Begin typing your search above and press return to search.

మోడీకి మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ సెగ‌

By:  Tupaki Desk   |   6 Aug 2016 7:03 AM GMT
మోడీకి మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ సెగ‌
X
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఇరుకున ప‌డేస్తున్న మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టు ఆందోళ‌న ఘాటును ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కూడా చ‌విచూడాల్సి వ‌చ్చేలా కనిపిస్తోంది. మొట్టమొదటిసారిగా తెలంగాణ‌ రాష్ట్రంలో పర్యటించడానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ సభకు వెళ్లకుండా సాంఘిక బహిష్కరణ చేసేందుకు మల్లన్న సాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలు నిర్ణయించుకున్నారు.

ప్రాజెక్టు నిర్మాణం - ప‌రిహారం తీరును నిర‌సిస్తూ రెండు నెలలుగా కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా జాతీయ రహదారి దిగ్బంధం చేసేందుకు వెళ్లిన నిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జి చేసిన విషయం తెలిసిందే. అనంతరం మంత్రి హరీష్‌రావు కల్పించుకుని ఏటిగడ్డ కిష్టాపూర్ - పల్లెపహాడ్ - ఎర్రవల్లి - సింగారం గ్రామాల ప్రజలను ఒప్పించారు. ఒక్క వేముల్‌ గట్ ప్రజలు మాత్రం ససేమిరా అంటూ భీష్మించి కూర్చున్నారు. మ‌రోవైపు జహీరాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటుకానున్న నిమ్జ్ కోసం నిర్వహించిన భూ సేకరణ బాధితులు హైకోర్టులో దావా వేయగా 123 - 124 జివోలను రద్దు చేస్తూ కోర్టు తీర్పు విధించిన సంగతి విదితమే. కోర్టు తీర్పుతో కథ మళ్లీ అడ్డం తిరిగింది. భూములు ఇచ్చేందుకు అంగీకరించిన ప్రజలే సంతకాలు చేయకుండా 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని గజ్వేల్ నియోజకవర్గం కోమటిబండ వద్ద ప్రారంభించడానికి ప్రధాన మంత్రి ఆదివారం రానున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర యంత్రాంగం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది.

రాష్ట్ర, జాతీయ స్థాయిలో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలు చర్చనీయాంశం కాగా లాఠీచార్జి మరింత చర్చకు తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో బాధితులు సభలో ఎక్కడ గలాటా సృష్టిస్తారోనని పోలీసులను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలోనే ముంపు గ్రామాల్లో కొనసాగుతున్న పరిణామాలపై ఇంటలిజెన్స్ - స్పెషల్ బ్రాంచ్ - మఫ్టీ పోలీసుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని అందుకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టడంలో పోలీసులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కాగా, వేములగట్ ప్రజలు మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రధాని సభకు వెళ్లకుండా గ్రామంలోనే నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్ని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే లాఠీచార్జితో వీపులు చిట్లిన తాము మరోమారు అలాంటి దుస్సంఘటనకు తావీయకుండా ప్రధాని సభను సాంఘిక బహిష్కరణ చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎర్రవల్లి గ్రామస్థులు రెవెన్యూ అధికారులతో 2013 చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తేనే తాము సంతకాలు పెడతామని లేదంటే వెళ్లిపోవాలని సూచించడంతో చేసేదేమి లేక అధికారులు వెనుదిరిగిపోయారు. ఈ నేపథ్యంలో ఎర్రవల్లి - పల్లెపహాడ్ - సింగారం - ఏటిగడ్డ కిష్టాపూర్ తదితర గ్రామాల ప్రజలు ఏ మేరకు స్పందిస్తారోనన్న ఆందోళనతో పాటు సభకు రాకుండా ఉంటే అదే సంతోషంగా పోలీసులు భావిస్తున్నారు.