Begin typing your search above and press return to search.

శిరసు వంచని మోడీ.. నడుము మాత్రం భారీగా వొంచేశారా

By:  Tupaki Desk   |   4 July 2022 4:50 AM GMT
శిరసు వంచని మోడీ.. నడుము మాత్రం భారీగా వొంచేశారా
X
గడిచిన కొద్ది రోజులుగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన విజయ సంకల్ప భారీ బహిరంగ సభ విజయవంతంగా ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను తెగ పెంచేసిన ఈ భారీ బహిరంగ సభ మీద చాలానే అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. అందరి అంచనాలకు భిన్నంగా వ్యవహరించటం ద్వారా మోడీ తన మార్కును ప్రదర్శించారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. నిజమే.. ప్రధాని మోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విజయ సంకల్ప సభలో ఆయన వ్యవహరించిన తీరు.. ఆయన బాడీ లాంగ్వేజ్ తెలంగాణ ప్రజలు మర్చిపోలేనిదిగా మార్చిందన్న మాట వినిపిస్తోంది.

అరడుగుల బుల్లెట్ గా మోడీని అభివర్ణించే కమలనాథులు.. విజయ సంకల్ప సభలో ఆయన వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా మోడీ పాల్గొనే బహిరంగ సభల్లో.. ప్రజలకు తనదైన శైలిలో అభివాదం చేయటం.. చేతుల గట్టిగా ఊపటం లాంటివి చేస్తారు. అందుకు భిన్నంగా పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సభలో మాత్రం.. వేదిక ముందుకు వచ్చిన ఆయన.. నలుమూలలు కలియదిగారు.

అన్ని వైపుల తన కోసం ఎదురుచూస్తూ.. తనను చూసినంతనే కేరింతలు కొట్టిన జన సందోహాన్ని.. వారి ఆరాటాన్ని గుర్తించిన నరేంద్ర మోడీ.. వారిని మరింత ఉత్సాహపరిచేలా వ్యవహరించారు.

సాధారణంగా చేతులు ఊపటం మీదనే ఫోకస్ చేసే మోడీ.. అందుకు భిన్నంగా రెండుసార్లు తన నడుమును పూర్తిగా వంగి మరీ అభివాదం చేయటం సరికొత్తగా మారింది. మోడీ చేసిన ఈ చర్యను ఒక్కొక్కరు ఒక్కోలా అభివర్ణిస్తున్నారు. వ్యక్తుల దాకా ఎందుకు.. మీడియా సైతం ఆయన చేసిన దానికి అభివర్ణిస్తూ.. శిరస్సు వంచి అభివాదం చేసినట్లుగా పేర్కొన్నారు.

కాస్తంత నిశితంగా చూస్తే.. ప్రధాని మోడీ శిరస్సు వంచే కన్నా.. తన నడుమునుపూర్తిగా బెండ్ చేసే ప్రయత్నం చేశారని చెప్పాలి. సాధారణంగా శిరస్సు వొంచి అభివాదం చేసే దానికి భిన్నంగా ఇలా ఎందుకు చేసినట్లు? అన్న ప్రశ్నకు ఒక బీజేపీ నేత మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల విషయంలో తానెంత కమిట్ మెంట్ తో ఉన్నాన్న విషయాన్ని చెప్పటంతో పాటు.. తెలంగాణ ప్రజలకు తాము విధేయులుగా ఉంటామన్న సంకేతాన్ని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు.

శిరస్సు వంచిన వైనం బాగానే ఉన్నా.. ఇలా నడుముతో సహా వంచటం ద్వారా.. మీ సేవకులం.. మీరు మమ్మల్ని నిరభ్యతరంగా నమ్మొచ్చు. మీకు సేవ చేసే విషయంలో మేం రాజీ పడేది లేదన్నట్లుగా ఆయన బాడీ లాంగ్వేజ్ ఉందన్న మాటను మరికొందరు పేర్కొంటున్నారు. ఏమైనా.. శిరస్సు వంచితే సరిపోయేదానికి.. అందుకు భిన్నంగా నడుము వరకు వంచేసి మరీ అభివాదం చేయటం రాజకీయ వర్గాల్లోనూ చర్చగా మారింది.