Begin typing your search above and press return to search.

మోడీ వద్ద కేసీఆర్ కు గౌరవం..బాబుకు అవమానమా?

By:  Tupaki Desk   |   20 May 2016 7:18 AM GMT
మోడీ వద్ద కేసీఆర్ కు గౌరవం..బాబుకు అవమానమా?
X
సోషల్ మీడియాలో ఏ అంశం చర్చకొచ్చినా అది ఒక్కోసారి విపరీతార్థాలకు... విపరీత పోకడలకు దారితీస్తోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల సీఎంలలో ప్రధాని మోడీ వద్ద ఎక్కువ గౌరవం అందుతున్నదెవరికి అన్న విషయంలో విపరీతంగా పోస్టింగులు - కామెంట్లు - చర్చలు జరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇటీవల విపత్తులు - కరువుపై రాష్ట్రాలతో కేంద్రం చర్చించిన సందర్భంగా కేసీఆర్ - చంద్రబాబులు వేర్వేరుగా మోడీని కలిసిన అనంతర పరిణామాలు చర్చకొస్తున్నాయి. మోడీ ఈ ఇద్దరు ముఖ్యమంత్రులను కలిసిన తరువాత వారితో భేటీల గురించి స్వల్పంగా ట్విట్టర్ లో రాశారు. ఆ సందర్భంగా మోడీ కేసీఆర్ ను కేసీఆర్ గారు అని రాశారని.. కానీ, చంద్రబాబును మాత్రం చంద్రబాబునాయుడు అని మాత్రమే రాశారని.. గారు అనే పదం చంద్రబాబు విషయంలో మిస్సయిందని... కాబట్టి కేసీఆర్ కు మోడీ ఎక్కువ గౌరవం ఇస్తున్నారన్న అర్థంపర్థం లేని ప్రచారం సోషల్ మీడియాను ముంచెత్తుతోంది.

ఇటీవల కాలంలో కేంద్రం చంద్రబాబు కంటే కేసీఆర్ కు ఎక్కువ ప్రాధాన్యమిస్తోందని.. టీడీపీ - బీజేపీ పొత్తులు పోయి టీఆరెస్ - బీజేపీ పొత్తు ఏర్పడుతుందనడానికి ఇదే ఉదాహరణ అంటూ రాజకీయ మార్పులకు కూడా దాన్ని లింక్ చేస్తున్నారు. అయితే.. మోడీ ట్విట్టర్ పోస్టింగుల్లో చంద్రబాబును కేవలం చంద్రబాబునాయుడుగా.. కేసీఆర్ ను కేసీఆర్ గారుగా ప్రస్తావించడం కరెక్టే. ఆ కారణంగానే నెటిజన్లు తమ ఊహాగానాలకు, సరికొత్త సమీకరణలకు తెర తీశారు.

అయితే.. మోడీ వద్ద చంద్రబాబుకు మంచి వెయిట్ ఉందన్న సంగతి ఎవరికీ తెలియంది కాదు. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ ను నిన్నమొన్నటి వరకు మోడీ చేరనివ్వలేదు. ఇప్పుడిప్పుడే ఇద్దరి మధ్య సంభంధాలు మెరగవుతున్నాయి. కాబట్టి చంద్రబాబును మోడీ గౌరవించకపోవడం అన్న ప్రసక్తే లేదు. ఇక్కడ జరిగిందంతా సాంకేతిక వ్యవహారమే. అవును... చంద్రబాబు - కేసీఆర్ లు ఇద్దరినీ తీసుకుంటే కేసీఆర్ కు సోషల్ మీడియా అకౌంట్ లేదు. చంద్రబాబు మాత్రం సోషల్ మీడియాను బాగా వాడుతున్నారు. మోడీ వీరి గురించి రాసినప్పుడు కేసీఆర్ సోషల్ మీడియాలో లేకపోవడంతో ఆయన పేరును సెపరేట్ గా రాయాల్సి వచ్చింది. అందుకు సహజ పద్ధతిలోనే కేసీఆర్ గారు అని రాశారు. కానీ, చంద్రబాబు విషయానికొచ్చేసరికి ఆయన చంద్రబాబు పేరు రాయకుండా ట్యాగ్ చేశారు. చంద్రబాబు అకౌంట్ చంద్రబాబు గారు అని ఉండదు కాబట్టి ట్యాగ్ చేసినప్పుడు చంద్రబాబునాయుడు అని వచ్చింది. ఈ సింపుల్ విషయాన్ని మరిచి జనం ఏవేవో లెక్కలు వేస్తున్నారు.