Begin typing your search above and press return to search.

మోడీకి వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చిన మహారాష్ట్ర

By:  Tupaki Desk   |   29 Nov 2016 7:36 AM GMT
మోడీకి వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చిన మహారాష్ట్ర
X
పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం ప్ర‌ధాని మోడీ సెల్ఫ్ గోల్ అంటున్న‌వారంతా ఆశ్చ‌ర్య‌పోయేలా మ‌హారాష్ర్ట‌లో లోకల్ ఎల‌క్ష‌న్ల ఫ‌లితాలు వ‌చ్చాయి. నోట్ల ర‌ద్దు నిర్ణయం ప్ర‌జ‌ల జీవితాల‌పై పెను ప్ర‌భావం చూప‌డంతో ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌ని విప‌క్షాలు చంక‌లు గుద్దుకుంటున్న త‌రుణంలో ఈ ఫ‌లితాలు వారిని పున‌రాలోచ‌న‌లో ప‌డేశాయి. నిజానికి కాంగ్రెస్, ప‌లు ఇత‌ర విప‌క్షాలైతే ఇప్పుడు క‌నుక ఎన్నిక‌లు జ‌రిగితే మోడీ ఓట‌మి ఖాయ‌మ‌ని.. త‌మ గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేన‌ని క‌ల‌లు కూడా క‌న్నాయి. కానీ... లోకల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు చూశాక మాత్రం అలాంటిదేమీ లేద‌ని అర్థ‌మ‌వుతోంది.

మ‌హారాష్ట్ర రాష్ట్రంలోని 147 మున్సిప‌ల్ కౌన్సిళ్లు - 17 న‌గ‌ర పంచాయ‌తీల ప‌రిధిలోని 3705 సీట్ల‌కు ఆదివారం ఎన్నిక‌లు నిర్వ‌హించారు. సోమ‌వారం ఓట్లు లెక్కించారు. రాత్రి పొద్దుపోయే సమయానికి 3510 సీట్ల ఫ‌లితాలు రాగా, మిగ‌తా వాటిలో లెక్కింపు కొన‌సాగుతోంది. బీజేపీ 851 స్థానాల్లో విజ‌య భేరి మోగించింది. శివ‌సేన 514 - ఎన్సీపీ 638 - కాంగ్రెస్ 643 - ఎంఎన్ ఎస్ 16 - బీఎస్పీ 9 - గుర్తింపు లేని పార్టీలు 119 - స్థానిక కూట‌ములు 384, సీపీఎం 12 - స్వ‌తంత్రులు 324 స్థానాల్లో విజ‌యం సాధించారు.

కాగా ఈ ఫ‌లితాల‌ను చూసిన త‌రువాత బీజేపీలో ఏమూల‌నో ఉన్న ఆందోళ‌న ప‌టాపంచ‌లైన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఈ ఫ‌లితాల‌పై ప్ర‌ధాని మోడీ కూడా స్పందించ‌డ‌మే అందుకు ఉదాహ‌ర‌ణ‌. ఆయ‌న దీన్ని పేద‌ల గెలుపుగా అభివ‌ర్ణించారు. అభివృద్ధికి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టార‌ని తెలిపారు. దేశ హితం కోసం తీసుకున్న నిర్ణ‌యాన్ని ప్ర‌జ‌లు స్వాగ‌తించార‌ని చెప్ప‌డానికి ఇంత‌కంటే ఉదాహ‌ర‌ణ అవ‌స‌రం లేద‌ని, ప్ర‌తిప‌క్షాలు ఇకనైనా క‌ళ్లు తెర‌వాల‌ని బీజేపీ అధ్య‌క్షుడు అమిత్‌షా అంటుండ‌డంతో బీజేపీ మ‌న‌సులోని బ‌రువు దిగిపోయిన‌ట్లుగా క‌నిపిస్తోంది. అయితే.... ఇప్ప‌టికీ చ‌క్క‌బ‌డ‌ని నోట్ల ర‌ద్దు ప‌రిస్థితులు ప్ర‌జ‌ల మైండ్ సెట్ ను మార్చ‌బోవ‌న్న గ్యారంటీ మాత్రం లేద‌ని కొంద‌రు బీజేపీ నేత‌లు ఇంకా టెన్ష‌న్ ప‌డుతున్నారు. యూపీలో ఎన్నిక‌లు పూర్త‌యితే కానీ అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డ‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/