Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాలకు షాకిచ్చేలా మోడీ సర్కారు తాజా నిర్ణయం

By:  Tupaki Desk   |   26 July 2021 5:30 AM GMT
తెలుగు రాష్ట్రాలకు షాకిచ్చేలా మోడీ సర్కారు తాజా నిర్ణయం
X
కేంద్ర.. రాష్ట్రాల మధ్య సంబంధాలు ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలి. పెద్దన్నలా వ్యవహరించే ధోరణి ఎంత మాత్రం సరికాదు. కేంద్రంలో మోడీ సర్కారు కొలువు తీరిన తర్వాత.. రాష్ట్రాలకు చెక్ పెట్టే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టట్లేదు. అంతేనా.. కొత్త విధానాల్ని తెర మీదకు తీసుకురావటం ద్వారా.. రాష్ట్రాల్ని కంట్రోల్ చేయాలని భావిస్తోంది. తాజాగా అలా తీసుకున్న నిర్ణయం ఒకటి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు ఇబ్బందికరంగా మారుతుందన్న మాట వినిపిస్తోంది. కేంద్రం అమలు చేసే పథకాలకు నేరుగా కాకుండా తన వాటా వరకు రాష్ట్రాలకు పంపటం.. రాష్ట్రాలు తమ వాటా మొత్తాల్ని కలిపి లబ్థిదారులకు పంపటం అలవాటన్న విషయం తెలిసిందే.

ఇప్పటివరకు ఉన్న విధానాల్ని చూస్తే.. కేంద్రం పంపిన పథకాల మొత్తాన్ని రాష్ట్రాలు తమ వెసులుబాటుకు అనుగుణంగా కాస్త మార్పులు చేసే వీలుండేది. అలాంటి వాటికి చెక్ పెడుతూ.. తాజాగా కేంద్రం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏ పథకానికి కేంద్రం నిధుల్ని రాష్ట్రాలకు పంపుతుందో.. ఆ నిధుల్ని అందుకోసమే వాడుకోవాలి తప్పించి.. వేరే ఖర్చుకు మళ్లించే వీల్లేదు. తాజాగా సిద్ధం చేసిన కొత్త మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ విధానానికి ఏపీ ప్రభుత్వం నో చెప్పింది.

ఇంతకీ ఈ నిర్ణయాన్ని కేంద్రంలోని మోడీ సర్కారు ఎందుకు తీసుకుంది? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. రాష్ట్రాలు కేంద్ర పథకాల్ని సరిగా అమలు చేయటం లేదన్న భావనలో ఉన్నట్లు చెబుతోంది. తాము పంపిన పథకాలకు నిధులను నేరుగా ఖర్చు చేయకుండా వేరే వాటికి నిధుల్ని కేటాయిస్తున్నారన్న ఫీడ్ బ్యాక్ తోనే తాజా నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకు అమలైన విధానంలో కేంద్రం పంపిన నిధుల్ని తమకు తోచినట్లుగా ఖర్చు చేసి.. తర్వాత సర్దుబాటు చేసేవారు.

దీంతో పథకాల అమలు పారదర్శకంగా జరగటం లేదని భావించిన కేంద్రం..కొత్త విధానాన్ని ఈ నెల నుంచి అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. కొత్త విధానానికి దేశంలోని 20 రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాయి. ఏపీ ఈ విధానానికి నో చెప్పింది. ఈ విధానంతో ఆర్థిక నిర్వహణలో సమస్యలు వస్తాయని.. రాష్ట్ర అవసరాలకు వినియోగించుకునే కేంద్ర నిధుల్ని ఇక ముందు అలా ఖర్చు చేసే పరిస్థితులు లేకపోవటం వల్ల తిప్పలు తప్పవన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

కొత్త విధానంలో కేంద్రం రాష్ట్రాలకు సంబంధించిన అకౌంట్లలో నిధుల్ని జమ చేస్తారు. ఆ నిధుల్ని 21 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మొత్తాన్ని సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలకు బదిలీ చేయాల్సి ఉంుటంది. కేంద్రం తన వాటా విడుదల చేసిన నలబై రోజుల్లోగా ఆయా రాష్ట్రాలు తమ వాటాను ఆ అకౌంట్లలో జమ చేయాలి. ప్రతి పథకానికి నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసి..లబ్థిదారుల అకౌంట్లను పబ్లిక్ ఫైనాన్స్ నిర్వహణ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాల్సి ఉంటుంది.

కేంద్రం పంపిన నిధులు.. అందులో వేసే రాష్ట్రాల మొత్తాల్ని ఆయా సంక్షేమ కార్యక్రమాలకు మినహా మరి వేటిలోకి బదిలీ చేయటానికి వీల్లేదు. కేంద్రం తాను ఇవ్వాల్సిన మొత్తంలో 25 శాతం లోపు నిధుల్ని మాత్రమే ఇస్తుంది. రాష్ట్రం తన వాటా నిధులను జత చేసి అందులో 5 శాతం ఖర్చు చేసినట్లుగా తేలిన తర్వాత మాత్రమే మిగిలిన నిధుల్ని కేంద్రం విడుదల చేస్తుంది. ఖర్చు చేయకుండా మిగిలిన నిధుల్ని.. ఆయా ఏజెన్సీలు నోడల్ ఏజెన్సీ ఖాతాలకు తిరిగి జమ చేయాలి. ఆ బాధ్యత రాష్ట్రానిదే అవుతుంది.

అంటే.. కేంద్ర పథకాలకు పంపే ప్రతి రూపాయి లబ్థిదారులకు నేరుగావెళ్లటమే తప్పించి.. రాష్ట్రాలు ఒక్క రూపాయి కూడా టచ్ చేయని పరిస్థితి. ఈ విధానంతో ఆర్థికంగా ఇబ్బందులు లేని రాష్ట్రాలకు ఫర్లేదు కానీ.. అప్పులతో బండి నడిపించే వారికి మాత్రం తెగ ఇబ్బంది. ఇప్పటివరకు కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని తమ అవసరాలకు మళ్లించి.. సమయం చూసుకొని వాటిని అమలు చేసే అవకాశం కొత్త విధానంలో ఉండదు. ఇదంతా చూస్తే.. కొత్త విధానం తెలుగు రాష్ట్రాలకు ఇబ్బందికరంగా మారుతుందని చెప్పక తప్పదు.