Begin typing your search above and press return to search.

ఏపీకి అప్పు పుట్టే చాన్స్ లేకుండా చేస్తున్న మోడీ?

By:  Tupaki Desk   |   18 April 2016 4:45 AM GMT
ఏపీకి అప్పు పుట్టే చాన్స్ లేకుండా చేస్తున్న మోడీ?
X
ఏపీ పరిస్థితి దారుణంగా మారింది. ఓ పక్క విభజన కారణంగా ఏపీ ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ గడ్డుగా మారుతోంది. పెరుగుతున్న రుణలోటు ఒక ఎత్తు అయితే.. లోటు భర్తీ విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు అనుసరిస్తున్న వైఖరితో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఏపీ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని సామెత రూపంలో తేల్చి చెప్పాలంటే.. అమ్మ పెట్టా పెట్టదు.. అడక్కతినానీయదన్నట్లుగా పరిస్థితి ఉంది.

లోటును పూడ్చే విషయంలో ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్న మోడీ సర్కారు.. ఏపీ ఆర్థిక లోటును పూడ్చే విషయంలో నిబంధనల బూచిని చూపించి మొండిచేయి చూపించటం కనిపిస్తోంది. రుణ పరిమితిని పెంచటం ద్వారా అప్పు తెచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఆ మధ్యన రుణ పరిమితిని పెంచాలన్న విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే కోరటం తెలిసిందే. ఇదే డిమాండ్ ను పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేయటం.. తాజాగా రుణ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకోవటం జరిగింది.

విభజన తాలుకూ దెబ్బలు వెంటాడుతున్న ఏపీకి రుణపరిమితి పెంపు ఎందుకు సాధ్యం కాలేదంటే.. రుణ పరిమితి పెంపులో కీలకమైన నిబంధనలు అడ్డుగా నిలుస్తున్నాయి. రాష్ట్రం తీసుకున్న అప్పు మొత్తం రాష్ట్ర జీఎస్డీపీలో 25 శాతం మించకూడదు. విభజన కారణంగా ఏపీ లోటు 28 శాతం ఉంది. ఇదొక దెబ్బ అయితే.. అప్పు పరిమితిని పెంచుకోవటానికి అడ్డుపడుతున్న మరో నిబంధనను చూస్తే.. ప్రతి ఏటా చెల్లించే వార్షిక రుణ వడ్డీ 10 శాతానికి మించకూడదు. విభజన కారణంగా ఏర్పడిన పరిస్థితులతో ప్రస్తుతం ఏపీ రెవెన్యూలో వడ్డీ చెల్లింపులు 12 శాతంగా ఉంటున్నాయి. ఇక.. మూడోది రాష్ట్ర రెవెన్యూ లోటు జీరోగా ఉండాలి.కానీ.. వేలాది కోట్ల రూపాయిలు లోటుతో ఏపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

విభజన నేపథ్యంలో ఏపీకి ఉన్న ప్రత్యేక పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని మినహాయింపులు చేస్తే ఏదైనా వెసులుబాటు కొంతైనా ఉండేది. కానీ.. అలాంటిదేమీ లేకపోవటంతో ఏపీకి అప్పు పుట్టటం కూడా కష్టంగా మారింది. ఏపీ పట్ల మోడీ సర్కారు ఏ మాత్రం సానుకూలంగా ఉన్నా సాయం తర్వాత.. అప్పు పుట్టేలా అయినా అవకాశం కల్పించే వారన్న మాట వినిపిస్తోంది. కొంపదీసి ఏపీ మీద మోడీ పగబట్టారా ఏంటి..?