Begin typing your search above and press return to search.

పెద్ద నోట్ల రద్దుతో మోడీ దొరికిపోయాడా?

By:  Tupaki Desk   |   12 Nov 2016 4:30 AM
పెద్ద నోట్ల రద్దుతో మోడీ దొరికిపోయాడా?
X
మూడో కంటికి తెలియకుండా చేపట్టిన పెద్ద నోట్ల రద్దు ప్రక్రియను.. ప్రకటించడానికి కొద్దిసేపటి ముందు క్యాబినెట్ సమావేశంలో వెల్లడించారని - ఆ విషయం వారికి తెలిసిపోయినందున.. ప్రధాని ప్రసంగం ముగిసేంత వరకూ కేంద్ర మంత్రులను సైతం బయటకు రానీయకుండా చూసి.. అత్యంత పకడ్బందీగా.. రహస్యంగా.. గోప్యంగా.. చేపట్టామని ప్రధాని న‌రేంద్ర మోడీ చెప్తున్నా.. ఇది కొన్ని నెలల ముందే బయటకు పొక్కిందన్న విషయం సంచలనం కలిగిస్తున్నది. అందులోనూ మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌ కే ఈ కబురు మొదటగా అందిందన్న సంగతి.. తీవ్ర చర్చనీయాంశమైంది. నల్లధనం పేరుతో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం గురించి బీజేపీ నేతలకు - అనేకమంది నల్ల కుబేరులకు ముందే తెలుసునని - ఆమేరకు సదరు సంపన్న వర్గాలు ముందే జాగ్రత్త పడ్డాయని విపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని బలపర్చేలా.. అఖిల అనే గుజరాతీ సాయంకాలపు దిన పత్రిక ఏప్రిల్ 1న ప్రచురించిన కథనం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్నది.

కేంద్రం త్వరలో రూ.500 - రూ.1000 నోట్లను రద్దు చేయబోతున్నదని ఏప్రిల్ 1న వెలువడిన అఖిల అనే గుజరాతీ దినపత్రికలో పతాక శీర్షికలో వార్త ప్రచురితమైంది. సామాజిక మాధ్యమాలు ఈ గుట్టును బయటపెట్టాయి. దీనికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ వాట్సప్ - ఫేస్‌ బుక్ తదితరాల్లో ప్రస్తుతం హల్‌ చల్ చేస్తున్నది. అవినీతి - నల్లధనం - నకిలీనోట్లు - ఉగ్రవాదాన్ని సమాజం నుంచి బహిష్కరించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తున్నది అంటూ ప్రారంభమైన వార్త.. ప్రస్తుతం చెలామణీలో ఉన్న రూ.500 - రూ.1000 నోట్లను రద్దు చేసే దిశగా యోచిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది అని పేర్కొంది. ప్రజానీకం తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను బ్యాంకులద్వారా రూ.100 నోట్లుగా మార్చుకోవాల్సివుంటుందని తెలిపింది. రూ.2000 - ఆపైన లావాదేవీలన్నీ క్రెడిట్ - డెబిట్ కార్డులు - ఇతర ఎలక్ట్రానిక్ విధానాల ద్వారానే జరుగాలనేది కేంద్రం ఉద్దేశంగా ఉన్నట్టు పేర్కొంది." రాజ్‌ కోట్ - ఏప్రిల్ 1 డైట్‌ లైన్‌ తో ఉన్న ఆ వార్తలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవబోతున్న సందర్భంగా తమ ప్రధాన ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చుకోబోతున్నది. నల్లధనం - అవినీతి - నకిలీ నోట్ల వంటి జాడ్యాలను నిర్మూలించాలంటే పెద్ద నోట్లను రద్దు చేయడమే మేలని మోడీ తలపోస్తున్నారు. ప్రధాని ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు మాకు విశ్వసనీయంగా తెలిసింది. దీనివల్ల నల్లధన కుబేరులు బ్యాంకులవైపు పరుగెడుతారనీ, నకిలీ కరెన్సీ దందా నడుపుతున్న వారు దుకాణం మూసేస్తారని కేంద్రప్రభుత్వ నిశ్చితాభిప్రాయం అని ఉంది. 500 - 1000 నోట్లే సకల చీడపీడలకు కారణమని భావిస్తున్న ప్రభుత్వం, దాదాపు 2 లక్షల కోట్ల విలువైన నకిలీ కరెన్సీ రంగంలో ఉంది అని అంచనావేసింది "అంటూ అఖిల పత్రిక రాసింది.

కేవలం 500 - 1000 నోట్ల రూపంలోనే బ్లాక్ మ‌నీ - తీవ్ర‌వాదం రూపంలో ఈ జాడ్యాన్ని సమూలంగా నిర్మూలించాలంటే ఈ పెద్ద నోట్లను రద్దు చేయడమే సరైనదని కేంద్రం భావించిందని అఖిల ప‌త్రిక తెలిపింది. పెద్ద నోట్ల రద్దుతో ఇంట్లో పెద్ద మొత్తాలను చిన్న నోట్లతో భద్రపరచడం సాధ్యం కాదు కాబట్టి, తప్పనిసరిగా ప్రజలు బ్యాంకుల్లోనే దాచుకోవాల్సివస్తుందనీ, తద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సమాజంలోని ప్రవహిస్తుందని కేంద్రం అంచనా వేస్తున్నట్టు అఖిల పత్రిక తన కథనంలో వ్యాఖ్యానించింది. ఇదేకాకుండా మన ఇంట్లో ఎంత మొత్తం పెట్టుకోవాలో కూడా కేంద్రమే నిర్ణయించబోతున్నదని, ఇందువల్ల ప్రజలు ఎక్కువ మొత్తాన్ని ఇంట్లో పెట్టుకోలేక బ్యాంకులో దాచాల్సివస్తుందని, తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ అంతా పారదర్శకంగా మారుతుందని ప్రభుత్వపెద్దల అభిప్రాయమని తెలిపింది. ఎన్నికల సందర్భంలో పెద్ద ఎత్తున జరిగే నల్లధన పంపిణీని ఈ చర్యతో అరికట్టవచ్చని ప్రధాని యోచన అని పేర్కొంది. ప్రధాని ప్రకటించబోయే సంచలనాత్మక నిర్ణయం వల్ల సామాన్య ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకపోగా - నల్లధన కుబేరులకు - అవినీతిపరులకు మాత్రం సింహస్వప్నంగా మిగిలిపోతుందని అఖిల పత్రిక తన కథనంలో వ్యాఖ్యానించింది.

కొసమెరుపు:

అఖిల దినపత్రిక యజమాని - సంపాదకుడు అజిత్ జనాత్ర. ఆయన ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడని స్థానికుల అభిప్రాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/