Begin typing your search above and press return to search.

అమ్మ అడిగిన సాయంలో స‌గం ఇచ్చేసిన మోడీ

By:  Tupaki Desk   |   23 Nov 2015 8:57 AM GMT
అమ్మ అడిగిన సాయంలో స‌గం ఇచ్చేసిన మోడీ
X
నిధుల కేటాయింపు విష‌యంలో ప్ర‌ధాని మోడీ అస‌లుసిస‌లు గుజ‌రాతీలా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. లాభం లేనిదే గుజ‌రాతీలు వ్యాపారం అస్స‌లు చేయ‌రు. ఇక‌.. డ‌బ్బు ద‌గ్గ‌ర వారెంత గ‌ట్టిగా ఉంటారో.. గుజరాతీ వ్యాపారుల గురించి ఏ మాత్రం అవ‌గాహ‌న ఉన్నా.. ఇట్టే చెప్పేస్తారు. అలాంటి ల‌క్ష‌ణాల్ని పొణికిపుచ్చుకున్న మోడీ.. నిధుల విష‌యంలో మ‌హా క‌చ్ఛితంగా ఉంటారు. సాయం కోసం అరిచి గీపెట్టినా ఆయ‌న పెద్ద‌గా ప‌ట్టించుకోరు. అదే స‌మ‌యంలో.. త‌మ‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుందంటే.. ఊహించిన దాని కంటే ఎక్కువ సాయాన్ని ప్ర‌క‌టించ‌టం మోడీకి మామూలే.

దానికి నిద‌ర్శ‌నంగా జ‌మ్మూకాశ్మీర్‌.. బీహార్ రాష్ట్రాల‌కు ఆయ‌న ప్ర‌క‌టించిన ప్యాకేజీల్ని చెప్పొచ్చు. ఇక‌.. ఏపీ విష‌యానికి వ‌స్తే.. హూధూద్ తుపాను సంద‌ర్భంగా విశాఖప‌ట్ట‌ణం దారుణంగా దెబ్బ తిన్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా తుఫాను బీభ‌త్సాన్ని స్వ‌యంగా చూసేందుకు వ‌చ్చిన ప్ర‌ధాని మోడీ.. వెనువెంట‌నే ఎంత సాయ‌మైనా చేస్తామ‌ని.. విశాఖ‌ను ఆదుకుంటామ‌ని చెప్పారు. కానీ.. ఆయ‌న మాట‌లు ఎంత వ‌ర‌కు వాస్త‌వ‌రూపం దాల్చాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

తాజాగా భారీ వర్షాల కార‌ణంగా తమిళ‌నాడు.. ఏపీలోని కొన్ని జిల్లాలు తీవ్ర‌న‌ష్టం వాటిల్లింది. త‌మ రాష్ట్రాల‌కు జ‌రిగిన న‌ష్టాల గురించి రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కేంద్రాన్ని సాయం చేయాల‌ని కోరారు. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత త‌మ‌కు రూ.2వేల కోట్ల సాయం కావాల‌ని కోరితే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తొలుత వెయ్యి కోట్లు ఇవ్వాల‌ని.. త‌ర్వాత రూ.3వేల కోట్ల సాయం అందించాల‌ని కోరారు.

చంద్ర‌బాబు చేసిన విన్నపంపై పెద్ద‌గా స్పందించ‌ని మోడీ.. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత రాసిన లేఖ‌పై తాజాగా స్పందించారు. త‌మిళ‌నాడుకు రూ.940కోట్ల కేంద్ర సాయాన్ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అంటే.. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి కోరిన సాయంలో దాదాపు 50 శాతాన్ని మోడీ కేంద్ర‌సాయంగా ప్ర‌క‌టించ‌టం గ‌మ‌నార్హం. అదే స‌మ‌యంలో.. ఏపీకి ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి సాయాన్ని ప్ర‌క‌టించ‌లేదు. అమ్మ అడిగిన సాయంలో 50 శాతాన్ని మోడీ ప్ర‌క‌టించ‌టం గొప్ప‌గానే చెప్పొచ్చు. అమ్మ విన్న‌పాన్ని మ‌న్నించిన మోడీ.. బాబు మాట గురించి ఏం చేస్తారో..?