Begin typing your search above and press return to search.

మోడీ స్పెష‌ల్: తిడుతూనే ఓట్లు వేస్తారు

By:  Tupaki Desk   |   15 May 2018 9:54 AM GMT
మోడీ స్పెష‌ల్:  తిడుతూనే ఓట్లు వేస్తారు
X
క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా సాగుతున్న వేళ‌.. హైద‌రాబాద్ నుంచి కొంద‌రు జ‌ర్న‌లిస్టులు ప్ర‌త్యేకంగా క‌ర్ణాట‌క‌కు వెళ్లారు. వీరే కాకుండా క‌ర్ణాట‌క‌లో తెలిసిన కొంద‌రు జ‌ర్న‌లిస్టు మిత్రుల‌తో మాట్లాడిన‌ప్పుడు వారో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని చెప్పారు.

గ‌తంలో ఎప్పుడూ లేనంత‌గా మోడీ మీద క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నార‌న్నారు. ఈసారి ఎన్నిక‌ల్లో బీజేపీ ఓట‌మి ఖాయ‌మ‌ని తేల్చి చెప్పారు. అంత త్వ‌ర‌గా ఒక అభిప్రాయానికి ఎలా వ‌స్తార‌న్న ప్ర‌శ్న‌కు..ఎక్క‌డ‌కు వెళ్లినా మోడీ తీరును త‌ప్పు ప‌డుతున్నారు. బీజేపీకి ఓటు వేసే అవ‌కాశం లేదని చెప్పేస్తున్నార‌ని వారు నాతో చెప్పారు. అయితే.. ఇదంతా కూడా క‌ర్ణాట‌క‌లో మోడీ ప్ర‌చారం స్టార్ట్ కాక‌ముందు జ‌రిగిన ముచ్చ‌ట‌.

కాస్త ఆల‌స్యంగా మోడీ ప్ర‌చారం క‌ర్ణాట‌క‌లో స్టార్ట్ అయ్యింది. కేవ‌లం మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే ఓట‌ర్ల‌లో మార్పు వ‌చ్చింది. బీజేపీ వైపు మొగ్గు చూపించ‌టం స్టార్ట్ అయ్యింది. ఈ విష‌యాన్ని గుర్తించిన క‌ర్ణాట‌క రాష్ట్ర బీజేపీ నేత‌లు ప్ర‌ధాని మోడీ దృష్టికి ఆ విష‌యాన్ని తీసుకెళ్లారు. మ‌రికొన్ని రోజులు క‌ర్ణాట‌క ప్ర‌చారాన్ని పొడిగించాల‌ని కోరారు. క‌ర్ణాట‌క‌లో బీజేపీ గెలుపు పార్టీకి ఎంత అవ‌స‌ర‌మో తెలిసిన మోడీ.. పార్టీ నేత‌ల కోర్కెను మ‌న్నించారు. మ‌రిన్ని ఎక్కువ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించి ప్రచారం చేశారు. అంతే.. క‌మ‌ల‌నాథులు అంచ‌నా వేసిన‌ట్లే ప్ర‌జ‌ల్లో మార్పు వ‌చ్చింది. మోడీ మాట‌ల ప్ర‌భావానికి లోనైన విష‌యాన్ని గుర్తించారు. విజ‌యం మీద ధీమాను వ్య‌క్తం చేశారు.

పోలింగ్ ముగిసిన రోజున దాదాపు 17కు పైగా మీడియా సంస్థ‌లు ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డిస్తే.. అందులో కొన్ని సంస్థ‌లు బీజేపీ విజ‌యం ఖాయ‌మ‌ని పేర్కొన‌గా.. కాద‌ని చెప్పిన సంస్థ‌లూ ఉన్నాయి. కానీ.. బీజేపీ సీఎం అభ్య‌ర్థి య‌డ్యూర‌ప్ప మాత్రం తాను ఈ నెల 17న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు.

యాడ్యూర‌ప్ప మాట‌ల్ని చాలామంది ఎద్దేవా చేశారు. కానీ.. క‌న్న‌డిగుల మైండ్ సెట్ ను ముందే అర్థం చేసుకున్న విష‌యం ఫ‌లితాలు వెల్ల‌డైన త‌ర్వాత కానీ అర్థం కాలేదు. మోడీని అంత‌గా వ్య‌తిరేకించిన క‌న్న‌డిగులు.. ఉన్న‌ట్లుండి మోడీ పార్టీకి ఎందుకు ఓట్లు వేసిన‌ట్లు? అంటే.. అదే మోడీ మేజిక్‌.

