Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ పై మోడీ మాటల క్షిపణి దాడి

By:  Tupaki Desk   |   9 Feb 2017 4:51 AM GMT
కాంగ్రెస్ పై మోడీ మాటల క్షిపణి దాడి
X
ప్రధాని మోడీ మాటలు ఎంత పదునుగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. మామూలుగానే మాటకారి అయిన ఆయనకు ఆగ్రహం వస్తే ఎలా ఉంటుంది? తన ప్రత్యర్థిని ఉతికి ఆరేయాలని ఆయనకానీ డిసైడ్ అయితే ఎలా మాట్లాడతారు? లాంటి అంశాలు తాజాగా కళ్లకు కట్టిన వైనమిది. బుధవారం రాజ్యసభలో ప్రసంగించిన ప్రధాని మోడీ.. కాంగ్రెస్ పై ఘాటు చురకలే కానీ.. కోలుకోలేని విధంగా ఉతికి ఆరేశారు. మోడీ ప్రసంగం తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా తయారైందంటే.. క్షిపణి దాడి తర్వాత ఎలాంటి నష్టం వాటిల్లుతుందో.. ఇంచుమించు అలాంటి పరిస్థితే కాంగ్రెస్ కు చోటు చేసుకుంది.

పెద్ద నోట్ల రద్దుపై తమ ప్రభుత్వంపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు.. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత తమ సర్కారు విఫలం చెందిందన్న ఆరోపణల్నిబలంగా తిప్పి కొట్టే ప్రయత్నం చేసిన ప్రధాని మోడీ.. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించే సందర్భంగా రాజ్యసభను వేదికగా చేసుకున్నారు. కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తన మాటల దాడిలో భాగంగా కాంగ్రెస్ లోని పలువురు నేతల్ని టార్గెట్ చేశారు. ఇంకా కచ్ఛితంగా చెప్పాలంటే.. తన జోలికి వస్తే ఏమాత్రం బాగోదన్న హెచ్చరిక ఆయన మాటల్లోనూ.. ప్రసంగంలోనూ స్పష్టం చేశారని చెప్పాలి. ఉదాహరణలతోసహా.. గతంలో జరిగిన ఉదంతాల్ని ప్రస్తావిస్తూ మోడీ చేసిన ప్రసంగం కాంగ్రెస్ నే ఉక్కిరిబిక్కిరి చేయటమే కాదు.. పెద్దఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సభ నుంచి వాకౌట్ చేసిన పరిస్థితి. కాంగ్రెస్ ను అంతలా ఇబ్బంది పెట్టేలా మాట్లాడిన మోడీ మాటల్ని చూస్తే..

= ‘‘ఆర్థిక రంగానికి చెందిన మరే వ్యక్తీ 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో దాదాపు సగం కాలం పాటు దేశ ఆర్థిక వ్యవహారాల్లో కీలకపాత్ర పోషించి ఉండరు. 30 – 35 ఏళ్ల పాటు ఆర్థికనిర్ణయాలతో మన్మోహన్ కు నేరుగా సంబంధం ఉంది. రాజకీయ నాయకులం మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఎన్నోకుంభకోణాలు జరిగినా ఆయనకు మచ్చ రాలేదు. ఎందుకంటే.. బాత్రూంలో రెయిన్ కోట్ వేసుకొని స్నానం చేసే విద్య ఆయన ఒక్కరికే తెలుసు’’ (అవినీతి జరుగుతున్నా ఆ మకిలి తనకు అంటకుండా నేర్పుగా మన్మోహన్ వ్యవహరించారన్న విషయాన్ని ప్రస్తావిస్తూ)

