Begin typing your search above and press return to search.

యూపీ వలస కార్మికులకు ఉపాధి పథకం ... ప్రారంభించిన మోదీ !

By:  Tupaki Desk   |   26 Jun 2020 11:30 AM GMT
యూపీ వలస కార్మికులకు ఉపాధి పథకం ... ప్రారంభించిన మోదీ !
X
లాక్‌ డౌన్తో ఎన్నో కష్టాలు పడుతున్న వలస కార్మికుల కోసం కేంద్రం ప్రత్యేక ఉపాధి పథకాన్ని తీసుకొచ్చింది. 'ఆత్మ నిర్బర్ ఉత్తరప్రదేశ్ రోజ్‌గార్ అభియాన్’ పథకాన్ని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఆన్ ‌లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ... ఈ రోజున ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదని అన్నారు. వైరస్ కారణంగా ఉత్తరప్రదేశ్‌ కు చేరుకున్న వలస కార్మికులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.

లాక్ ‌డౌన్ తర్వాత 30 లక్షల మంది వలస కార్మికులు యూపీకి చేరుకున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బంది పడనివారంటూ లేరని, పల్లె నుంచి పట్టణం దాకా అందరూ సవాళ్లను ఎదుర్కొంటున్నారని , వ్యాక్సిన్ వచ్చే వరకూ మాస్క్ ధరించి, భౌతిక దూరం తప్పక పాటించాలని సూచించారు. ఆత్మ నిర్బర్ ఉత్తర్‌ప్రదేశ్ రోజ్‌గార్ అభియాన్ ఇతర రాష్ట్రాలకు ప్రేరణ కలిగించి, మోడల్‌ గా నిలుస్తుందన్నారు. సంక్షోభాన్ని అవకాశంగా మార్చడానికి ఇది ఒక ఉదాహరణ అని, ఇతర రాష్ట్రాలు కూడా ఇటువంటి పథకాలతో ముందుకు వస్తాయని తాను ఆశిస్తున్నాను అని ప్రధాని ఉద్ఘాటించారు.

ప్రపంచంలోని చాలా దేశాల కంటే యూపీ రాష్ట్రం పెద్దదని, వైరస్‌ పై పోరాటంలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం చాలా శ్రమిస్తోందని అన్నారు. అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలతో దాదాపు 85వేల మంది ప్రాణాలు దక్కాయని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్ విమానాశ్రయానికి త్వరలోనే అంతర్జాతీయ హోదా లభించనుందని, ముఖ్యంగా పూర్వాంచల్‌ లో వాయు మార్గం మరింత బలోపేతమవుతుందన్నారు. బుద్ధుడి భక్తులు యూపీకి రావడం వల్ల ఉద్యోగకల్పన జరుగుతుందని ప్రధాని తెలిపారు. గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్ ద్వారా గ్రామాల్లో అభివృద్ధి ముఖ్యంగా ఉద్యోగ కల్పన కోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ప్రధాని వెల్లడించారు.