవరు.

ఇవన్నీ ప్రజలలో వచ్చే ప్రశ్నలు కావా. ఇక తెలంగాణాకు కూడా కేంద్రం ఏ రకంగానూ సాయం చేయడంలేదని అక్కడి ప్రజలు అంటున్నారు. వెరసి కాంగ్రెస్ మీద తప్పు తోసేసి తప్పించుకుందామనుకుంటే లాజిక్ మిస్ అయినట్లే మోడీ సారూ అంటున్నారు. దీని మీద అటూ ఇటూ ఉన్న అధికార పార్టీల నేతలు గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు.

టీయారెస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే తెలంగాణాకు కాంగ్రెస్ అన్యాయం చేస్తే మీరేమి చేశారు మోడీ అని నిలదీస్తున్నారు. ఏడేళ్ళుగా తెలంగాణాకు అన్యాయం చేస్తోంది బీజేపీనే కదా అని కూడా అటాక్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా తప్పించుకుంటూ ఇపుడు కాంగ్రెస్ అన్నింటికీ పాపాల భైరవుడు అని చెప్పడం ఎంత వరకు సబబు ప్రధాని గారూ అని వైసీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బిగ్ క్వశ్చన్ రైజ్ చేశారు.

మొత్తానికి సగటు జనాలు కూడా ఇదే రకమైన ఫీలింగ్ లో ఉన్నారు. ఇప్పటికైనా మంచి సమయం మించి పోలేదు, ఏపీకి బీజేపీ చేయాల్సిన సాయం చేసి మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా అన్న మాట అయితే జనాల్లో ఉంది. కానీ మోడీ మాస్టార్ తీరు చూస్తూంటే కాంగ్రెస్ ని తిట్టడానికే సడెన్ గా ఈ విభజన ఇష్యూని తెచ్చారనే అంటున్నారు.