Begin typing your search above and press return to search.

కోటి కోట్ల హామీ అంతా బోగస్సేనా ?

By:  Tupaki Desk   |   16 Aug 2021 5:04 AM GMT
కోటి కోట్ల హామీ అంతా బోగస్సేనా ?
X
మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి హామీ కల్పనకు ‘ప్రధానమంత్రి గతిశక్తి’ పథకంలో కోటి కోట్ల రూపాయలు కేటాయించబోతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా గంభీరంగా ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీన ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా మోడీ చేసిన ప్రకటన విషయంలో అందరిలోనూ ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే ఇదే ప్రకటనను గతంలో రెండు సార్లు చేశారు. అంటే 2019-20 లో, 2020-21 లో జరిగిన జెండా పండుగ సందర్భంలో కూడా సేమ్ ఇలాంటి ప్రకటనే చేశారు.

పై రెండు సంవత్సరాలు కూడా కోటి కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పన, యువతకు ఉపాధి కోసం కోటి కోట్లు కేటాయించబోతున్నట్లు చెప్పారు. తాజాగా మళ్ళీ హామీని పునరావృతం చేశారు. అంటే మోడీ హామీలిస్తారే కానీ దేన్నీ అమలు చేయరనే ఆరోపణలు దీంతో పెరిగిపోతోంది. ఒకే హామీని వరుసగా మూడేళ్ళుగా మోడీ ఎలా ఇస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు. మొదటి సంవత్సరం హామీ ఇచ్చారంటే దాన్ని అమలు చేస్తారనే జనాలందరూ అనుకుంటారు.

ఇచ్చిన హామీని అమలు చేయకుండా మళ్ళీ మరుసటి సంవత్సరం కూడా అదే హామీ ఇవ్వటం మామూలుగా జరగదు. ఎందుకంటే ముందు సంవత్సరం ఇచ్చిన హామీలేంటి, వాటి అమలు ఎంతవరకు వచ్చిందనే విషయాన్ని పీఎంవో ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తుంటారు. కాబట్టి హామీలను పునరావృతం కాకుండా చూసుకుంటారు. అలాంటిది రెండో ఏడాది కూడా సేమ్ టు సేమ్ హామీ పునావృతమైందంటే ఆశ్చర్యంగా ఉంది.

రెండో సంవత్సరంలో కూడా ఒకే హామీ పునరావృతం అయ్యిందంటే ఎక్కడో పొరబాటు జరిగిందని అర్ధమైపోయింది. పోనీ ఇచ్చిన హామీని అమల్లోకి తెచ్చారా అంటే అదీలేదు. అంటే ముందు సంవత్సరం ఇచ్చిన హామీని పట్టించుకోకుండానే మరుసటి ఏడాది కూడా అదే హామీని రిపీట్ చేశారు మోడీ. ఎక్కడో తప్పు జరిగిపోయిందనుకుంటే మళ్ళీ ఇఫుడు కూడా మూడోసారి అదే హామీని పునరావృతం చేసి రెండోసారి కూడా అదే తప్పు చేశారు.

మోడీ తాజా హామీని చూసిన తర్వాత ఈ హామీలంతా ఉత్త బోగస్సే అని జనాలకు అర్ధమైపోయింది. లేకపోతే ఒకే హామీని వరుసగా మూడేళ్లు ఏ ప్రధానమంత్రీ ఇవ్వరు. అంటే తానిచ్చిన హామీల సంగతి మోడినే మరచిపోయారన్న విషయం అర్ధమైపోతోంది. ఏదో సందర్భం వచ్చింది కదాని ఆర్భాటంగా హామీలిచ్చేయటం తర్వాత మరచిపోవటం పాలకులకు మామూలైపోయిందనే చర్చ పెరిగిపోతోంది. మొన్నటి కరోనా వైరస్ తీవ్రత సందర్భంలో కూడా 20 లక్షల కోట్ల రూపాయలతో ఆత్మనిర్భర్ హామీ కూడా ఇలాంటిదే అనే ఆరోపణలకు తాజా హామీతో ఊతమొచ్చినట్లయ్యింది.