Begin typing your search above and press return to search.

సీబీఐ క‌త్తికి ప‌దును పెడుతున్న మోడీ!

By:  Tupaki Desk   |   20 Dec 2021 1:30 PM GMT
సీబీఐ క‌త్తికి ప‌దును పెడుతున్న మోడీ!
X
సీబీఐ.. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌. అంటే.. కేంద్రం చేతిలో ఉండే.. ప్ర‌త్యేక అధికారాలుఉన్న ద‌ర్యాప్తు సంస్థ‌. గ‌త కాంగ్రెస్ హ‌యాం నుంచి కూడా దీనిపై అనేక విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. త‌మ‌కు గిట్ట‌నివారిపై ఈ సంస్థ‌ను ప్ర‌యోగించి...కేసులు న‌మోదు చేయించడం.. వేదింపుల‌కు గురి చేయ‌డం.. కోసం.. ఈ సంస్థ‌ను వాడుకుంటున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే.. రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాల‌పై.. కేంద్రం క‌సి తీర్చుకుంటోంద‌ని.. గ‌తంలో ఏపీ స‌ర్కారు నేత‌గా ఉన్న చంద్ర‌బాబు.. ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, ఢిల్లీసీఎం కేజ్రీవాల్ వంటివారు.. తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

చంద్ర‌బాబు ఏకంగా.. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా.. చ‌ర్య‌లు తీసుకున్నారు. అయితే.. ఇది అప్ప‌ట్లో తీవ్ర వివాదానికి విమ‌ర్శ‌ల‌కు కూడా దారితీసింది. ఆత‌ర్వాత‌.. మ‌మతా బెన‌ర్జీ కూడా సీబీఐని త‌మ రాష్ట్రంలోకి అనుమ‌తించేది లేద‌ని చెప్పారు. ఇప్పుడు ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు మోడీ ప‌దును పెంచారు. సీబీఐకి రాష్ట్రాల అనుమ‌తితో సంబంధం లేకుండా చేసేలా వ్యూహాత్మ‌కంగా మోడీ పావులు క‌దుపుతున్నారు. సీబీఐకి మరిన్ని అధికారులు కట్టబెట్టేలా చట్ట సవరణ చేయాలని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం

ఢిల్లీ స్పెషల్‌ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం-1946లోని సెక్షన్ 6 ప్రకారం కేంద్ర ప్రభుత్వం సీబీఐని ఏర్పాటు చేసింది. దాని పరిధి ఢిల్లీ భూభాగం వరకే ఉంటుంది. ఢిల్లీ కాకుండా ఏదైనా రాష్ట్రంలో సీబీఐ తన పని నిర్వర్తించాలంటే ఆ రాష్ట్రం జనరల్‌ కన్సెంట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి ఈ జనరల్ కన్సెంట్ ఎప్పుడూ వివాదాస్పదం కాలేదు. అన్ని రాష్ట్రాలూ ఇస్తూ వస్తున్నాయి. అయితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఎప్పుడైతే.. సీబీఐ ని రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై ఆయుధంగా విసిరేందుకు ప్ర‌య‌త్నించాయో.. అప్పుడే వివాదంగా మారింది.

అప్పటి నుంచే సమస్య వస్తోంది. గ‌తంలో కాంగ్రెస్ సీబీఐని ఎక్కువ‌గా ప్ర‌యోగించింద‌ని.. రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతుంటారు. త‌ర్వాత‌.. మోడీ స‌ర్కారు కూడా మ‌మ‌త‌పై ఇదే ఆయుధాన్ని ప్ర‌యోగించిం ద‌ని అంటారు. ఈ కారణంగా ఏపీ సహా అనేక రాష్ట్రాలు జనరల్ కన్సెంట్‌ను రద్దు చేశాయి. జగన్ సీఎం అయ్యాక.. మళ్లీ జనరల్ కన్సెంట్‌ను ఇచ్చారు. బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నందున.. తమ జోలికి రాదని వైసీపీ నమ్మకం కావొచ్చు.

అయితే.. అలాంటి నమ్మకం లేని ప్రభుత్వాలు ఇంకా జనరల్ కన్సెంట్ ఇవ్వడం లేదు. ఈ తరుణంలో మోడీ స‌ర్కారు సీబీఐ అధికారాల్ని మరింత విస్తృత పరచాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి చట్టం చేయనున్నారు. అంటే ఇక రాష్ట్రాల్లోనూ అక్కడి ప్రభుత్వాల అనుమతి లేకుండా సీబీఐ అన్నికేసులూ పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంతేకాదు.. రాష్ట్ర ప్ర‌భుత్వ అంగీకారంతో సంబంధం లేకుండా.. సీబీఐ స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రించే వెసులుబాటు కూడా ఉంటుంది. మ‌రి దీనిపై రాష్ట్రాలు ఏం చేస్తాయో చూడాలి.