Begin typing your search above and press return to search.

అటూ ఇటూ కాకుండా.. ఇరుక్కున్న మోడీ!

By:  Tupaki Desk   |   19 Jun 2021 4:30 PM GMT
అటూ ఇటూ కాకుండా.. ఇరుక్కున్న మోడీ!
X
ఇద్దరూ సన్నిహితులే.. ఇద్దరూ కేంద్రంలోని బీజేపీకి సాయం చేసిన వారే.. కానీ ఎవరికి సాయం చేయాలి? ఇప్పుడు ఇదే ప్రధాని నరేంద్రమోడీ ముందరి కాళ్లకు బంధం వేస్తోంది. బీహార్ లో రాజకీయ అస్థిరతకు గురైన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)లో ఇప్పుడు అసమ్మతి రాజుకుంది. ఎల్జేపీ నిట్టనిలువుగా చీలిపోయింది. రాంవిలాస్ పాశ్వాన్ కొడుకు అయిన చిరాగ్ పాశ్వాన్ ను దింపేసి ఆయన సొంత చిన్నాన్న పశుపతి కుమార్ పరాస్ ‘ఎల్జేపీ’ అధ్యక్షుడయ్యాడు.

పార్టీని నిలువుగా చీల్చేయడమే కాకుండా ఆరుగురు ఎంపీల్లో ఐదుగురిని పశుపతి తన దగ్గరకు లాగేసుకున్నాడు. తమదే అసలైన ఎల్జేపీ అంటూ లోక్ సభ స్పీకర్ కు కూడా లేఖ రాశాడు.అలాగే తాజాగా పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా పశుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చూస్తుంటే చిరాగ్ ఒంటరి అయినట్టే కనిపిస్తోంది.

రాంవిలాస్ పాశ్వాన్ చనిపోగానే పార్టీ పగ్గాలు చిరాగ్ చేపట్టాడు. కానీ ఒంటెద్దు పోకడలతో ఇప్పుడు పార్టీలో అసమ్మతికి కారణమయ్యాడు. అబ్బాయి వ్యవహారశైలి బాగా లేదని.. అందుకే పార్టీని రక్షించేందుకే తానే మిగతా ఎంపీలతో బయటకు వచ్చానని బాబాయి పరాస్ చెప్పారు.

ఇక తనను వెన్నుపోటు పొడిచారని చిరాగ్ పాశ్వాన్ ఆరోపిస్తున్నారు. ఇందులో జేడీయూ హస్తం ఉందని.. తమ పార్టీలో సంక్షోభానికి నితీష్ కుమార్ వర్గం కారణమని ఆరోపించారు. ఇక చిరాగ్ వెంట అతడి కజిన్ సోదరుడు ఎంపీ ప్రిన్స్ రాజ్ పాశ్వాన్ కూడా లేడు. ప్రిన్స్ రాజు సైతం బాబాయ్ పశుపతితో కలిసి చిరాగ్ ను మోసం చేశాడని చిరాగ్ ఆవేదన చెందాడట.

ఈ బాబాయ్-అబ్బాయ్ కొట్లాట మోడీ మెడకు చుట్టుకుంటోంది. తన చిరకాల మిత్రుడు, మోడీ కేబినెట్ లో పనిచేసిన రాంవిలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్ ఒకవైపు.. మరోవైపు రెబల్స్ అయిన పశుపతి ఏకంగా బీజేపీకి సపోర్టు ప్రకటించాడు. దీంతో సపోర్టు చేసిన వారికి మద్దతివ్వాలా? లేద చిరాగ్ కు అండగా నిలవాలా? అన్నది మోడీకి తెలియకుండా పోయింది.

ప్రస్తుతానికి బలమున్న ఐదుగురు ఎంపీల పశుపతి గ్రూపుకే మోడీ సపోర్టు చేస్తున్నట్టు తెలుస్తోంది. మోడీ చిరాగ్ వైపు ఉంటే ఐదుగురు ఎంపీల బలం పోతుంది.

దేశంలో బీజేపీ అంతంత మాత్రంగానే బలం ఉండడంతో మిత్రపక్షాలను బలమున్న ఎంపీల మద్దతు అవసరం కావడంతో మోడీ తన స్నేహితుడు కొడుకు చిరాగ్ ను పక్కనపెట్టి ఐదుగురు ఎంపీల వైపే నిలుస్తున్నట్టుగా తెలుస్తోంది.