Begin typing your search above and press return to search.

మోడీ వ్యూహం ఇలా ఉంటుంది మ‌రి

By:  Tupaki Desk   |   19 Aug 2016 10:54 AM GMT
మోడీ వ్యూహం ఇలా ఉంటుంది మ‌రి
X
త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న పంజాబ్‌లో పాగా వేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా?

పంజాబ్‌ లో పట్టు సాధించేందుకు అక్క‌డి మూలాలున్న విదేశీల‌యుల‌ను మ‌చ్చిక చేసుకునే నిర్ణ‌యాన్ని ప్ర‌ధాన‌మంత్రి తీసుకున్నారా? అంటే అవుననే వ‌స్తోంది. సిక్కు ఎన్నారైలు కొందరిపై 32 ఏళ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేసి వారి అభిమానాన్ని చూరగొని తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రధాని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా గత మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ బ్లాక్ లిస్ట్‌ లో ఉన్న 212 కుటుంబాలను ఆ జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

ఆపరేషన్ బ్లూస్టార్ - కనిష్క దుర్ఘటన అనంతరం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సిక్కు ఎన్నారైలు భారత్‌ లో అడుగు పెట్టకుండా నిషేధం విధిస్తూ వారిని బ్లాక్‌ లిస్ట్‌ లో చేర్చింది. అమృత్‌ సర్‌ లోని స్వర్ణ దేవాలయంలో దాక్కున్న ఖలిస్థాన్ ఉగ్రవాదులను ఏరివేసేందుకు 1984లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపరేషన్ బ్లూస్టార్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ తరువాతి ఏడాదిలో మాంట్రియల్ - న్యూఢిల్లీ మధ్య తిరిగే ఎయిరిండియా విమానం కనిష్కను ఉగ్రవాదులు పేల్చేశారు. ఐరిష్ గగన తలంపై ఉండగా విమానం పేలిపోయింది. ఈ ఘటనలో 329 మంది దుర్మరణం చెందారు. దర్యాప్తులో సిక్కు మిలిటెంట్లే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేలింది. దీంతో ప్రభుత్వం 324 సిక్కు ఎన్నారై కుటుంబాలను బ్లాక్ లిస్టులో చేర్చుతూ దేశంలో వారు అడుగుపెట్టకుండా నిషేధం విధించింది. తాజాగా ఈ జాబితాలో ఉన్న కుటుంబాల్లో 212 కుటుంబాలను తొలగించేందుకు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) యోచిస్తోంది. పూర్తి స్థాయి పరిశీలన అనంతరం మిగతా కుటుంబాలపై ఉన్న నిషేధాన్ని కూడా తొలగించనుంది.

ప్రధాని మోడీ ఇటీవల యూకే - కెనడాల్లో పర్యటించిన సమయంలో ఈ విషయంలో సిక్కు సంస్థల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వచ్చాయి. నిషేధంపై పునరాలోచించాలని కోరుతూ వినతులు అందాయి. వీటిని పరిశీలించిన ప్రభుత్వం మూడు దశాబ్దాలుగా వారిపై కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయించింది. అయితే, ఈ ప్రతిపాదనను ఇంటలిజెన్స్ బ్యూరో తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రధాని జోక్యం చేసుకున్నట్టు తెలిసింది. పీఎంవో నిర్ణయంతో అమెరికా - బ్రిటన్ - కెనాడాలోని ఎన్నారై సిక్కులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.