Begin typing your search above and press return to search.

పని చేయటం లేదని వారినే పీకేసిన మోడీ

By:  Tupaki Desk   |   18 Jan 2017 6:45 AM GMT
పని చేయటం లేదని వారినే పీకేసిన మోడీ
X
మోడీ పాలనకు సంబంధించి ఆసక్తికర ఉదంతం ఒకటి బయటకు వచ్చింది. గవర్నమెంట్ జాబ్ వచ్చిందా? పని చేసినా.. చేయకున్నా బండి నడిపించేయొచ్చన్న మాట చాలామంది నోట వినిపిస్తూ ఉంటుంది. అయితే.. ప్రభుత్వ ఉద్యోగి అయినా పని చేయకుండా తిప్పలు తప్పవన్న విషయాన్ని మోడీ తన రెండున్నరేళ్ల పాలనలో చేతల్లో చూపించిన విషయం తాజాగా బయటకు వచ్చింది.

పని చేయకుండా.. కాలం గడిపేస్తూ.. ప్రభుత్వానికి భారంగా మారిన వారి విషయంలో మోడీ తనదైన మార్క్ ను చూపించారట. ఇలా పని చేయని వారు సీనియర్ ఐపీఎస్ అధికారులైనా సరే.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా షాక్ ల మీద షాక్ లు ఇవ్వటమే కాదు.. పని చేయకపోతే కష్టమే బాసూ అనుకునేలా చేస్తున్నారట.

ఇప్పటివరకూ 60 మంది అధికారుల్ని డిస్మిస్ చేయటం.. మరికొందరిని బలవంతానా ముందస్తు రిటైర్మెంట్ తీసుకునేలా చేయటంలో మోడీ సర్కారు సక్సెస్ అయినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి అధికారుల జాబితాలో 1992 బ్యాచ్ కు చెందిన ఛత్తీస్ గఢ్ కేడర్ ఐపీఎస్ అధికారి రాజ్ కుమార్ దేవన్ గణ్.. 1998 బ్యాచ్ కు చెందిన అరుణాచల్ ప్రదేశ్ – గోవా – మిజోరాం కేడర్ ఐపీఎస్ అధికారి షీల్ చౌహాన్ ఉన్నట్లుగా చెబుతున్నారు.

వీరిద్దరిని ముందస్తు రిటైర్మెంట్ ఇచ్చేసి ఇంటికి పంపినట్లుగా చెబుతన్నారు. ఇదెలా సాధ్యమన్న సందేహం వచ్చిన వారికి ఆసక్తికరమైన సమాధానం ఒకటి దొరుకుతోంది. సీనియర్ ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులైనప్పటికీ.. ప్రజా ప్రయోజనాల రీత్యా పని తీరుకానీ బాగుండకపోతే తప్పనిసరిగా రిటైర్ కావాలన్న నిబంధన ఒకటి చట్టంలో ఉందని.. దాన్ని మోడీ సర్కారు బయటకు తీసినట్లుగా చెబుతున్నారు.

50ఏళ్లు వచ్చిన తర్వాత ఉన్నతాధికారుల పనితీరును తప్పనిసరిగా పరిశీలించాలని.. వారుకానీ పని చేయకుంటే వారికి రిటైర్మెంట్ ఇవ్వాలన్న రూల్ ఉండటంతో.. దీన్ని ఉపయోగించుకొని .. పని చేయని బ్యాచ్ ను ఇంటికి పంపించే పనిని మోడీమొదలు పెట్టారని చెబుతున్నారు. దీంతో.. పని చేయకుండా బండి నడిపించేద్దామనుకున్నోళ్లంతా ఇప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేస్తున్నట్లు చెబుతున్నారు. పైకి హడావుడి చేయకుండా.. కామ్ గా ఏం చేయాలో అది చేసేస్తున్న మోడీ తీరుపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/