Begin typing your search above and press return to search.

ఆయుధాలు: మోడీ షాలకు ఈడీ అయితే.. కేసీఆర్ అండ్ కో పోలీసులా?

By:  Tupaki Desk   |   17 Aug 2022 10:30 AM GMT
ఆయుధాలు: మోడీ షాలకు ఈడీ అయితే.. కేసీఆర్ అండ్ కో పోలీసులా?
X
అధికారం చేతిలో ఉంటే అధికార వ్యవస్థల్ని తమ వ్యతిరేకుల మీద వాడే ధోరణిని మొదలు పెట్టింది కాంగ్రెస్సే అయినా.. ఆ తర్వాతి కాలంలో అధికారంలోకి వచ్చిన వారు వాడేస్తున్న తీరు.. అందుకు అనుసరిస్తున్న విధానాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న రాజకీయ పరిణామాలకు తగ్గట్లు అధికార పక్షాలు అనుసరిస్తున్న విధానాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితే మరింతకాలం నడిస్తే.. అధికారంలో ఉన్న వారు ఏం చేసినా నడుస్తుందన్న దిశగా అడుగులుపడటం ఖాయమని చెప్పాలి.

ఇప్పటికే కేంద్రంలోని మోడీషాలు తమ రాజకీయ ప్రత్యర్థులపై ఈడీ.. సీబీఐలను ప్రయోగిస్తున్నారంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమారుడు కేటీఆర్ లు ఆరోపిస్తుంటారు. తమ దారికి తెచ్చుకోవటానికి అస్త్రాలుగా ఈడీని..సీబీఐను వారు వాడినంత ఎక్కువగా కేంద్రంలోని మరే ప్రభుత్వం కూడా పని చేయలేదన్న ఆరోపణ కూడా ఉంది. అయితే.. ఇలాంటి విమర్శలు.. రాజకీయ పార్టీలు సైతం తాము అధికారంలో ఉన్న వేళలో ఇదే తీరును ప్రదర్శించిన వైనాన్ని మర్చిపోలేం. కాకుంటే.. ఒకరు పావలా చేస్తే.. మరొకరు ముప్పావలా చేస్తున్నారే తప్పించి.. ఎవరూ తక్కువ తినలేదన్న మాట వినిపిస్తోంది.

ఈ వాదనకు బలం చేకూరే పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. కేంద్రంలోని మోడీ సర్కారు తన రాజకీయ ప్రత్యర్థుల లెక్క తేల్చేందుకు వారిని దారికి తెచ్చుకునేందుకు ఈడీని విరివిగా వాడేస్తుందన్న మాట బలంగా వినిపిస్తున్న తెలంగాణ అధికారపక్షం సైతం.. తక్కువేం కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలోనూ మునుగోడు ఉపపోరుపై విపరీతమైన ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ ఉప ఫలితం తెలంగాణ రాజకీయాలపై స్పష్టమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్ని ఈ ఉపపోరును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనున్నాయి.

ఇదిలా ఉంటే అధికార పార్టీపై ఒత్తిడి పెంచేందుకు.. వారిలో ఆందోళనను పెంచేందుకు వీలుగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా గతంలో కేసీఆర్ ఏ తరహాలో రాజకీయాన్ని నడిపారో ఇప్పుడు అదే రాజకీయాన్ని ఆయనకు రుచి చూపిస్తోంది. టీఆర్ఎస్ ను బలపర్చుకునే క్రమంలో ఇతర పార్టీల్లోని అసంత్రప్తుల్ని అక్కున చేర్చుకోవటం తెలిసిందే.

అదే తీరులో బీజేపీ సైతం ఇప్పుడు టీఆర్ఎస్ విషయంలో అమలు చేస్తోంది. అయితే.. తమపై ఒత్తిడిని పెంచుతూ..తమ నేతల్ని పార్టీ వీడిపోయేలా చేస్తున్న బీజేపీకి షాకిచ్చే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగగా తమ పార్టీకి చెందిన నేతలకు కొత్త భయాన్ని గుర్తు చేసేందుకు పాత కేసుల్ని బయటకు తీస్తుందన్న విమర్శలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. మునుగోడు ఉపబరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని రంగంలోకి దించాలని సీఎం కేసీఆర్ భావించటం.. దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసమ్మతిని వినిపిస్తున్న నేతలకు తొలుత సర్ది చెప్పటం.. అయినప్పటికీ వారు తమ తీరును మార్చుకోకపోవటతో.. వారికి నాయకత్వం వహిస్తున్న వారెవరు? అన్న విషయాన్ని గుర్తించి టార్గెట్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

అసమ్మతి నాయకత్వం వహిస్తున్న వారిలో చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డిని దారికి తెచ్చుకోవటానికి వీలుగా ఆయనపై పాత కేసుల్ని తెర మీదకు తెచ్చారని.. ఇందులో భాగంగా ఆయన్ను సోమవారం రాత్రి అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేసినట్లుగా చెబుతున్నారు. దీంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన ఆయన మంగళవారం బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్నట్లు చెబుతున్నారు. ఇంతకాలం ఎంపీపీ మీద ఉన్న కేసుల విషయంలో పోలీసులు పట్టనట్లుగా వ్యవహరిస్తూ.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా యాక్టివ్ కావటం గమనార్హం. అంతేకాదు.. కొందరు రైతులు వెంకట్ రెడ్డి దౌర్జన్యంగా తమ భూముల్ని పట్టా చేయించుకున్నారంటూ ధర్నాకు దిగటం కూడా రాజకీయమే అన్న మాట వినిపిస్తోంది.

ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వెంకట్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు సివిల్ డ్రెస్ లో వెళ్లగా.. ఇంట్లో ఉన్నఆయన బయటకు రావటానికి అభ్యంతరం వ్యక్తం చేశారని చెబుతున్నారు. దీంతో స్థానికంగా ఉన్న బీజేపీ నేతలకు సమాచారం ఇవ్వటంతో వారంతా వెంకట్ రెడ్డి ఇంటికి వచ్చి ముందస్తు నోటీసులు లేకుండా రాత్రిపూట అరెస్టు చేయటం ఏమిటని ప్రశ్నించటంతో పోలీసులు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో మంగళవారం బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లిన వెంకట్ రెడ్డి కాషాయ కండువా కప్పుకోవటం గమనార్హం. ఈ మొత్తం ఎపిసోడ్ ను ఉదాహరణగా చూసినప్పుడు.. కేంద్రంలో మోడీ సర్కారు ఈడీ.. సీబీఐలను ప్రయోగిస్తుందన్న విమర్శలు ఎంత బలంగా ఉన్నాయో.. తెలంగాణలో కేసీఆర్ సర్కారు తన ప్రత్యర్థులపై పోలీసుల్ని ప్రయోగిస్తుందన్న వాదన అంతే బలంగా వినిపిస్తోంది.