= మన్మోహన్ పై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్న వేళ.. వారిపై మోడీ మరిన్ని చురకలు వేస్తూ..‘‘మీరు గౌరవ మర్యాదలు మీరి వ్యవహరించేటట్లైతే.. దాని రియాక్షన్ ను ఎదుర్కొనే ధైర్యం కూడా ఉండాలి. మేం తగినరతిలో బదులివ్వగలం. ఉన్నతమైన ప్రధాని పదవిని నిర్వహించిన మన్మోహన్ సభలోనే చట్టబద్ధమైన.. వ్యవస్థీకృత దోపిడీ అనే మాటను వాడారు. ఈ మాటను వాడబోయే ముందే ఆయన ఒకటికి యాభై సార్లు కాంగ్రెస్ ఆలోచించి ఉండాల్సింది. ఇటీవల ఒక పుస్తకం విడుదలైంది. ఇది మన్మోహనే రాశారని అనుకొని.. ప్రముఖ ఆర్థికవేత్త అయిన ఆయన ముద్ర ఈ పుస్తకంలో ఉంటుందని అనుకున్నం. కానీ.. పుస్తకం రాసింది వేరే వారని.. కేవలం ముందుమాట మాత్రమే ఆయనరాశారని తర్వాత తెలుసుకున్నా. పెద్దనోట్ల రద్దుపై నాడు రాజ్యసభలో మన్మోహన్ చేసిన ప్రసంగం గురించి కూడా ఈ పుస్తకం విషయంలో జరిగిన మాదిరే జరిగిందనిపిస్తోంది’’ (కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిన స్ర్కిప్ట్ నే మన్మోహన్ చదివారన్న అర్థంలో)

= మన్మోహన్ పై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా రియాక్ట్ అవుతున్న కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి మోడీ మరికొన్ని చురకలు వేస్తూ.. ‘‘నేను ఒక మాట అననే లేదు. వాళ్లకు విషయం ఇట్టే అర్థమైపోయింది.ఇదే సభలో ప్రధానిని మీరు హిట్లర్.. ముస్సోలినీ అన్నారు. అప్పుడు అంత పెద్ద మాటలు అన్నారు. ఇప్పుడు ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు’’

= ‘‘సాధారణంగా ప్రభుత్వం ఏదైనా నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు ప్రభుత్వం ఒకవైపు.. ప్రజలు మరోవైపు ఉంటారు. పెద్దనోట్ల రద్దు విషయంలో ప్రభుత్వం.. ప్రజలు ఒకవైపు ఉన్నారు. మిగితావారు మరోవైపు ఉన్నారు. వారు ప్రజాభీష్ఠానికి భిన్నంగా వ్యవహరించారు. 1972లో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి దివంగత జ్యోతిబసు పెద్దనోట్ల రద్దును సమర్థించారు.వామపక్షాలు మాకు మద్దతు ఇవ్వాలి’’

= ‘‘పెద్ద నోట్ల రద్దు తర్వాత ఉగ్రవాదం.. నక్సలైట్ల మీద ఇది నేరుగా ప్రభావం చూపింది. దేశవ్యాప్తంగా దాదాపు 700 మంది మావోయిస్ట్ లు లొంగిపోయారు. నకిలీ నోట్ల మార్పిడి వ్యాపారంలో ఉన్న శత్రుదేశం (పాక్) వ్యాపారి ఒకరు నోట్ల రద్దు నిర్ణయంతో కుదేలై ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త వినిపిస్తోంది’’

= ‘‘పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా మీరు పది మందిని కోట్ చేస్తే.. నేను 20మందినికోట్ చేయగలను. ప్రపంచంలో ఎక్కడా ఇంతపెద్ద ఎత్తున ఒక నిర్ణయాన్ని అమలు చేయటాన్ని ఆర్థికవేత్తలు ఇంతవరకూ చూడలేదు. ఎందుకంటే ఇంత పెద్ద చర్య తీసుకోవటం ప్రపంచంలోనే ఇదే తొలిసారి. నిజానికి ఆర్థికవేత్తలకు ఇదో రీసెర్చ్ అంశంగా మారుతుంది’’

= ‘‘ఇప్పటివరకూ చిదంబరం స్పందించలేదు. ఆయనొచ్చి ఇప్పుడు మాకు నీతులు వల్లె వేస్తున్నారు. ఎదుటివాళ్లపై ఆరోపణలు చేసే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలి’’

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/