Begin typing your search above and press return to search.

మోడీ విస్తరణ: కేబినెట్ లోకి వీళ్లు ఇన్.. వీళ్లు ఔట్

By:  Tupaki Desk   |   6 July 2021 5:30 AM GMT
మోడీ విస్తరణ: కేబినెట్ లోకి వీళ్లు ఇన్.. వీళ్లు ఔట్
X
హనీమూన్ పీరియడ్ ముగిసిందా? ఇక మోడీ సర్కార్ పై వ్యతిరేకత మొదలైందా? అంటే ఔననే అంటున్నాయి రాజకీయవర్గాలు.. కరోనా పుణ్యమాని మోడీ సర్కార్ పాలన దక్షత సామాన్యులకు అర్థమైందని అంటున్నారు. అంతటి కల్లోలంలోనూ చేష్టలుడి చూసిన మోడీ సార్ పనితనంపై వ్యతిరేకత పెల్లుబుకిందన్న ఆరోపణలున్నాయి. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎటుపోయిందన్న విమర్శలున్నాయి. ఏది ఏమైతేనేమీ కరోనా ఎఫెక్ట్ తో చేతులు కాలిన మోడీ సర్కార్ ఇప్పుడు ఆకులు పట్టుకుంటోంది.

రెండోసారి అధికారంలోకి వచ్చాక మోడీ రెండేళ్ల పాలన తర్వాత తన కేబినెట్ ను ప్రక్షాళన చేయబోతున్నారు. ఈ రెండు మూడు రోజుల్లోనే కేబినెట్ విస్తరణ చేయబోతున్నాడని.. ఈ మేరకు జాబితాను సిద్దం చేశారని చెబుతున్నారు. దీనిపై కసరత్తు పూర్తయిందని అంటున్నారు. ఈ సాయంత్రమే మోడీ ఈ జాబితాపై ఆమోదముద్ర వేస్తారనే ప్రచారం సాగుతోంది. మోడీ కేబినెట్ లో కొందరు కొత్త ముఖాలకు మంత్రివర్గంలో చోటు లభించబోతోందని తెలుస్తోంది.

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ 2024 నాటి సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్రాలకు పెద్దపీట వేసేలా మోడీ కేబినెట్ ను విస్తరించబోతున్నట్టు తెలుస్తోంది. యువకులు, ఉత్సాహవంతులకు ఈ కొత్త టీంలో అవకాశం ఇస్తారని అంటున్నారు.

ఇక రాంవిలాస్ పాశ్వాన్తోపాటు కర్ణాటకకు చెందిన సురేశ్ మరణించడంతో వారి స్థానంలో కొత్త వారిని నియమించనున్నారు. లోక్ జనశక్తి పార్టీ అధినేత, దివంగత కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ కు కేబినెట్ బెర్త్ లభిస్తుందనే ప్రచారం సాగుతోంది. మోడీ ఇలా చిరాగ్ కు న్యాయం చేస్తారని అంటున్నారు. ఎల్జేపీని చీల్చిన పశుపతి పాశ్వాన్ పై మోడీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో వచ్చిన విమర్శలను చిరాగ్ కు పదవి ఇచ్చి కవర్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

ఇక కర్ణాటక నుంచి బీజేపీ ఎంపీ ప్రతాప సింహను కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటారని సమాచారం. ప్రస్తుతం ఆయన మైసూర్ ఎంపీగా ఉన్నారు. వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. యువకుడు , ఉత్సాహవంతుడిగా ఉన్నారు. మంచి వాగ్ధాటి, వివిధ అంశాలపై అవగాహన కలిగి ఉన్నారు. అందుకే ఆయనకు మోడీ అవకాశం ఇస్తారని చెబుతున్నారు.

ఇక కాంగ్రెస్ లో సీనియర్ గా ఉండి.. మధ్యప్రదేశ్ లో ఆ ప్రభుత్వాన్ని కూల్చిన జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్ర కేబినెట్ లోకి తీసుకోనున్నారు. ఆ హామీతోనే ఆయనను బీజేపీలోకి తీసుకున్నారు. పార్టీలో చేరిన కొద్దిరోజులకే బీజేపీ ఆయనను రాజ్యసభకు ఎంపీగా పంపింది.

ఇక అసోంలో తన సీఎం పోస్టును త్యాగం చేసిన బీజేపీ నేత శర్బానంద సోనోవాల్ కు కూడా కేంద్ర కేబినెట్ లో చోటు దక్కబోతోందట.. ఇక యూపీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎంపికైన తెలుగు వ్యక్తి జీవిఎల్ నరసింహరావు పేరు సైతం వినిపిస్తోంది. ఈ సాయంత్రం మోడీ ఈ కీలక భేటి నిర్వహించనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మల తదితరులు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పనితీరు ఆధారంగానే పలువురిని చేర్చుకోవడం.. పలువురికి ఉద్వాసన పలకబోతున్నారు. తుది జాబితాను ఈ సాయంత్రం ఆమోద ముద్ర వేసి రెండు రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణను ప్రధాని చేయబోతున్నట్టు సమాచారం.