సిద్ద‌రామ‌య్య ప్ర‌భుత్వంపై అసంతృప్తి ఉన్న ఓట‌ర్ల‌తో పాటు.. త‌ట‌స్థ ఓట‌ర్లు ఆఖ‌రి నిమిషంలో త‌మ నిర్ణ‌యాన్ని మార్చుకోవ‌టం.. బీజేపీ వైపు మొగ్గు చూప‌టం కూడా తుది ఫ‌లితంపై ప్ర‌భావం చూపించింద‌నిచెప్పాలి. ఇక‌.. క‌ర్ణాట‌క‌లో దాదాపు 50కు పైగా స్థానాల్లో ప్ర‌భావాన్ని చూపించే అవ‌కాశం ఉన్న తెలుగు ఓట‌ర్లు సైతం బీజేపీ వైపు మొగ్గు చూపిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. ప‌దునైన విమ‌ర్శ‌లు.. మంత్రించిన‌ట్లుగా గుర్తుండిపోయే మాట‌లు.. తాను ప్ర‌ధానిని అన్న విష‌యాన్ని మ‌ర్చిపోయి మ‌రీ.. క‌ర్ణాట‌క‌లో గెలుపు మాత్ర‌మే ముఖ్య‌మ‌న్న‌ట్లుగా మాట్లాడే మోడీ తెగింపు ఓట‌ర్ల‌కు న‌చ్చ‌టంతో పాటు.. ఒక్క‌సారి అవ‌కాశం ఇస్తే పోయేదేముంది? అన్న భావ‌న‌ను క‌లిగేలా చేశాయ‌ని చెప్పాలి.

మాట‌లు మాట‌లే.. చేత‌ల్లోనూ మోడీ వ్యూహ చ‌తుర‌త‌.. పోల్ మేనేజ్ మెంట్ ప‌క్కాగా ఉంటుంది. బళ్లారి ప్రాంతంలో గాలి అనుకూలురికి సీట్లు ఇవ్వ‌టం ద్వారా.. త‌న ల‌క్ష్యం గెల‌వ‌ట‌మే త‌ప్పించి.. మ‌రింకేమీ కాద‌న్న విష‌యాన్ని తేల్చి చెప్పార‌ని చెప్పాలి. అంతేకాదు.. నేర‌చ‌రితుల విష‌యంలోనూ బీజేపీ బ‌రిలో దిగిన వారికి ఘ‌న చ‌రిత్రే ఉంది. గెలుపు మాత్ర‌మే ముఖ్య‌మైన‌ప్పుడు.. మిగిలిన‌వి చిన్న‌వైన‌ప్పుడు ఇలాంటివే చోటు చేసుకుంటాయి. ఇలా ఏ అవ‌కాశాన్ని వ‌దులుకోకుండా ప్ర‌య‌త్నించిన‌ప్పుడు విజ‌యం వెతుక్కుంటూ రాదా?

మ‌రోవైపు మోడీకి కౌంట‌ర్ పార్ట్ గా ఉన్న రాహుల్ ప్ర‌ధానికి ఏ ద‌శలోనూ మాట‌ల్లో గ‌ట్టి పోటీ ఇవ్వ‌లేక‌పోయార‌ని చెప్పాలి. ఇది కూడా ఒక మైన‌స్ గా చెప్పాలి. మొత్తంగా చూస్తే.. అర్థ‌మ‌య్యేది ఒక్క‌టే.. దేశంలో రాష్ట్రం ఏదైనా కానీ.. ఓట‌ర్లు ఎవ‌రైనా కానీ.. త‌న‌ను తిట్టే వారు.. త‌నంటే వ్య‌తిరేకంచే వారు ఉన్న చోటైనా స‌రే.. తాను టార్గెట్ చేస్తే.. అందుకు ఓకే అనే మంత్ర‌జాలం మోడీలో ఉంద‌న్న‌ది తాజా క‌ర్ణాట‌క ఫ‌లితాలు రుజువు చేశాయి. చూస్తుంటే.. మోడీ ఛ‌రిష్మా మ‌రికొంత కాలం కొన‌సాగేలా ఉంది. అప్ప‌టివ‌ర‌కూ ఈ త‌ర‌హా విజ‌యాలు ఆయ‌న సొంతం చేసుకుంటార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.