Begin typing your search above and press return to search.

అమరావతి శంకుస్థాపనలో పూజ చేసేది మోడీనే

By:  Tupaki Desk   |   14 Oct 2015 4:42 AM GMT
అమరావతి శంకుస్థాపనలో పూజ చేసేది మోడీనే
X
ఏపీ శంకుస్థాపన సందర్భంగా వస్తున్న ప్రధాని ఏం చేస్తారు? దాదాపు గంటన్నర పాటు శంకుస్థాపన వద్ద ఉండే మోడీ.. ఏం చేస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే.. దీనికి సంబంధించిన పక్కా ప్లాన్ ను సిద్ధం చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో అతి ముఖ్యమైన పూజను ప్రధాని మోడీ మాత్రమే చేస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్లాన్ చూస్తే..

శంకుస్థాపన రోజున ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న తర్వాత ప్రధాని మోడీ అక్కడ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో కానీ.. లేదంటే కారులో కానీ అమరావతి ద్వారం వరకూ వస్తారు. ఈ విషయంలో తుది నిర్ణయం చివర్లో తీసుకుంటారు. అమరావతి ద్వారం వద్దకు వచ్చిన మోడీ.. శంకుస్థాపన ప్రాంతానికి చేరుకుంటారు. ఆయన నడిచే మార్గంలో అర్ట్ పెయింటింగ్ ప్రదర్శన.. అమరావతి బౌద్ధ చరిత్ర తెలిపే కళాఖండాలతో పాటు.. భవిష్యత్తు రాజధాని అమరావతి ఎలా ఉంటుందన్న విషయాన్ని చెప్పే చక్కటి పెయింటింగ్ లతో ఆర్ట్ గ్యాలరీని ఉంచనున్నారు.

శంకుస్థాపన ప్రాంతానికి చేరుకునే మోడీకి పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు. అనంతరం ఆయన కాస్త ముందుకు వచ్చి.. హోమగుండంలో ద్రవ్యాలు వేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా ముగ్గురు పురోహితులు మాత్రమే ఉండే వీలుంది. హోమ ద్రవ్యాలు వేసిన తర్వాత వెనుదిరిగి చూడకుండా ఉండాలని పురోహితులు చెబుతున్నారు.

అలా వేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగుతూ ఉండాలి. ఆ తర్వాత రత్ననాస్యం చేస్తారు. ఇక్కడా మోడీ తన స్వహస్తాలతో కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. రత్నాల్ని హోమగుండంలో వేసిన తర్వాత.. శిలాన్యాసం కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ కూడా ప్రధాని వెనక్కి తిరిగి చూడకూడదు. అయితే.. ఈ సంప్రదాయంపై మోడీకి అవగాహన ఉంటుందన్న చర్చ సాగుతోంది.

అయితే.. ముందుస్తుగా చెబితే బాగుంటుందన్న ఆలోచనలో ఏపీ సర్కారు ఉంది. ఆర్ ఎస్ఎస్ తో సుదీర్ఘ సంబంధం ఉన్న ఆయనకు ఇలాంటి వాటి గురించి అవగాహన ఉందని భావించినా.. ముందస్తు సమాచారం ఇవ్వటం ఎందుకైనా మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శిలన్యాసం కార్యక్రమం పూర్తి కాగానే.. వేద పండితులు మోడీకి ఆశీర్వచనం పలుకుతారు. దీంతో పూజ కార్యక్రమం పూర్తి అవుతుంది. ఈ మొత్తం కార్యక్రమం దాదాపు పావు గంట వరకు పడుతుందని భావిస్తున్నారు.

అనంతరం లక్షల మంది చూస్తుండగా శంకుస్థాపన పైలాన్ ను ఆవిష్కరిస్తారు. భద్రత పరమైన చర్యల్లో భాగంగా జామర్లు ఉన్న నేపథ్యంలో.. రిమోట్ తో కాకుండా.. చేతితోనే పైలాన్ ను ఆవిష్కరిస్తారు. ఇక.. శంకుస్థాపన ప్రధాన వేదిక మీద ప్రధానితో పాటు 15 మంది మాత్రమే ఉండనున్నారు