దేశంలో ఏడాది పొడవునా ఎక్కడో ఒక చోట ఏవో ఒక ఎన్నికలు జరుగుతూనే ఉంటున్నాయి. లోక్ సభకు అయిదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగినట్లే.. వివిధ రాష్ట్రాల శాసనసభలకూ అయిదేళ్లకోసారి ఎన్నికలు జరగాలి. కానీ.. రాష్ట్రాల్లో ప్రభుత్వాల పదవీకాలాల్లో మార్పులు.. మధ్యంతర ఎన్నికలు వంటివాటి వల్ల రాష్ట్రాలకు - లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు జరగడం లేదు. ఏవో కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ఆ సమయంలో ఎన్నికలు జరుగుతుంటాయి. అలాగే లోక్ సభ - శాసనసభల్లో ఖాళీ అయ్యే స్థానాలకు ఉప ఎన్నికలూ జరుగుతుంటాయి. ఫలితంగా ఏటా ఎన్నికల హడావుడే. ఒక్క హడావుడే కాదు - ఎన్నికల నిర్వహణకు భారీగా ధన వ్యయం కూడా తప్పడం లేదు. దీంతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ ఎన్నికల ఖర్చు తగ్గించుకునే దిశగా ఆలోచన చేస్తోంది. లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే దఫా ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వానికి ఖర్చు తగ్గడమే కాకుండా ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి వీలు చిక్కుతుంది. ఇక ఐదేళ్ల పాటు ఎన్నికలతో సంబంధం లేకుండానే పూర్తిగా అభివృద్ధిపై దృష్టి సారించేందుకు అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు అవకాశం చిక్కుతుంది. అందుకే మోడీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. కాగా దీనిపై అధ్యయనానికి ఇప్పటికే న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. వచ్చే నెలాఖరులోగా ఈ కమిటి తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆ తర్వాత ఈ నివేదికపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్న కేంద్రం... అన్ని పార్టీల అభిప్రాయాన్ని తీసుకుని ముందడుగు వేయనుంది.
అయితే.. ఎన్నికల నిర్వహణ వ్యయం తగ్గుతుందన్న అంచనాల నేపథ్యంలో మొత్తం దేశమంతా ఒకేసారి లోక్ సభ - రాష్ట్రాల శాసన సభల ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందన్న ప్రాథమిక అంచనాలు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. దాని ప్రకారం 9 వేల కోట్లతో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించవచ్చని సమాచారం. ప్రస్తుతం ఐదేళ్ల పాటు ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఖర్చు తడిసిమోపెడుతోంది. అన్ని పార్టీల ఆమోదంతో మోడీ ఆలోచన కార్యరూపం దాల్చితే ఎంతో ప్రజాధనం సేవ్ అవుతుంది.