Begin typing your search above and press return to search.

ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే బీజేపీకి ఓటమే..

By:  Tupaki Desk   |   16 April 2019 7:48 AM GMT
ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే బీజేపీకి ఓటమే..
X
ప్రధాని నరేంద్రమోడీ ఒకప్పటి సన్నిహితుడు - సుప్రీం కోర్టు న్యాయవాది అయిన అజయ్ అగర్వాల్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. లోక్ సభ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే.. ఈవీఎంల ట్యాంపరింగ్ జరగకుంటే బీజేపీకి 40 సీట్లు కూడా రావని కుండబద్దలు కొట్టారు.

2014లో రాయ్ బరేలీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మీద బీజేపీ అభ్యర్థిగా అజయ్ అగర్వాల్ పోటీచేశారు. తాజాగా ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన అజయ్ మోడీకి బహిరంగ లేఖ రాశారు. డిసెంబర్ 6న గుజరాత్ ఎన్నికల సమయంలో మణిశంకర్ అయ్యర్ నివాసంలో పాకిస్తాన్ అధికారులతో మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ, మాజీప్రధాని మన్మోహన్ సింగ్ సమావేశమైన విషయాన్ని తాను వెల్లడించానని అజయ్ అగర్వాల్ తెలిపారు. దీన్ని మోడీ దేశభద్రతకు ముడిపెట్టి గుజారాత్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాడని అజయ్ ఆరోపించారు. ఆ ఎన్నికల్లో గుజరాత్ లో బీజేపీ ఓటమి అంచుల్లోంచి బయటపడిందని తెలిపారు. గుజరాత్ విషయంలో తన పాత్రను స్వయంగా ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయ హసబోలే గుర్తించారని.. ఆ ఆడియోను కూడా అజయ్ విడుదల చేశారు. గుజరాత్ ఎన్నికల్లో గెలవడం కోసం అడ్వాణీకి రాష్ట్రపతి పదవి ఇవ్వకుండా మోడీ మోసం చేశారని ఆరోపించారు. గుజరాత్ లో అత్యధికంగా ఉన్న కోలి కులస్థులకు ఓటేసేందుకు రామ్ నాథ్ కోవింద్ కు రాష్ట్రపతి పదవి కట్టబెట్టారని అజయ్ ఆరోపించారు.

మోడీ కృతజ్ఞత లేని నేత అని అజయ్ అగర్వాల్ తెలిపారు. గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించినప్పటికీ తనకు ఎలాంటి ముఖ్యమైన పదవులు ఇవ్వలేదని.. మండిపడ్డారు. పెద్దనోట్లు రద్దు సమయంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న దందాను తాను వెలుగులోకి తెస్తే మెచ్చుకోవాల్సింది పోయి మోడీ తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని అజయ్ ప్రస్తావించారు. మోడీ పార్టీ కార్యకర్తలను బానిసల్లా వాడుకుంటారని.. కుటుంబాలను వదిలి 24గంటలు పనిచేయమంటారని.. చివరకు కుంభకోణాలకు పాల్పడి త్యాగాలకు అర్థం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.