Begin typing your search above and press return to search.

అస‌మ్మ‌తి నేత‌లంతా మోడీకి ద‌గ్గ‌ర‌..బాబుకు దూరం!

By:  Tupaki Desk   |   19 July 2018 12:38 PM GMT
అస‌మ్మ‌తి నేత‌లంతా మోడీకి ద‌గ్గ‌ర‌..బాబుకు దూరం!
X
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తరువాత నరేంద్రమోడీ సర్కార్ తొలిసారి అవిశ్వాసాన్ని ఎదుర్కొనబోతోంది. ఆంధ్రప్రదేశ్‌ కు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదంటూ టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిని స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. దీంతో దేశం చూపు పార్ల‌మెంటు వైపు ప‌డింది. ఏం జ‌ర‌గబోతోంద‌నే ఆస‌క్తి నెల‌కొంది. ఈ నేపథ్యంలో సభలో ఏ పార్టీ ఎవరి వైపు అన్నదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి అనూహ్య రీతిలో మ‌ద్ద‌తు పెరుగుతుండ‌గా...విశ్వాసానికి వ్య‌తిరేకంగా బ‌లం చేకూరుతుండ‌గా...టీడీపీ శిబిరం అవాక్క‌య్యే ప‌రిణామాలు జ‌రుగుతున్నాయి. తాజాగా ఇన్నాళ్లు బీజేపీపై ఉప్పునిప్పుగా ఉన్న శివ‌సేన ప‌రిణామం ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొన‌వ‌చ్చు.

అవిశ్వాసాన్ని గట్టెక్కడానికి బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేకు ఫోన్ చేసి ప్రభుత్వానికి మద్దతివ్వాల్సిందిగా కోరారు. దీనికి ఉద్ధవ్ కూడా అంగీకరించడం విశేషం. కొద్ది రోజులుగా బీజేపీ - శివసేన మధ్య సంబంధాలు అంత బాగా లేకపోయినా.. ప్రభుత్వానికి మద్దతివ్వడానికి శివసేన ముందుకొచ్చింది. ఈ మేరకు తమ పార్టీ ఎంపీలదరికీ ప్రభుత్వానికి మద్దతుగా ఓటేయాలని విప్ జారీ చేసింది. మ‌రోవైపు టీఆర్‌ఎస్ స్టాండ్ ఏంటన్నదానిపై పార్టీ అధినేత - ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. చర్చలో పాల్గొంటామని - తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు - ఇతర విభజన హామీలపై మాట్లాడతామని లోక్‌ సభలో టీఆర్‌ఎస్ పక్ష నేత ఏపీ జితేందర్‌ రెడ్డి ఇప్పటికే స్పష్టంచేశారు. అవిశ్వాసానికి మద్దతివ్వాల్సిందిగా టీడీపీ తమను కోరినట్లు కూడా ఆయన తెలిపారు.

తమిళనాడుకు చెందిన అధికార పార్టీ అన్నాడీఎంకే మాత్రం తాము అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వబోమన్న హింట్ ఇచ్చింది. గత సమావేశాల్లో రాష్ర్టానికి చెందిన కావేరీ అంశాన్ని లేవనెత్తి ఎన్ని రోజులు ఆందోళన చేసినా ఏ రాష్ట్రం తమకు మద్దతుగా రాలేదన్న విషయాన్ని తమిళనాడు సీఎం పళనిస్వామి గుర్తుచేశారు. అవిశ్వాస తీర్మానం అన్నది టీడీపీ లేవనెత్తినది అని, దీంతో తమకు సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఓటింగ్‌ కు అన్నాడీఎంకే దూరంగా ఉంటే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ఒడిశా అధికార పార్టీ బిజు జనతాదళ్ కూడా అవిశ్వాస తీర్మాన ఓటింగ్‌ కు హాజరు కాకూడదని నిర్ణయించింది. ఈ లెక్కన అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన టీడీపీతోపాటు కాంగ్రెస్-సీపీఐ- సీపీఎం-ఎన్సీపీ-ఎస్పీ సభ్యులు అవిశ్వాసానికి మద్దతిస్తున్నారు. అయితే ఈ గండాన్ని మోడీ సర్కార్ ఈజీగానే గట్టెక్క‌డం ఖాయ‌మంటున్నారు.

కాగా, ప్రస్తుతం లోక్‌ సభలో మొత్తం సభ్యుల సంఖ్య 533కి పడిపోయింది. వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేయడంతోపాటు బీజేడీ ఎంపీ బైజయంత్ రాజీనామాను లోక్‌ సభ స్పీకర్ సుమిత్ర ఆమోదించారు. అటు కేరళ కాంగ్రెస్ (ఎం) సభ్యుడు కే మణి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ లెక్కన సభలో 266 సభ్యుల మద్దతు ఉంటే బీజేపీ గట్టెక్కుతుంది. కేవలం బీజేపీకే 274 మంది సభ్యుల బలం ఉంది. 18 మంది సభ్యులున్న శివసేన కూడా మద్దతిస్తుండటంతో ఇక బీజేపీకి ఏ ఆందోళన లేదు. మొత్తంగా ఎన్డీయే సభ్యుల సంఖ్య 314గా ఉంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు చర్చ - ఓటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.