Begin typing your search above and press return to search.

బ్లాక్‌ వెల్‌ కం నచ్చకుంటే మోడీ ఎగ్గొడతారా?

By:  Tupaki Desk   |   3 Oct 2015 11:30 AM GMT
బ్లాక్‌ వెల్‌ కం నచ్చకుంటే మోడీ ఎగ్గొడతారా?
X
చంద్రబాబునాయుడు ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించి ఈనెల 22వ తేదీన శంకుస్థాపన కార్యక్రమాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ కూడా వస్తున్నారని చంద్రబాబునాయుడు అంటున్నారు. అయితే.. ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు ప్రధాని అమరావతి శంకుస్థాపనకు వస్తారా లేదా అనేది డైలమాగానే ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సాధారణంగా ప్రధాని నరేంద్రమోడీ.. తాను ఎక్కడకు వెళ్లినా సరే.. తన పర్యటన పట్ల నిరసనలు ఎదురుకాని.. వ్యతిరేకత వెల్లువ కనిపించని విధంగానే టూర్లు ప్లాన్‌ చేసుకుంటూ ఉంటారు. అందుకే తనను భారత ప్రధానిగా ఒక ఆరాధన భావంతో ఇతరులు చూసే అవకాశం ఉన్న విదేశీ టూర్లకే ఆయన ఎక్కువగా వెళుతూ ఉంటారు. తను అడుగుపెట్టగానే.. అక్కడి ప్రజలు హర్షద్వానాలు చేసినట్లుగా ఆయన ప్రచారం కోరుకుంటారు తప్ప.. నిరసన ధ్వనులు వినిపించినట్లుగా మీడియాలో రావడం మోడీకి ఇష్టముండదు. అలాంటి అవకాశంఉండే కార్యక్రమాలను ఎవాయిడ్‌ చేయడం ద్వారా, అసలు మోడీ పట్ల ఎలాంటి నిరసన భావం ఈ దేశంలో కనిపించడం లేదు... అనే భ్రమను ప్రపంచానికి కల్పించడం అనేది ఆయన వ్యూహం. ఇందులో ఆయన చాలా సక్సెస్‌ అవుతుంటారు.

అయితే ఇప్పుడు అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోడీ వచ్చే అవకాశం ఉందా లేదా అనే సంగతి కూడా ఈ కారణం చేతనే డైలమాలో పడుతోంది. ప్రధాని కార్యక్రమానికి వచ్చేట్లయితే.. 22వ తేదీలోగా ప్రత్యేకహోదా సంగతి తేల్చాల్సిందే అని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. రాష్ట్రంలో వారికి ఉన్న బలం ఎంత అనే సంగతి పక్కన పెడితే.. ప్రధాని రాక సందర్భంగా నల్లజెండాలతో స్వాగతం పలుకుతాం అంటూ వారు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వాతావరణం ఏర్పడడాన్నే మోడీ ఇష్టపడరు. అలాంటి నేపథ్యంలో తన పట్ల తన దేశంలో, తమ పార్టీ కూటమి ఏలుబడిలో ఉన్న రాష్ట్రంలోనే నిరసనలు వెల్లువెత్తుతున్నాయనే సంకేతాలు ప్రపంచానికి అందడం ఆయనకు ఇష్టం ఉండదని అంటున్నారు. అందుకే.. ఒకవేళ హోదా గురించి నిర్ణయం తీసుకోకపోయినట్లయితే.. మోడీ శంకుస్థాపనకు రాకపోవచ్చుననేది పలువురి అంచనా. ఒకవేళ కాంగ్రెస్‌ వారి నిరసనల్ని , నల్లజెండా ప్రదర్శనలను ఏపీ సర్కారు పోలీసు ఇనుపబూట్లతో అణిచివేస్తుందనే నమ్మకం కుదిరితే ఆయన రావచ్చునని పలువురు భావిస్తున్నారు.