Begin typing your search above and press return to search.

అంతటి విధేయుడి కొడుక్కి మోడీషాలు హ్యాండ్ ఇవ్వటమా?

By:  Tupaki Desk   |   22 Jan 2022 4:41 AM GMT
అంతటి విధేయుడి కొడుక్కి మోడీషాలు హ్యాండ్ ఇవ్వటమా?
X
ఏది ఏమైనా రోటీన్ కు భిన్నమైన లెక్కలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటాయి మోడీషా రాజకీయాలు. వారసత్వ రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకమంటూనే.. తమ పార్టీలోని ఎంతో మంది వారసులకు పెద్దపీట వేయటం ఆ పార్టీకే చెల్లుతుంది. అంతేనా.. పార్టీకి వీర విధేయులకు దెబ్బేసే విషయంలోనూ మోడీషాల ట్రాక్ రికార్డు పెద్దదేనని చెప్పాలి. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. తనను పైకి తీసుకొచ్చి.. ప్రస్తుతం తిరుగులేని స్థానానికి చేర్చటంలో కీలకంగా వ్యవహరించిన తన గురువు అద్వానీ విషయంలో మోడీ వ్యవహరించిన తీరును మర్చిపోలేం. అద్వానీ లాంటి బీజేపీ మూల స్తంభానికి జీవితకాలపు కల అయిన రాష్ట్రపతి పదవిని ఇవ్వటానికి సైతం ససేమిరా అనటం మోడీషాలకే చెల్లుతుంది.

అలాంటి వారి చేతుల్లో ఉన్న పార్టీలో.. ఎప్పుడేం జరుగుతుందో అంచనా వేయటం అంత తేలికైన విషయం కాదు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటి గోవా. పేరుకు చిన్న రాష్ట్రమే అయినా.. ఈ రాష్ట్రానికి దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ అలాంటి ఇలాంటిది కాదు. 40 స్థానాలు ఉన్న ఈ చిన్న రాష్ట్రానికి జరుగుతున్న ఎన్నికల్లో.. బీజేపీ నేతల్లో విశేషమైన ప్రజాదరణతో పాటు.. తన తీరుతో పార్టీ ప్రతిష్ఠను పెంచిన ముఖ్యనేతల్లో ఒకరు స్వర్గీయ మనోహర్ పారికర్.

నీతికి.. నిజాయితీకి నిలువెత్తు రూపంగా ఉండే ఆయన.. మరణం ఇప్పటికి షాకింగ్ గా అనిపించటమే కాదు.. ఒక పట్టాన జీర్ణం కాదనే చెప్పాలి. ఆయన రాజకీయ వారసుడు ఉత్పల్ పారికర్. తండ్రి తీరునే ప్రదర్శించే ఆయనకు గోవాలో మంచి పేరుంది. అలాంటి ఆయన.. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ.. ఆ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యేకు కేటాయించిన బీజేపీ అధినాయకత్వం.. ఆయనకు షాకిచ్చింది. అయితే.. ఉత్పల్ అడిగిన పనాజీ సీటు ఇవ్వకపోయినా.. మరో రెండు స్థానాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిందిగా చెప్పినట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే.. తాను అనుకున్న పనాజీ తప్పించి.. మరో సీటులో పోటీ చేసే ఛాన్స్ లేదని స్పష్టం చేసిన ఉత్పల్.. స్వతంత్య్ర అభ్యర్థిగా అక్కడి నుంచే బరిలోకి దిగటం హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజులుగా పనాజీ స్థానం మీద బీజేపీలో జరుగుతున్న రచ్చకు ఫుల్ స్టాప్ వేసేలా ఉత్పల్.. బీజేపీకి రాజీనామా చేసేసి బయటకు వచ్చేశారు.

అయితే.. ఆయన్ను తాము వదులుకోమని.. ఆయనతోనూ.. ఆయన తండ్రితోనూ తమకు చాలా దగ్గర సాన్నిహిత్యం ఉందని గోవా బీజేపీ ఎలక్షన్ ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్న దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నప్పటికీ.. ఆయన మాటల్లో వినిపించిన తియ్యదనం.. ఉత్పల్ కోరుకున్న సీటును మాత్రం కేటాయించలేదు.దీంతో.. పార్టీకి గుడ్ బై చెప్పేసిన ఉత్పల్.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన గోవాలో.. తాజా ఎన్నికలు ఆ పార్టీకి దెబ్బేసేలా రాష్ట్ర ప్రజల తీర్పు ఉంటుందన్న మాట వినిపిస్తోంది.

ఈసారి ఎన్నికల్లో కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బలమైన నేత కుమారుడైన ఉత్పల్ కు మొండి చేయి చూపటంపై పలువురు కమలనాథుల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఉత్పల్ కోరుకున్న స్థానాన్నిసిట్టింగ్ ఎమ్మెల్యే అటానాసియా మోన్ సె్ర్రెట్ కు కేటాయించారు. 34 మందితో విడుదల చేసిన తొలి జాబితాలో ఉత్పల్ పేరు లేకపోవటంతో.. ఆయన వెంటనే పార్టీకి రాజీనామా చేసి షాకిచ్చారు.

మరోవైపు.. ఉత్పల్‌ పారికర్‌కు ఆప్ కన్వీనర్ కమ్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తమ పార్టీ సీటు ఆఫర్ చేశారు. శివసేన సైతం ఉత్పల్ పారికర్‌కు బాసటగా నిలిచింది. ఆయన పార్టీలోకి వస్తే పనాజిలో తమ అభ్యర్థిని ఉపసంహరించుకుని సైతం టిక్కెట్ కేటాయిస్తామని ప్రకటించటం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నట్లుగా ఉత్పల్ ప్రకటించారు.

దీంతో.. ఈ ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏమైనా ప్రజాదరణ ఉన్న ఒక ప్రముఖ నేత కుమారుడికి సీటు కేటాయించే విషయంలో మోడీషా లెక్కలు అర్థం కాని రీతిగా మారాయి. ఏమైనా.. పార్టీకి అత్యంత విధేయుడు.. విలువలకు ప్రతిరూపంలా నిలిచే ముఖ్యనేత కుమారుడి విషయంలో కమలనాథుల తీరు ఇప్పుడు చర్చగా మారిందని చెప్పక తప్పదు.