Begin typing your search above and press return to search.

కేజ్రీ వాల్‌ పై మోడీకింకా క‌సి తీరలేదు

By:  Tupaki Desk   |   17 April 2018 4:54 PM GMT
కేజ్రీ వాల్‌ పై మోడీకింకా క‌సి తీరలేదు
X
ఆమ్ ఆద్మీ పార్టీ నేత‌ - ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌ కు బీజేపీ సార‌థ్యంలో కేంద్రం ప్ర‌భుత్వంలో ఉన్న స‌ర్కారుకు మ‌ధ్య సాగుతున్న వార్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. దేశ రాజ‌ధాని వేదిక‌గా ఈ రెండు పార్టీల ఎత్తులు - పై ఎత్తులు విస్మ‌య‌క‌రంగా ఉంటాయ‌ని కూడా ఒక్కోసారి రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటుంటారు. ఈ వివాదాల ప‌ర్వంలోకి మ‌రో అంశం తోడ‌యింది. లాభదాయక పదవుల కేసు విషయంలో ఢిల్లీ హైకోర్టు 20 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు ఊరట నిచ్చిన ఉపశమనం నుంచి తేరుకోకముందే కేంద్ర ప్రభుత్వం ఆప్ సర్కార్‌ కు మరో షాక్ ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన తొమ్మిది మంది సలహాదారులను కేంద్ర హోంశాఖ తొలగించింది. వీరిలో సీనియర్ అతిశీ మర్లేనా సైతం ఉన్నారు. ఆర్థికశాఖ అనుమతి తెలపనందునే వీరిని తొలగిస్తున్నట్లుగా కేంద్ర హోంశాఖ పేర్కొంది.

ఆప్ ముఖ్య‌నేత‌ - ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సలహాదారుగా ఉన్న మర్లేనా - ఢిల్లీ ఆర్థికశాఖ మంత్రి సలహాదారు రాఘవ్ చందా - డిప్యూటీ సీఎం మీడియా సలహాదారు అరుణోదయ్ ప్రకాశ్ - న్యాయశాఖ మంత్రి సలహాదారు అమర్‌ దీప్ తివారీ - పీడబ్ల్యూడీ మంత్రి సలహాదారు రజత్ తివారీ తదితరులు తొలగించిన వారిలో ఉన్నారు. దీనిపై సలహాదారు రాఘవ్ చందా స్పందిస్తూ.. తన నియామక నిబంధనలు తెలియజేస్తూ జీతంగా ఒక్క రూపాయే తీసుకుంటున్నట్లు తెలిపారు. అటువంటప్పుడు హోంశాఖ తనను తొలగించడానికి కారణమేంటో తెలియలేదన్నారు. అత్యాచారాలు, నగదు లేమిపై దృష్టి మరల్చేందుకు.. అదేవిధంగా ఆప్‌పై చర్యలకు సరైన సమయంగా బీజేపీ ఆదేశాల మేరకే కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్ల‌డించారు.