Begin typing your search above and press return to search.

ప్రపంచ నేతలపై సర్వే ఫలితంలోనూ మోడీనే మొనగాడు బాస్

By:  Tupaki Desk   |   1 Jan 2021 2:30 PM GMT
ప్రపంచ నేతలపై సర్వే ఫలితంలోనూ మోడీనే మొనగాడు బాస్
X
మోడీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గడిచిన కొన్ని వారాలుగా దేశ రాజధాని డిల్లీ శివారులో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిరసనను నిలువరించాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాని పరిస్థితి. అంతకంతకూ తీవ్రమవుతున్న ఆందోళనలు మోడీ సర్కారుకు ఇబ్బందికరంగా మారాయి. ఇలాంటి వేళలో ఆయనకు అనూహ్యమైన దన్ను దొరికింది. ఆయన నాయకత్వ పటిమ ఎంతన్న విషయంతో పాటు.. దేశ వ్యాప్తంగా ఆయనకున్న ఆదరణ ఎంతన్న విషయాన్ని తెలిపే సర్వే నివేదిక ఒకటి విడుదలైంది.

మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల అధినేత పని తీరు.. ఆయా దేశాల్లో వారికి ఉన్న ఇమేజ్ ఎంతన్న విషయాన్ని వెల్లడిస్తుంటుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున సర్వేలు నిర్వహిస్తారు. తాజాగా నిర్వహించిన సర్వేలో ప్రధాని మోడీకి తిరుగులేని ప్రజాదరణ ఉన్న విషయం వెల్లడైనట్లుగా ఈ సర్వే వెల్లడించింది.

భారత ప్రధాని మోడీని 55 శాతం మంది ప్రజలు ఆమోదిస్తున్నారని పేర్కొంది. జర్మనీ ఛాన్సలర్.. ఉక్కుమహిళగా అభివర్ణించే ఏంజెలా మెర్కెల్కు 24 శాతం మాత్రమే ఆమోదముద్ర లభించగా.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆయన పని తీరును ఆమోదించే వారి కంటే వ్యతిరేకించే వారే ఎక్కువట.

మోడీ పని తీరును భారత్ లో 75 శాతం మంది ప్రజలు ఆమోదిస్తుంటే.. 20 శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లుగా సర్వేలో వెల్లడైంది. పలు దేశాల అధినేతలతో పోలిస్తే.. మోడీకే ఎక్కువ ప్రజామద్దతు ఉందన్న విషయం తాజా సర్వే స్పష్టం చేసింది. ఈ రిపోర్టు మోడీకి సానుకూలంగా మారుతుందని చెప్పక తప్పదు.