Begin typing your search above and press return to search.

ఈసీ కంటే ముందే ఎన్నికల ప్రకటన చేసిన మోడీ

By:  Tupaki Desk   |   23 Feb 2021 10:10 AM GMT
ఈసీ కంటే ముందే ఎన్నికల ప్రకటన చేసిన మోడీ
X
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీల గడువు ముగుస్తోంది. త్వరలోనే ఎన్నికలు రానున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను మినీ సమరంగా పేర్కొంటారు. దేశంలోనే కీలకమైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు అస్సాం, పుదుచ్చేరిలో ఎన్నికలు జరుగనున్నాయి.

ఈ ఎన్నికలపై ఇప్పటికే రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా ఈ ఎన్నికలపై ప్రధాని నరేంద్రమోడీ కూడా పరోక్షంగా లీకులు ఇచ్చారు. అస్సాంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ ఎన్నికలపై కొన్ని సంకేతాలు పంపారు.

మార్చి 7వ తేదీన ఐదు అసెంబ్లీలకు ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉందని మోడీ తెలిపారు. ‘ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసేలోపు వీలైనంత పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పర్యటిస్తా’ అని ప్రధాని బహిరంగసభలో తెలుపడంతో ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. అధికారిక సమాచారం మేరకే ప్రధాని ప్రకటన చేశారని పలు వర్గాలు భావిస్తున్నాయి.

మోడీ ప్రకటనతో రాజకీయ పార్టీలన్నీ అలెర్ట్ అయ్యాయి. ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. ప్రధాని ప్రకటన మేరకు షెడ్యూల్ మార్చ్ లో విడుదలైతే ఏప్రిల్, మే నెలలో ఎన్నికలు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బెంగాల్, తమిళనాడులో ఎన్నికల ప్రచారం మొదలైంది. పుదుచ్చేరిలో ప్రభుత్వం కూలిపోయింది. కేరళలో ఇంకా ఆ ఊపు రాలేదు. ప్రధాని ప్రకటనతో ఇప్పుడు అన్ని రాజకీయపార్టీలు అప్రమత్తమయ్యాయి.

ఒక్క బెంగాల్ లో మాత్రమే బీజేపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి. అక్కడ తృణమూల్ కు బీజేపీ గట్టి పోటినిస్తోంది. ఇక తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీ కూటమి గెలవడం అసాధ్యం. పుదుచ్చేరిలో టఫ్ ఫైట్ ఉండగా.. కాంగ్రెస్ కు మెజార్టీ ఉంది. ఇక కేరళలో కమ్యూనిస్టులు-కాంగ్రెస్ లను దాటి బీజేపీ ముందుకెళ్లే అవకాశాలు లేవు.