Begin typing your search above and press return to search.

మోడీలో మేనేజ్ మెంట్ గురు బ‌య‌ట‌కొచ్చేశాడోచ్!

By:  Tupaki Desk   |   17 Jun 2019 10:34 AM GMT
మోడీలో మేనేజ్ మెంట్ గురు బ‌య‌ట‌కొచ్చేశాడోచ్!
X
ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ ప్ర‌చారానికి వ‌చ్చే సంద‌ర్భంలో ప్ర‌ధాని మోడీ ఏ తీరులో మాట్లాడ‌తారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. తాజాగా ముగిసిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆయ‌న చేసిన ప్ర‌సంగాలు ప‌లువురిని విస్మ‌యానికి గురి చేసింది. ఒక ప్ర‌ధాన‌మంత్రి స్థానంలో ఉన్న కీల‌క నేత నోటి నుంచి ఈ త‌ర‌హాలో మాట్లాడ‌ట‌మా? అని షాక్ తిన్నోళ్లు చాలామందే ఉన్నారు. అయితే.. ఇలాంటివేమీ ప‌ట్టించుకోకుండా ప్ర‌జ‌లు మోడీకి తిరుగులేని అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు.

మోడీలో రెండు ర‌కాల వ్య‌క్తులు క‌నిపిస్తారు. ఎన్నిక‌ల వేళ‌లో మోడీలో క‌ఠిన‌మైన రాజ‌కీయ నాయ‌కుడు నిలువెల్లా ఆవ‌హించిన‌ట్లుగా క‌నిపిస్తారు. రాజ‌కీయ వ్యాఖ్య‌లు చేయ‌ట‌మే కాదు.. ప్ర‌త్య‌ర్థుల‌పై ఎంత మాట‌నైనా అనేందుకు ఏ మాత్రం వెనుకాడ‌రు. అలాంటి మోడీ.. విజ‌యం వ‌రించిన త‌ర్వాత ఒక్క‌సారిగా మారిపోతారు. ఒక మేనేజ్ మెంట్ గురు మాదిరి.. ఒక తాత్విక చింత‌న ఉన్న పెద్దమ‌నిషిలా క‌నిపిస్తారు.

గెలుపోటములు.. బ‌లాబ‌లాలు లాంటివి మిథ్య అన్న‌ట్లుగా ఆయ‌న మాట‌లు ఉంటాయి. తాను కోరుకున్న‌ది కోరుకున్న‌ట్లుగా వ‌చ్చేశాక‌.. తీరిగ్గా విలువ‌ల గురించి నీతులు చెప్పే అల‌వాటున్న‌మోడీ.. తాజాగా అలాంటి మాట‌లే చెప్పారు. లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష స‌భ్యుల సంఖ్య గురించి ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని.. స‌భ‌లో వారి పాత్రే ముఖ్యంగా ఆయ‌న అభివ‌ర్ణించారు.

సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల్లో మొత్తం 542 స్థానాల‌కు బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు 353 స్థానాలు చేజిక్కించుకోవ‌టం తెలిసిందే. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 92 స్థానాల‌కే ప‌రిమితం కావ‌టం తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే.. విప‌క్షం నామ‌మాత్రంగా మారిన వేళ‌.. మోడీ నోటి నుంచి వ‌చ్చిన మాట‌లు ఎప్ప‌టిలానే విలువ‌లు ద‌ట్టించిన‌ట్లుగా.. ఐడియల్ గా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

స‌భ‌లో ప్ర‌తిప‌క్ష పాత్ర కీల‌క‌మైన‌ద‌ని.. వారి సంఖ్య గురించి ప్ర‌తిప‌క్ష స‌భ్యులు బాధ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని.. వారుచురుగ్గా మాట్లాడ‌తార‌ని.. స‌భా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటార‌ని తాను ఆశిస్తున్న‌ట్లుగా పేర్కొన్నారు. మోడీ నోటి నుంచి వ‌చ్చిన మాట‌లు విప‌క్షాల‌కు ఒళ్లు మండేలా చేస్తే.. మిగిలిన వారికి మాత్రం ఎంత ఉన్న‌త వ్య‌క్తిత్వం ఉన్న ప్ర‌ధాని మ‌న‌కున్నార‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. అదే క‌దా మోడీ మేజిక్ అంటే!