Begin typing your search above and press return to search.

మోడీ సంస్క‌ర‌ణ‌ల వెనుక మ‌ర్మం ఏంటి?

By:  Tupaki Desk   |   11 Nov 2015 7:38 AM GMT
మోడీ సంస్క‌ర‌ణ‌ల వెనుక మ‌ర్మం ఏంటి?
X
బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఓటమి నేపథ్యంలో న‌రేంద్ర‌మోడీ నేతృత్వంలోని కేంద్ర‌ ప్రభుత్వం భారీ సంస్కరణలకు తెరతీసింది. యూకే పర్యటనకు బయలుదేరే ఒక రోజు ముందు ప్రధాని ఏకంగా 15 రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌ డీఐ) నిబంధనలను సరళీకరించారు. రక్షణ - గనులు - పౌరవిమానయానం వంటి పలు కీలక రంగాలలో విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకట్టుకునేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిపై తాము ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పకనే చెప్పారు! ఎఫ్‌ డీఐల విషయంలో ఇంతక్రితం ఏ ప్రభుత్వమూ ఇంత పెద్దఎత్తున ఒకేసారి నిర్ణయాలనూ ప్రకటించకపోవడం గమనార్హం!!

వరుసగా క్షీణిస్తోన్న స్టాక్‌ మార్కెట్ల కోసం ప్రధానమైన 15 రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడంతో పాటు మరింత సరళీకరణలు చేశారు. ప్రధానమైన రక్షణ - రైల్వే - వ్యవసాయ - నిర్మాణ - మీడియా రంగాల్లోనూ ఎఫ్‌ డీఐల పరిమితిని పెంచింది. అనేక రంగాల్లో 100 శాతం విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించింది. వ్యవసాయ - పశుపోషణ - ఉద్యాన - బ్రాడ్‌ కాస్టింగ్‌ - పౌర విమానయానం - రిటైల్‌ - ఇ-కామర్స్‌ - గనులు - సహజ వనరులు - తయారీ తదితర రంగాల ఎఫ్‌ డీఐల్లో బీజేపీ సర్కార్‌ సంస్కరణలు చేపట్టింది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో 100 శాతం ఎఫ్‌డిఐకి అనుమతించింది. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ ఐపిబి) పరిమితి అనుమతులను రూ.3వేల కోట్ల నుంచి రూ.5వేల కోట్లకు పెంచింది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఇది వరకు ఉన్న పలు షరతులను కూడా ఎత్తివేసింది.

ఇంత‌కీ ఇదంతా మోడీ ఎందుకు చేశారు? దేశ ఆర్థిక వ్యవస్థకు చిహ్న‌మైన స్టాక్‌ మార్కెట్ ఇటీవ‌లి కాలంలో అనేక సంద‌ర్భాల్లో వేగంగా క్షీణించింది. ఇది పెట్టుబడిదారులకు - మార్కెట్ల వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర అసంతృప్తికి కార‌ణ‌మ‌యింది. అందుకే కార్పొరేట్లు - స్టాక్‌ మార్కెట్లకు మద్దతుగా ఈ సంస్కరణలను మోడీ సర్కార్‌ ముందుకు తెచ్చార‌ని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో మోడీ కూడా నేరుగా స్పందించారు. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం కనీస జోక్యం మాత్రమే కల్పించుకుంటుందని, గరిష్ఠ పాలన అందిస్తుందని మోడీ ట్వీట్‌ చేశారు. అన్ని ప్రక్రియలను మరింత హేతుబద్ధీకరిస్తామని....ప్రభుత్వ ప్రతిఫలాలను ప్రతి పౌరుడికి చేర్చుతామన్నారు.