Begin typing your search above and press return to search.

కేజ్రీవాల్ ను వేధించేందుకు మోడి సర్కార్ వ్యూహం

By:  Tupaki Desk   |   23 March 2021 3:30 PM GMT
కేజ్రీవాల్ ను వేధించేందుకు మోడి సర్కార్ వ్యూహం
X
కంట్లో నలుసులాగ తయారైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఎలాగైనా దెబ్బ కొట్టాలని నరేంద్రమోడి సర్కార్ గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. మోడి, అమిత్ షా లాంటివాళ్ళు చాలామంది ఎంతగా ప్రయత్నించినా కేజ్రీవాల్ ను చివరి ఎన్నికల్లో ఓడించలేకపోయిన విషయం అందరికీ తెలిసిందే. వరుసగా మూడోసారి కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా కంటిన్యు అవుతున్నార. దేశంలో అన్నీ రాష్ట్రాల్లో ఏదో రకంగా గెలుస్తున్న బీజేపీ ఢిల్లీలో మాత్రం కేజ్రీవాల్ ను తట్టుకోలేకపోతోంది.

దాంతో ఆమ్ ఆద్మీపార్టీ అధినేత+సీఎం కేజ్రీవాల్ పై కేంద్రప్రభుత్వంలో బాగా కసి పెరిగిపోతోంది. అందుకనే సీఎం అధికారాలకు కత్తెరలు వేసి ప్రతి విషయంలో లెఫ్ట్ నెంట్ గవర్నర్ దే పై చేయిగా చేద్దామని ప్రయత్నించింది. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలను లెఫ్ట్ నెంట్ గవర్నర్ నిలిపేశారు. దాంతో కేజ్రీవీల్ హైకోర్టులో కేసు వేసింది. మొత్తం వ్యవహారాలను విచారించిన కోర్టు లెఫ్ట్ నెంట్ గవర్నర్ తో పాటు కేంద్రానికి బాగా తలంటింది.

ప్రతి విషయంలోను లెఫ్ట్ నెంట్ దే అంతిమ నిర్ణయం అన్నపుడు ఇక ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఎందుకంటు నిలదీసింది. లెఫ్ట్ నెంట్ గవర్నర్ కేవలం పర్యవేక్షణకే పరిమితం అవ్వాలి కానీ రోజువారి పరిపాలనలో వేలు పెట్టేందుకు లేదని స్పష్టంగా చెప్పింది. దాంతో కొంతకాలం వెనక్కు తగ్గిన కేంద్రం తాజాగా ఢిల్లీ ప్రభుత్వమంటే లెఫ్ట్ నెంట్ గవర్నర్ మాత్రమే అన్న ఓ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఎలాగూ మెజారిటి ఉందికాబట్టి బిల్లును పాస్ చేయించుకున్నది. ఈ బిల్లును ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించినా కేంద్రం పట్టించుకోలేదు.

ఇది రాజకీయ బిల్లుకాదని కేవలం కొన్ని అంశాల్లో స్పష్టత కోసమే బిల్లును ప్రవేశపెట్టినట్లు హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి చెప్పినా అదంతా అబద్ధమే అని అర్ధమైపోతోంది. ఎలాగైనా కేజ్రీవాల్ ను వేధించటం, లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో అధికారాలను పెట్టుకుని ప్రభుత్వాన్ని ఆడించటమే ముఖ్య ఉద్దేశ్యంగా తెలిసిపోతోంది. ఇలాంటి పనికిమాలిన పనులు చేసినందుకే మూడోసారి జనాలు మోడి+బీజేపీని ఛీకొట్టి కేజ్రీవాల్ ను అఖండ మెజారిటితో గెలిపించారు. అయినా కేంద్రానికి బుద్దిరాలేదని అర్దమైపోతోంది.