Begin typing your search above and press return to search.

పండగపూట చిర్రెత్తించిన మోడీ

By:  Tupaki Desk   |   23 Oct 2015 4:30 AM GMT
పండగపూట చిర్రెత్తించిన మోడీ
X
అమరావతి శంకుస్థాపన కార్యక్రమం కోసం వచ్చిన ప్రధాని మోడీ వైఖరి ఏపీ ప్రజలకు తీవ్ర నిరాశను కల్పించటమే కాదు.. విపరీతమైన ఆగ్రహం వ్యక్తమయ్యేలా చేసింది. ఏపీ సర్కారు అధికారంలోకి వచ్చి పదహారు నెలల్లో ఇప్పటివరకూ ఏపీకి గుర్తుంచుకునే విధంగా ఏమీ ఇవ్వని ప్రధాని మోడీ నుంచి ఏపీ ప్రజలు ఎంతగానో ఆశించారు.

ఇంతకాలం మౌనంగా ఉన్న మోడీ.. వ్యూహాత్మకంగానే ఉండి ఉంటారని.. తాను ఇవ్వాలనుకున్నది శంకుస్థాపన రోజున ఘనంగా ప్రకటిస్తారని.. ఏపీ ప్రజల్ని ఆనందంతో ముంచెత్తుతారన్న మాట బలంగా వినిపించింది.

అయితే.. అందుకు భిన్నంగా మోడీ ఎలాంటి హామీ ఇవ్వకుండా.. విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తామన్న మాట ఒక్కటి చెప్పి ఊరుకున్నారు. అన్నింటికికంటే.. మోడీ నోటి నుంచి ఎలాంటి హామీ మాట రాకపోవటం ఒక ఎత్తు అయితే.. మన మట్టి.. మన నీరు పేరిట ఏపీ ముఖ్యమంత్రి చేపట్టిన కార్యక్రమాన్ని తనను కూడా కదిలించిందని.. అందుకే తన వంతుగా భారత ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనమైన పార్లమెంటు భవన ప్రాంగణంలోని మట్టిని తీసుకొచ్చానని.. పవిత్ర యమునా జనాల్ని తెచ్చానంటూ.. రెండు పాత్రల్ని వేదిక మీద ఏపీ సీఎం చంద్రబాబుకు ఇవ్వటం మరింత మంట పుట్టించేలా చేసింది.

వరాలు ఇవ్వాల్సిన పెద్దమనిషి.. మట్టి కుండ చేతిలో పెట్టి తన దారిన తాను పోతాడా? అన్న ప్రశ్న పలువురు నోటి నుంచి వినిపించింది. దీనికి తగ్గట్లే.. మోడీ ప్రసంగం తర్వాత ఏపీ రాజకీయ పక్షాలు తీవ్రంగా చెలరేగిపోతూ.. మోడీపై శివాలెత్తారు. ఢిల్లీ నుంచి తీసుకొచ్చి తమ నోట్లో మట్టి కొట్టారన్న విమర్శను పెద్ద ఎత్తున వినిపించాయి.

దేశం మొత్తానికి ఈ రోజు ఒక పండుగ అయితే.. ఏపీ ప్రజలకు మాత్రం రెండు పండగలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించిన మాటను పలువురు ఎత్తి చూపుతూ.. పండగపూట ఏపీ ప్రజలకు మంటెత్తిపోయేలా ప్రధాని మోడీ చేశారని.. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన పెద్ద మనిషి.. చిన్న చిన్న వరాలు కూడా ప్రకటించకపోవటంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొతానికి పండగపూట ఏపీ ప్రజలకు మంటెత్తి పోయేలా మోడీ వైఖరి ఉందనటంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.