Begin typing your search above and press return to search.

మోడీ దుర్మార్గం ఎంతో చెప్పిన పెద్దాయన

By:  Tupaki Desk   |   9 April 2019 4:48 AM GMT
మోడీ దుర్మార్గం ఎంతో చెప్పిన పెద్దాయన
X
మోడీ మంచోడు. ఆయనీ దేశానికి చౌకీదారు. ఆయనలాంటి వ్యక్తిని ఒక్క మాట అంటే.. వాడు దేశద్రోహి. భారతదేశంలో మోడీని పొగడాలే కానీ.. వేలెత్తి చూపించకూడదు. విమర్శించే ప్రతి నోరు.. తప్పుల్ని ఎత్తి చూపే వేలు పాక్ మూలాలు ఉన్నవే తప్పించి.. వారిలో భారతీయ తత్త్వం ఇసుమంతైనా ఉండదు. కరడుగట్టిన బీజేపీ.. మోడీ పరివారం మాటలు దాదాపుగా ఇలానే ఉంటాయి.

రాజకీయంగా ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు తప్పించి శత్రువులు ఉండరన్న గీతను చెరిపేసి.. మీరు మోడీని అభిమానిస్తారా?.. అయితే ఓకే. లేదు.. మోడీ మీద ఆగ్రహం ప్రదర్శిస్తారా? అయితే.. మీరు ద్రోహులన్నట్లుగా మాట్లాడటం మోడీ పరివారానికి అంతకంతకూ ఎక్కువ అవుతోంది. మోడీ పాలనలో అవినీతి మచ్చుకు కూడా లేదని చెప్పే వారంతా.. రాఫెల్.. విజయ్ మాల్యా.. నీరవ్ మోడీ ఉదంతాలు దేనికి నిదర్శనం? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పరు.

మోడీని తప్పు పట్టే వారిపై ముప్పేట దాడి మామూలైన వేళ.. తాజాగా మాజీ ప్రధాని.. పెద్దాయనగా పేరు ప్రఖ్యాతులున్న దేవెగౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ ఎలాంటోడన్న విషయాన్ని ఆయన చెప్పే క్రమంలో ఘాటైన విమర్శలు చేశారు. చేరదీసి.. పెంచి పెద్ద చేసి.. అగ్రస్థానంలో నిలిపిన గురువును అధోగతి పాలు చేసిన మోడీ కోణాన్ని ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. చంద్రబాబు ఒత్తిడికి గుజరాత్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చినప్పు్డు మోడీని బీజేపీ అగ్రనేత అద్వాణీ కాపాడారని.. ఇప్పుడు అలాంటి అద్వానీ గతి ఏమైందో దేశం మొత్తం చూస్తుందని దేవెగౌడ పేర్కొన్నారు.

ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు వచ్చిన ఆయన మోడీ తీరును కడిగిపారేశారు. తాజాగా అద్వానీని పక్కన పెట్టేసిన మోడీ.. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ లాంటి సీనియర్లను అవమానకంగా పక్కకు తప్పించిన వైనాన్ని గుర్తు చేశారు. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎనిమిదిసార్లు గెలిచారని.. అలాంటి సీనియర్ ను మోడీ పక్కకు తప్పించటం ఏంత దుర్మార్గం అని ప్రశ్నించారు.

2014లో జరిగిన ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీకి 17 ఎంపీ స్థానాలు వచ్చాయని.. ఈసారి అలా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఒక్క గుజరాత్ రాష్ట్రంలో మినహాయిస్తే.. మరే రాష్ట్రంలోనూ గతసారి వచ్చినన్ని సీట్లు వచ్చే అవకాశం లేదని తేల్చారు. మోడీ హయాంలో స్వతంత్ర్య వ్యవస్థలన్నీ భ్రష్ఠు పట్టిపోయినట్లు మండిపడ్డారు. ఏపీ విభజన వేళ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన మోడీ.. ఆ తర్వాత దాని ఊసే పట్టలేదన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదన్నారు. మోడీ తీరును ఇంత తీవ్రస్థాయిలో విరుచుకుపడిన దేవెగౌడ వ్యాఖ్యలు ఇప్పుడు అందరి చూపులు పడేలా చేస్తున్నాయని చెప్పక తప్పదు.