Begin typing your search above and press return to search.

విదేశాల్లో మోడీ మన్ కీ బాత్

By:  Tupaki Desk   |   3 July 2016 4:43 AM GMT
విదేశాల్లో మోడీ మన్ కీ బాత్
X
దేశ ప్రధాని నోటి నుంచి మాట వినటమే గగనంగా మారి.. ఆయన పలుకే బంగారమన్నట్లగా ఉండేది పదేళ్ల మన్మోహన్ హయాంలో. నోరు విప్పేందుకు సుతారం ఇష్టపడని ఆయన తీరుకు పూర్తి భిన్నంగా తాజా ప్రధాని నరేంద్రమోడీ వ్యవహారశైలి ఉంటుంది. చురుగ్గా వ్యవహరిస్తూ... మాటలతో మనసుల్ని కొల్లగొట్టటంలో మోడీ తర్వాతే ఎవరైనా.

తనదైన శైలిలో ప్రసంగించే ఆయన మాటల్లో భావోద్వేగం.. సున్నితత్వం స్పష్టంగా కనిపిస్తుంటుంది. దేశ ప్రధాని రేడియోలో ఒక క్రమపద్ధతిలో మన్ కీ బాత్ పేరిట ముచ్చట్లు చెప్పటం.. వివిధ అంశాల మీద తన వైఖరిని చెప్పటంతోపాటు.. తనకు తెలిసిన.. తన దృష్టికి వచ్చిన పలు విశేషాల్ని ప్రజలతో పంచుకునే కార్యక్రమం మోడీ ఇమేజ్ ను మరింత పెంచిందని చెప్పాలి.

ప్రధాని హోదాలో మోడీ మన్ కీ బాత్ ఐడియా సూపర్ హిట్ అయ్యిందనే చప్పాలి. తాజాగా ఇదే మన్ కీ బాత్ ను బంగ్లాదేశ్ ప్రజల్ని ఉద్దేశించి కూడా ప్రధాని మోడీ మాట్లాడనుండటం గమనార్హం. విదేశీ ప్రజలను ఉద్దేశించి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహించటం ఒక రికార్డుగా చెప్పాలి. బంగ్లాదేశ్లో ఆకాశవాణి తన రేడియో స్టేషన్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో.. అందులో బంగ్లాదేశీయుల్ని ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు.

బంగ్లాదేశ్ తో భారత్ కు స్నేహ సంబంధాల్ని గుర్తు చేయటం.. భారత్ అంటే బంగ్లాదేశ్ కు అత్యంత ఆఫ్తుడన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పటం.. జనసామ్యంలోకి తన మాటల్ని వెళ్లేలా చేయాలని ప్రధాని భావిస్తున్నారు. అంతేకాదు.. బంగ్లాదేశీయుల నుంచి కొన్నిప్రశ్నల్ని తెప్పించుకొని.. వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్ అంటే స్నేహపూర్వక దేశమని చాటి చెప్పటం.. 1971 బంగ్లాదేశ్ విమోచన ఉద్యమంలో బంగ్లాకు బాసటగా నిలిచిన విషయాలతో పాటు.. ఆకాశవాణితో బంగ్లాదేశ్ తో మరింత స్నేహాన్ని పెంచుకోవాలనిది. భారత్ ప్రయత్నిస్తోంది. బంగ్లాదేశ్ లో ప్రసారాలు చేసే ఈ రేడియో స్టేషన్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించనున్నారు. దేశ ప్రజల మీద తన మాటలతో ఆకట్టుకున్న మోడీ.. బంగ్లాదేశీయుల్ని ఎంతమేర ఆకట్టుకుంటారో చూడాలి.