Begin typing your search above and press return to search.

మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయం .. ముంబై - హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ !

By:  Tupaki Desk   |   15 Sep 2020 11:30 AM GMT
మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయం .. ముంబై - హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ !
X
కేంద్రం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఆ నిర్ణయంతో ఇప్పటికే విశ్వనగరంగా పేరుగాంచిన హైదరాబాద్ మరింత అభివృద్ధి దిశగా సాగిపోనుంది. అదేమిటంటే .. త్వరలోనే ముంబై -హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టే అవకాశం ఉంది. త్వరలో దేశవ్యాప్తంగా ఏడు కొత్త బుల్లెట్‌ రైళ్లను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తులు చేస్తోంది. ఇందులో ముంబై-హైదరాబాద్‌ కూడా ఉంది.

వీటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లను సిద్ధం చేయాలని జాతీయ హైస్పీడ్‌ రైలు కార్పొరేషన్‌ ను కేంద్రం ఆదేశించింది. ఈ ఏడు రైళ్లకు మొత్తం అంచనా వ్యయం దాదాపు రూ.10 లక్షల కోట్లు ఉంటుందని ఓ అధికారి తెలిపారు. దేశంలోనే తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును ముంబై-అహ్మదాబాద్‌ మధ్య 508.17 కిలోమీటర్ల దూరంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. దాని అంచనా వ్యయం రూ.1.08 లక్షల కోట్లు. వాస్తవానికి ఆ మార్గంలో 2023 డిసెంబర్ ‌లోనే బుల్లెట్‌ రైలు సేవలను ప్రారంభించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, భూసేకరణ సంబంధిత సమస్యలు, కరోనా‌ మహమ్మారి విజృంభణ వంటి ఆటంకాల కారణంగా ఆ ప్రారంభ తేదీని 2028 అక్టోబర్‌కు వాయిదా వేసే సంకేతాలు కనిపిస్తున్నాయి.