Begin typing your search above and press return to search.

మోదీ ఎఫెక్ట్... అసద్ చర్చీల బాట పట్టారే

By:  Tupaki Desk   |   22 Feb 2020 8:45 AM GMT
మోదీ ఎఫెక్ట్... అసద్ చర్చీల బాట పట్టారే
X
మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి నిజంగానే మొన్నటిదాకా సరైన ప్రత్యర్థే లభించలేదు. అందుకే... ఇప్పటికీ పాతబస్తీ వేదికగా... ఏ పార్టీకి సాధ్యం కాని రీతిలో వరుస గెలుపులతో పాటుగా భాగ్యనగరిలో తాను లేకుండా ఏ పని కాదన్న రీతిలో ఓవైసీలు ఎదిగారు. ఇదంతా 2014 ఎన్నికల నాటి వరకే. ఆ ఎన్నికల్లో కేంద్రంలో క్లిస్టర్ క్లియర్ మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ... ఓవైసీలకు బలమైన ప్రత్యర్థిగా అవరతించారని చెప్పాలి. అప్పటిదాకా ఏ ఒక్కరిని కూడా లెక్క చేయని ఓవైసీలు... మోదీ పీఎం సీట్లో కూర్చున్నాక తన పంథాను మార్చుకున్నారని చెప్పక తప్పదు. మొత్తంగా మోదీ ఎంట్రీతో ఓవైసీలు ఎంతగా మారిపోయారంటే... ఏకంగా క్రైస్తవుల సభలు, సమావేశాలు, ప్రార్థనలకు వెళ్లేదాకా పరిస్థితి మారిపోయింది.

ఇందుకు ఉదాహరణగా అన్నట్లుగా నిన్న హైదరబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిన్న జరిగిన క్రైస్తవుల సమావేశం ‘ప్రేయర్ డే’కు అసదుద్దీన్ ఓవైసీ స్వయంగా హాజరయ్యారు. క్రైస్తవుల ప్రార్థనా సమావేశాలకు హాజరైన ఓవైసీ... అంతటితోనే ఆగకుండా ఏకంగా అక్కడ కీలక ప్రసంగం కూడా చేశారు. ఈ ప్రసంగంలోనూ ఓవైసీ నోట నుంచి కీలక వ్యాఖ్యలు వినిపించాయి. జాతీయత ఉట్టిపడేలా వ్యవహరించిన ఓవైసీ.. మన దేశం అన్ని మతాలను, విశ్వాసాలను అక్కున చేర్చుకుంటుందని, ఆ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా కొన్ని శక్తులు దేశాన్ని బలహీనపరిచేందుకు కుట్రలు చేస్తున్నాయని కూడా ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఓవైసీలను ఆది నుంచి చూసిన వారు... అసద్ గానీ, అక్బరుద్దీన్ గానీ ఇప్పటిదాకా క్రైస్తవ సభకు హాజరైన వైనాన్ని దాదాపుగా చూసి ఉండరనే చెప్పాలి. అయితే మోదీ లాంటి బలమైన ప్రత్యర్థి ఏకంగా ప్రధాని హోదాలో దాదాపుగా స్థిరంగా కూర్చున్న నేపథ్యంలో ముస్లిం మైనారిటీలు ఓక్కరినే అంటిపెట్టుకుని రాజకీయం చేయడం కుదరన్న భావనకు ఓవైసీలు వచ్చి ఉంటారన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే దేశంలో మరో కీలక మైనారిటీ వర్గంగా ఉన్న క్రైస్తవులను దగ్గర చేసుకునేందుకు ఓవైసీ ఇలా ప్రార్థనా సభలకు కూడా వెళ్లడం ప్రారంభించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు ప్రార్థన సభలకు ఓవైసీ హాజరు కావడం నిజంగానే ఆసక్తికరంగా మారిపోయిందని చెప్పాలి.