Begin typing your search above and press return to search.

కేసీఆర్ సలహాకు ఓకే చెప్పేసిన ప్రధాని మోడీ

By:  Tupaki Desk   |   22 March 2020 6:00 AM GMT
కేసీఆర్ సలహాకు ఓకే చెప్పేసిన ప్రధాని మోడీ
X
సరైన సమయం లో సరైన సలహాల అవసరం చాలానే ఉంటుంది. తాజాగా అదే పనిని చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. శుక్రవారం దేశంలోని ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసక్తికర సలహాను ఇచ్చారు సీఎం కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం అధ్వర్యం లో హైదరాబాద్ లో సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) సంస్థను నిర్వహిస్తుంటారని.. అందులో ఒకేసారి వెయ్యి కరోనా శాంపిల్స్ ను టెస్టు చేసే సామర్థ్యం ఉందన్న విషయాన్ని మోడీ ముందుకు తీసుకెళ్లారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంతో పాటు.. దేశంలోని వివిధ రాష్ట్రాల వారు తమకు వచ్చే కరోనా శాంపిల్స్ ను పరీక్షలు జరిపేందుకు వీలుగా నిర్ణయం తీసుకుంటే మంచిదన్న సూచన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన ఆలోచన బాగుండటం.. దాని కారణంగా ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్న విషయాన్ని గుర్తించిన ప్రధాని.. కేసీఆర్ కోరినట్లు అనుమతులు ఇచ్చేశారు.

దీంతో.. సీసీఎంబీ లో రోజుకు వెయ్యి శాంపిళ్లను పరీక్షించే అవకాశాన్ని వినియోగించుకున్నట్లైంది. సోమవారం నుంచి శాంపిళ్లను పరీక్షించనున్నట్లు సీసీఎంబీ డైరెక్టర్ వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సోమవారం నుంచి పరీక్షలు నిర్వహిస్తామని.. ఇందుకుసంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయినట్లు చెప్పారు. పదిహేను నుంచి ఇరవై మంది వరకూ సిబ్బంది టెస్టింగ్ ల్యాబ్ లో పని చేయనున్నట్లు చెబుతున్నారు.

అయితే.. కరోనా అనుమానితులు నేరుగా తమ సెంటర్ వద్దకు వస్తే శాంపిళ్లు తీసుకోమని స్పష్టం చేస్తోంది సీసీఎంబీ. గాంధీ ఆసుపత్రి నుంచి కానీ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వచ్చే శాంపిళ్లను మాత్రమే పరీక్షలు జరుపుతామని చెప్పారు. సీసీఎంబీ తాజాగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. ఒకేసారి వందల్లో శాంపిళ్లు వచ్చినా పరీక్షలు జరపటం సులువు అవుతుందని చెప్పాలి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే కాదు.. ప్రధానమంత్రి మోడీకి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది.