Begin typing your search above and press return to search.

మోడిపై బహిష్కరాణాస్త్రం

By:  Tupaki Desk   |   3 Aug 2021 4:52 AM GMT
మోడిపై బహిష్కరాణాస్త్రం
X
ప్రధానమంత్రి నరేంద్రమోడి వైఖరికి నిరసనగా విపక్షాలు పార్లమెంటు సమావేశాలను బహిష్కరించాలని డిసైడ్ చేశాయా ? అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా ప్రతిపక్ష నేతలతో పాటు వేలాదిమంది ప్రముఖుల మొబైల్ ఫోన్లను కేంద్రం ట్యాపింగ్ చేయిస్తోందని బయటపడిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే ట్యాపింగ్ విషయం బయటపడిందో అప్పటినుండి ప్రతిపక్షాలు పార్లమెంటు సమావేశల్లో నానా గోల చేస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ పై ప్రధానమంత్రి సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు పార్లమెంటులో డిమాండ్ చేస్తున్నాయి.

ప్రతిపక్షాలు ఎన్నిరోజులుగా డిమాండ్లు చేస్తున్నా, ఎన్నిరోజులు సమావేశాలను స్తంబింపచేస్తున్నా మోడి ఏమాత్రం లెక్క చేయటంలేదు. ప్రతిపక్షాలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. దాంతో సభను స్తంబింపచేయటంతో పాటు సుప్రింకోర్టులో కేసులు కూడా వేయాలని ప్రతిపక్షాల్లో చర్చలు మొదలయ్యాయి. ఇదే సమయంలో మంగళవారం నుండి అసలు పార్లమెంటు సమావేశాలనే బహిష్కరిస్తే ఎలాగుంటుందనే చర్చ కూడా పెరిగిపోతోంది.

ఇదే విషయమై చర్చించేందుకు కాంగ్రెస్ నేత రాహూల్ గాంధి నేతృత్వంలో ప్రతిపక్షాలు సమావేశమవనున్నాయి. తన నివాసంలో సుమారు 14 పార్టీల అధినేతలతో రాహూల్ కీలక సమావేశం ఏర్పాటుచేశారు. మోడి వైఖరి, పెగాసస్ వ్యవహారమే ప్రధాన అజెండాగా సమావేశం జరగబోతోంది. పెగాసస్ పై ప్రధానమంత్రి నిర్లక్ష్యంగా ఉన్నందున పార్లమెంటు సమావేశాలను బహిష్కరించి తమ నిరసనను తెలపేందుకు మెజారిటి పార్టీలు సానుకూలంగా ఉన్నాయని సమాచారం.

మొత్తానికి పెగాసస్ సాఫ్ట్ వేర్ కేంద్రంగా మోడికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యే సూచనలు బలపడుతున్నాయి. మొన్నటివరకు కాంగ్రెస్ అంటేనే మండిపడే తృణమూల్ అధినేత మమతబెనర్జీ తాజాగా సోనియాగాంధి, రాహూల్ తో భేటీ అయ్యారంటే పెగాసస్సే కారణం. మొత్తానికి తమ మధ్యున్న విభేదాలను పక్కనపెట్టేసి మోడి వ్యతిరేకంగా ఏకమవ్వటమే టార్గెట్ గా ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయి. మరి ఈరోజు సమావేశంలో ఏమి తేలుతుందో చూడాలి.