Begin typing your search above and press return to search.

రాష్ట్రాలకు పైసలు ఇవ్వకుండా కేంద్రం అతి తెలివి వింటే షాకే!

By:  Tupaki Desk   |   30 Aug 2021 4:30 AM GMT
రాష్ట్రాలకు పైసలు ఇవ్వకుండా కేంద్రం అతి తెలివి వింటే షాకే!
X
రాష్ట్రాల విషయంలో పెద్దన్నలా వ్యవహరించాల్సిన కేంద్రం.. అందుకు భిన్నంగా ఏ చిన్న అవకాశం వచ్చినా.. వాటికి మొండిచేయి చూపించేలా వ్యవహరించటంలో మోడీ సర్కారుకు మించింది మరొకటి లేదన్న విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఈ వాదనకు తీసిపోని రీతిలో కేంద్రం తీరు ఉండటం గమనార్హం. సాధారణంగా కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రానికి వాటా ఇస్తారు. అలా ఇచ్చేయటంమోడీ సర్కారుకు సుతారం ఇష్టం లేదంటారు. తాము వసూలు చేసే మొత్తంలో రాష్ట్రాలకు వాటా ఇవ్వటానికి ఇష్టపడని కేంద్రం .. చిన్న లొసుగుల్ని అడ్డుగా పెట్టుకొని పన్ను వాటాను ఇవ్వకుండా చేయటంలో కేంద్రం వ్యవహరించే తీరు తాజాగా బయటకు వచ్చింది.

పెట్రోల్.. డీజిల్ మీద వివిధ రాష్ట్రాలు వసూలు చేసే పన్నుల లెక్కల్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ లెక్కల్లో కేంద్రంలోని మోడీ సర్కారు అతి తెలివి ఏ స్థాయిలో ఉందన్న విషయం ఇట్టే అర్థమయ్యే విషయం బయటకు వచ్చింది. తాను పెంచిన భారాన్ని పన్ను పేరుతో కాకుండా సుంకం పేరుతో వసూలు చేయటం వల్ల.. రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా తాను తీసుకునేలా కేంద్రం పథకం వేసిన వైనం బయటకు వచ్చింది.

2019 అక్టోబరు నాటికి పెట్రోల్ మీద కేంద్రం పన్నులు లీటరుకు రూ.19.98గా ఉండేవి. అదే సమయంలో లీటరు డీజిల్ మీద రూ.15.83 ఉండేది. వాటిలో రాష్ట్రాల వాటా కింద లీటరు పెట్రోల్ కు రూ.2.98, లీటరు డీజిల్ మీద రూ.4.83 చొప్పున ఇచ్చేవారు. తాము వసూలు చేసే పన్ను వాటాను రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వాలని అనుకున్న కేంద్రం అతి తెలివిని ప్రదర్శించింది.

2019 అక్టోబరులోనూ ఆ తర్వాత 2020 మార్చిలోనూ.. ఆ తర్వాత మేలోనూ సుంకాల పేరుతో వడ్డన షురూ చేసింది. స్పెషల్ ఎడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ.. రోడ్ ఇన్ ఫ్రా సెస్ పేరుతో విధించిన సుంకాల మీద వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. దీంతో వేలాది కోట్లు సుంకం రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోతోంది.

ఇటీవల కాలంలో పెంచిన సుంకంతో కలిపితే లీటరు పెట్రోల్ మీద రూ.32.98, లీటరు డీజిల్ మీద రూ.31.83 చొప్పున వసూలు చేస్తున్నారు. వీటిని పన్నుగా పేర్కొన్న పక్షంలో రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉండేది సుంకంగా పేర్కొనటంతో రాష్ట్రాలకు రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇలా.. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పన్ను ఆదాయాన్ని అతి తెలివితో తమ ఖాతాలోకి తరలిస్తున్న వైనం తాజాగా బయటకు వచ్చింది. మోడీ సర్కారు అతి తెలివి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.